ఘట్‌కేసర్ టౌన్: మళ్లీ ఆధార్ లొల్లి మొదలైంది. ఆధార్ నంబర్లు ఇవ్వని వారికి ప్రభుత్వం సెప్టెంబర్ నెల రేషన్ సరుకులను నిలిపివేసింది. రేషన్ కావాలంటే కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ వివరాలను అందజేయాలని షరతు విధించింది. నిజమైన లబ్ధిదారులైతే వివరాలను అందజేస్తారని ఇవ్వని పక్షంలో బోగస్ కింద పరిగణించవచ్చని సర్కారు ఆలోచన. దీని ద్వారా ఏటా ప్రభుత్వంపై పడుతున్న రూ.కోట్ల భారాన్ని తప్పించుకోవచ్చని భావిస్తోంది.
కార్డులున్న వారిలో చాల మంది అనర్హులున్నారని, ఇతర ప్రాంతాల్లో కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా కార్డులు పొందారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనర్హులను తొలగించేందుకే కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ నంబర్లను ఇవ్వాలని, అనుసంధానం అయితేనే సరుకులు అందుకుంటారని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో 10.07 లక్షల కార్డులుండగా అందులో మరణించిన వారు, ఇచ్చిన చిరునామాలో శాశ్వతంగా నివాసం లేని 1,55,000 మంది లబ్ధిదారులను గుర్తించి సెప్టెంబర్ నెల రేషన్ సరుకులను నిలిపివేశారు. ఇంకా ఆధార్ వివరాలను అందజేయని వారు 2,55,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో మండలంలో 6,250 మందికి రేషన్ సరుకులు నిలిచిపోయాయి.
అనుసంధానం కానివారికి ఇబ్బందులు
బోగస్ రేషన్ కార్డులు ఉన్నవారికి సరుకులను నిలిపివేశామని పౌర సరఫరా శాఖ అధికారులు చెబుతున్నా ఆధార్ అనుసంధానం కానివారు, ఆధార్ లేనివారు వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండుసార్లు ఆధార్ కేంద్రానికి వెళ్లి నమోదుచేసుకున్నా ఇప్పటికీ కార్డులందని వారు కోకొల్లలు. అనుసంధానం కోసం చాలాసార్లు ఆధార్ ఇచ్చినా సరుకులు నిలిపివేశారని పలువురు వాపోయారు. రేషన్ ఆగిన లబ్ధిదారులు కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ వివరాలను అందజేయాలని, అనుసంధానం తర్వాతే సరుకులను అందజేస్తామని డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.
మళ్లీ ‘ఆధార్’ లొల్లి
Published Thu, Sep 11 2014 11:36 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement