రాష్ట్రం కోరిన రూ.234 కోట్లపై స్పందన నిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పక్కదారి పడుతున్న రేషన్ సరకులను కట్టడి చేసేందుకు రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేయదలచిన బయోమెట్రిక్ ఈ-పాస్(ఎలక్ట్రానిక్ పాయిం ట్ ఆఫ్ సేల్) యంత్రాలను సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా లేదు. ఈ పాస్ యంత్రాల ఏర్పాటుకు అయ్యే ఖర్చును భరించాలని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సముఖంగా లేనట్లు తెలుస్తోంది.
దీంతో మొత్తం ఖర్చులో సగమైనా కేంద్రం భరించాలని శుక్రవారం తాజాగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీకి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారధి విజ్ఞప్తి చేశారు. రేషన్ సరుకులు ఏటా 25 నుంచి 34 శాతం వరకు పక్కదారి పడుడున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఏటా వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేయడానికి అన్ని రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈపాస్ యంత్రాల ఏర్పాటును తెరపైకి తెచ్చింది. అయితే వీటి ఏర్పాటుకు సుమారు రూ.234 కోట్ల మేర వ్యయం అవుతుండటంతో ఈ భారాన్ని భరించాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, సంబంధిత శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రానికి పలుమార్లు విన్నవించారు.
అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. శుక్రవారం ఈ పాస్, ఈ పీడీఎస్, సరఫరా వ్యవస్థ నిర్వహణ తదితరాలపై కేంద్ర సంయుక్త కార్యదర్శి ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ మరోమారు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డులకు ఆధార్ సీడింగ్, సరుకుల సరఫరాలో అక్రమాల నివారణకు సరఫరా వ్యవస్థ నిర్వహణపై కమిషనర్ వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 84 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయిందని తెలిపారు.
‘ఈ-పాస్ ’ నిధులపై తేల్చని కేంద్రం
Published Sat, Feb 21 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement