సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత రేషన్ సరకుల పంపిణీ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం నుంచే కూపన్లు తీసుకున్న వారికి ఒక్కో కుటుంబానికి కేజీ శనగలు, ఒక్కో సభ్యుడికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు.రెడ్ జోన్ ఏరియాల్లో నేరుగా కార్డుదారుని ఇంటికే ఉచిత రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. తొలి విడతగా మార్చి 29వ తేదీ నుంచి కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
రెండో విడతలో భాగంగా రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలకు బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందిస్తున్నారు. అందరూ ఒకేసారి రేషన్ షాప్ లోకి రాకుండా సమయాలను సూచిస్తూ వాలంటీర్లు కూపన్లు పంపిణీ చేశారు. కార్డుదారులు తమకు ఇచ్చిన కూపన్‌లోని సమయాల్లోనే రేషన్ షాపుకు వచ్చి సరుకులను తీసుకెళ్తున్నారు. ఇక లబ్దిదారులు భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు పకడ్బంధీగా చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్ లేకుండానే సరుకులను అందజేస్తున్నారు.
నేరుగా ఇంటికే రేషన్..!
లాక్‌డౌన్ నేపథ్యంలో రెండో విడత ఉచిత రేషన్ కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రం మచిలీపట్నం నగర పాలక సంస్థలో ఉచిత డోర్ డెలివరీని మంత్రి పేర్ని నాని, ఆర్డీవో ఖాజావలీ ప్రారంభించారు. కార్డులోని కుటుం సభ్యులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం, ప్రతి కార్డుకి కిలో శనగలు పంపిణీ చేశారు.
27 వరకు అందిస్తాం : మంత్రి వెల్లంపల్లి
రెండో విడత ఉచిత రేషన్‌ను ఈ నెల 27వరకు అందిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విజయవాడ తూర్పులో రెండో విడత రేషన్ సరకుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెల్లకార్డు లేకపోయినా పేదవానిరి గుర్తిస్తే సరుకులు అం దిస్తామని తెలిపారు. ముందుగా రెడ్ జోన్ల ప్రాంతాలతో ఇంటికే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నామని, ఆతర్వాత అన్ని ప్రాంతాల వారికి అందిస్తామని చెప్పారు.
►తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరడ గ్రామంలో రెండో విడత బియ్యం పంపిణీని ఆర్డివో చిన్న కృష్ణ ప్రారంభించారు.
►నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు ఆర్‌ఆర్ కాలనీలో రెండో విడత రేషన్‌ను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో పేదలు ఆకలితో వస్తులు ఉండకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు సార్లు రేషన్ అందిస్తున్నారని తెలిపారు.
►కర్నూలు జిలాల్లోని 2436 రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైంది. లాక్‌డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా 2,036 కౌంటర్లు ఏర్పాటు చేసి జిల్లాలోని 11.91 లక్షల కార్డు దారులకు రేషన్ అందిస్తున్నారు.
►వైఎస్సార్ జిల్లా రామరాజుపల్లిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటించి ఉచిత రేషన్ సరకులను అందించారు. రేషన్ సరకులకు వచ్చే ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. కూపన్లలో తెలిపిన సమయానికే రేషన్‌కు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
►వైయస్సార్ జిల్లా రాయచోటిలో తెల్లవారుజామున ఆరు గంటల నుంచి విపత్తు పరిహారం క్రింద ఎపి సర్కార్ అందిస్తున్న ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం కోనసాగుతుంది. సచివాలయ, రెవిన్యూ సిబ్బంది పర్యవేక్షణలో పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. గుంపులు గుంపులుగా లబ్ధిదారులు రాకుండా ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా టైమింగ్ స్లాట్ ఇవ్వడంతో లబ్ధిదారులు సమయపాలన పాటిస్తూ, భౌతిక దూరం వహిస్తూ రేషన్ తీసుకోంటున్నారు.
►తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 16.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. 600 కార్డులు దాటితే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసి రేషన్ సరుకులను అందిస్తున్నారు.
►కృష్ణా జిల్లా నందిగామ నియోజవర్గంలో ఉదయం 6 గంటలకే రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. కేటాయించిన సమయంలో కార్డు దారులను వాలంటీర్లు రేషన్ షాపుకు తీసుకొస్తున్నారు.
►శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 8.29 లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని అర్హులైన 14677 మందిని గుర్తించి వారికి కూడా సరుకులు అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,300 టన్నుల బియ్యం, 824 టన్నుల శనగలు పంపిణీ చేయనున్నారు.
►అనంతపురం జిల్లా కదిరిలో రేషన్ సరుకులను వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డా.సిద్దారెడ్డి ప్రారంభించారు.
►కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రేషన్ దుకాణం షాప్ నెం 1,2,4,5,13,14, 114 లలో ఎమ్మెల్యే ఆర్థర్ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. చౌక దుకాణం వద్ద సామాజిక దూరం పాటించాలని లబ్దిదారులకు అవగాహన కల్పించారు. రేషన్ కోసం క్యూలైన్లలో ఉన్న వారికి మాస్కలు,శానటైజర్లు పంపిణీ చేశారు. 4వ చౌక దుకాణం వద్ద రేషన్ పంపిణీ సరిగ్గా జరగడం లేదని డీలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా, సామాజిక దూరం పాటిస్తూ సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment