రైతుకు సెస్‌ పోటు | Government Trouble With Sez on Farmers | Sakshi
Sakshi News home page

రైతుకు సెస్‌ పోటు

Published Wed, Apr 24 2019 1:56 PM | Last Updated on Wed, Apr 24 2019 1:56 PM

Government Trouble With Sez on Farmers - Sakshi

ఒంగోలు సబర్బన్‌: వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు రైతులు పండించిన పంట ఉత్పత్తులపై మార్కెట్‌ సెస్‌ పేరిట రైతును నిలువు దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. జిల్లాలో వరుసగా ఐదేళ్లు కరువు కరాళనృత్యం చేసినా కనీసం రైతులపై కనికరం కూడా చూపని ప్రభుత్వం మార్కెట్‌ ఫీజు పేరిట ముక్కు పిండి వసూలు చేసింది. అసలే వర్షాలు లేక, అంతంత మాత్రంగా పండిన పంటలను మార్కెట్‌కు తరలించేందుకు రైతులు రోడ్డెక్కితే ఆ పంట ఉత్పత్తులపై మార్కెట్‌ ఫీజు కింద కిలోకు రూపాయి చొప్పున వసూలు చేసింది. ఈ విధంగా జిల్లాలోని 15 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల నుంచి ఒక్క 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.19.71 కోట్లు వసూలు చేసింది.

అయితే విధించిన లక్ష్యాన్ని చేరుకోకపోయినా ఇంత మొత్తంలో కరువు పీడిస్తున్న సమయంలో రైతులు కట్టడమంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే ఇంత మొత్తంలో రైతుల నుంచి వసూలు చేసిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు రైతు సంక్షేమం విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో ఒక్క రైతు బంధు పథకం మాత్రమే అమలులో ఉంది. అయితే ఆ పథకంలో కూడా అత్యల్పంగా 214 మంది రైతులకు జిల్లా వ్యాప్తంగా పండించిన పంటలను మార్కెట్‌ కమిటీ గోడౌన్లలో కుదువ ఉంచుకొని రుణాలు ఇచ్చారు. కేవలం రూ.2.87 కోట్లు మాత్రమే ఇచ్చి రైతులకు ఏదో చేశామని చెప్పుకుంటూ వచ్చారు. వరి ధాన్యం కుదువ పెట్టుకొని 217 మంది రైతులకు,

వరిగలు కుదువ పెట్టుకొని 24 మంది రైతులకు మాత్రమే రుణంగా అందించారు. అది కూడా పచ్చ చొక్కా నేతలకే ఈ రుణాలు కూడా అందాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ ఐదేళ్లలో రైతుల నుంచి మార్కెట్‌ ఫీజు రూపంలో వసూలు చేసింది అక్షరాలా రూ.107.96 కోట్లు.

ఆర్ధిక సంవత్సరం    వసూలు చేసిన ఫీజు  
2014–15          రూ.27.42 కోట్లు
2015–16          రూ.21.07 కోట్లు
2016–17           రూ.21.00 కోట్లు
2017–18         రూ.18.76 కోట్లు
2018–19        రూ.19.71 కోట్లు

ఉచిత వైద్యశిబిరాలు కనుమరుగు: గతంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో రైతులకు, పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి రైతుల ఆరోగ్యంతో పాటు పశువుల ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. అదేవిధంగా ఉచితంగా మందులు కూడా అందించేవారు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ ఊసే మరిచిపోయారు. మార్కెట్‌ ఫీజు పేరిట వసూలు చేయటం మినహా ఎలాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇకపోతే వ్యవసాయ మార్కెట్‌ పాలక కమిటీలను ఏర్పాటు చేసుకొని పదవులు మాత్రం అలంకరించారు. పాలక మండళ్లతో కమిటీలకు అదనపు భారం తప్ప ప్రయోజనం శూన్యంగా మారింది. పాలక మండలి కమిటీలు అలంకార ప్రాయంగానే మిగిలాయి.

ఈ ఏడాది వసూలు చేసిన మార్కెట్‌ ఫీజు మార్కెట్‌ కమిటీలు    వసూలు చేసిన ఫీజు
ఒంగోలు    రూ.1.62 కోట్లు
కందుకూరు    రూ.1.42 కోట్లు
మార్టూరు    రూ.1.32 కోట్లు
పర్చూరు    రూ.2.30 కోట్లు
దర్శి    రూ.1.01 కోట్లు
అద్దంకి    రూ.1.76 కోట్లు
చీరాల    రూ.2.00 కోట్లు
కొండపి    రూ.3.24 కోట్లు
మద్దిపాడు    రూ.1.42 కోట్లు
మార్కాపురం    రూ.0.68 కోట్లు
గిద్దలూరు    రూ.0.76 కోట్లు
పొదిలి    రూ.0.21 కోట్లు
ఎర్రగొండపాలెం    రూ.0.98 కోట్లు
కంభం    రూ.0.54 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement