వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం నేటి (శుక్రవా రం)తో ముగియనుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉద్యమకారులకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ అప్పటి టీఆర్‌ఎస్ పార్టీలో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ రావడంతో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చైర్మన్ పదవికి రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఐదేళ్ల వరకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ డ్రా పద్ధతిలో చైర్మన్‌ల పదవీ కాలాన్ని నిర్ణయించారు.
రిజర్వేషన్ ఇలా..
మొదటిసారి జనరల్, రెండోసారి బీసీ, మూడోసారి ఎస్సీ మహిళ, నాలుగో సారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కాంగ్రెస్‌కు చెందిన మంద వినోద్‌కుమార్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 02–09–2013లో చైర్మన్‌గా నియమితులై 28.02.2015 వరకు కొనసాగారు. రిజర్వేషన్ అమల్లోకి రావడంతో తొలి శాసనసభ స్పీకర్‌గా ఉన్న మధుసూదనాచారి అనుయాయుడు పరకాల నియోజకవర్గానికి చెందిన కొంపెల్లి ధర్మరాజుకు వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. ఆయన 15–10–2016 నుంచి 06–10–2018 వరకు పూర్తిగా రెండేళ్ల పాటు చైర్మన్‌గా పని చేశారు.
మరోసారి పదవి పొడిగించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారుడి కోటాలో అదే నియోజకవర్గానికి చెందిన చింతం సదానందం చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఆయన 21 డిసెంబర్ 2019లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయినప్పటికీ మరో ఆరు నెలల పాటు పొడిగింపు పొందడంతో 19–06–2021వరకు ఏడాదిన్నర పాటు పదవిలో కొనసాగారు.
మరో ఆరునెలలు పొడిగింపునకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పదవి దిడ్డి కుమారస్వామికి దక్కకపోవడంతో మార్కెట్ పదవి కావాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే పట్టుబట్టి దిడ్డి కుమారస్వామి సతీమణి భాగ్యలక్ష్మిని చైర్‌పర్సన్‌గా చేశారు. కాగా.. కాజీపేట, పరకాలకు చెందిన నాయకులకు చైర్మన్ పదవీ ఇవ్వాలని ఇతర పెద్ద నాయకులు ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ రాజకీయాల వల్ల ఉద్యమకారులకు ద క్కకుండా పోయింది. దిడ్డి భాగ్యలక్ష్మి చైర్‌పర్సన్‌గా 19–08–2021నుంచి 18–07–2022 వరకు కొనసాగారు.
మరో ఏడాది పాటు కమిటీ గడువు పెంచాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసినా పొడిగించలేదు. ఈసమయంలోనే పరకాల నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడికి ఈ పదవి కట్టబెట్టాలని జిల్లాకు చెందిన మంత్రి తీవ్రంగా ప్రయత్నించడం వల్ల ఉన్న కమిటీ పొడిగింపులో జాప్యం జరిగింది. కొత్త చైర్మన్ నియామకానికి రిజర్వేషన్ అడ్డంకిగా మారడంతో చివరికి ఇదే కమిటీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో దిడ్డి భాగ్యలక్ష్మి 18–08–2023 వరకు చైర్‌పర్సన్‌గా రెండేళ్ల పాటు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు.
ఈసారైనా దక్కేనా?
వరంగల్ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆప్రాంతానికి చెందిన వారికి చైర్మన్ పదవి దక్కలేదు. గతంలో చైర్మన్ పదవి తన నియోజకవర్గానికే ఇవ్వాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పట్టుబట్టినప్పటికీ వచ్చేసారి రిజర్వేషన్ అమలు అవుతున్నందున తప్పకుండా అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆయన మిన్నకుండిపోయారు.
అందువల్ల ఈసారి వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన వారికే పదవి అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్నికల ముందు నూతన కమిటీ ఏర్పాటు చేసి తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలన్న ఆలోచన సైతం నాయకులు చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారంతో మార్కెట్ పాలకవర్గం పదవీకాలం పూర్తి అవుతున్నందున కొత్త కమిటీని నియమిస్తారా? ఎన్నికలు ముగిసే వరకు స్పెషల్ ఆఫీసర్‌తో పూర్తి చేస్తారా? అనేది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment