prakasam distirict
-
మోడీ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకున్నారు
నందనవనం (సింగరాయకొండ): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరు కున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామ ఎస్సీ కాలనీలో మంగళవారం సాయంత్రం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ పీఎం జీవనజ్యోతి యోజన అనే పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు దానికి పేరు మార్చి చంద్రన్న బీమా అని పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలకు తన పేరు పెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఎమ్‌జీఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో పేదలకు ఉపాధి కల్పించడమే కాక, సిమెంటు రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, శ్మశాన వాటికలకు ప్రహరీలు నిర్మిస్తే చంద్రబాబు మాత్రం గత ఐదేళ్లలో మోడీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విషప్రచారం చేశారని ఆరోపించారు. సమాజంలో ప్రతి పేదవాడిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమని ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు లో పాల్గొని పార్టీ రాష్ట్రంలో బలపడటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.వి. కృష్ణారెడ్డి, దారా సాంబయ్య, రమణారావు, కనుమల రాఘవులు, ఇత్తడి అక్కయ్య, కొణిజేటి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతుకు సెస్ పోటు
ఒంగోలు సబర్బన్: వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులు పండించిన పంట ఉత్పత్తులపై మార్కెట్ సెస్ పేరిట రైతును నిలువు దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. జిల్లాలో వరుసగా ఐదేళ్లు కరువు కరాళనృత్యం చేసినా కనీసం రైతులపై కనికరం కూడా చూపని ప్రభుత్వం మార్కెట్ ఫీజు పేరిట ముక్కు పిండి వసూలు చేసింది. అసలే వర్షాలు లేక, అంతంత మాత్రంగా పండిన పంటలను మార్కెట్‌కు తరలించేందుకు రైతులు రోడ్డెక్కితే ఆ పంట ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు కింద కిలోకు రూపాయి చొప్పున వసూలు చేసింది. ఈ విధంగా జిల్లాలోని 15 వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి ఒక్క 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.19.71 కోట్లు వసూలు చేసింది. అయితే విధించిన లక్ష్యాన్ని చేరుకోకపోయినా ఇంత మొత్తంలో కరువు పీడిస్తున్న సమయంలో రైతులు కట్టడమంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే ఇంత మొత్తంలో రైతుల నుంచి వసూలు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతు సంక్షేమం విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఒక్క రైతు బంధు పథకం మాత్రమే అమలులో ఉంది. అయితే ఆ పథకంలో కూడా అత్యల్పంగా 214 మంది రైతులకు జిల్లా వ్యాప్తంగా పండించిన పంటలను మార్కెట్ కమిటీ గోడౌన్లలో కుదువ ఉంచుకొని రుణాలు ఇచ్చారు. కేవలం రూ.2.87 కోట్లు మాత్రమే ఇచ్చి రైతులకు ఏదో చేశామని చెప్పుకుంటూ వచ్చారు. వరి ధాన్యం కుదువ పెట్టుకొని 217 మంది రైతులకు, వరిగలు కుదువ పెట్టుకొని 24 మంది రైతులకు మాత్రమే రుణంగా అందించారు. అది కూడా పచ్చ చొక్కా నేతలకే ఈ రుణాలు కూడా అందాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ ఐదేళ్లలో రైతుల నుంచి మార్కెట్ ఫీజు రూపంలో వసూలు చేసింది అక్షరాలా రూ.107.96 కోట్లు. ఆర్ధిక సంవత్సరం వసూలు చేసిన ఫీజు 2014–15 రూ.27.42 కోట్లు 2015–16 రూ.21.07 కోట్లు 2016–17 రూ.21.00 కోట్లు 2017–18 రూ.18.76 కోట్లు 2018–19 రూ.19.71 కోట్లు ఉచిత వైద్యశిబిరాలు కనుమరుగు: గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రైతులకు, పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి రైతుల ఆరోగ్యంతో పాటు పశువుల ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. అదేవిధంగా ఉచితంగా మందులు కూడా అందించేవారు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ ఊసే మరిచిపోయారు. మార్కెట్ ఫీజు పేరిట వసూలు చేయటం మినహా ఎలాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇకపోతే వ్యవసాయ మార్కెట్ పాలక కమిటీలను ఏర్పాటు చేసుకొని పదవులు మాత్రం అలంకరించారు. పాలక మండళ్లతో కమిటీలకు అదనపు భారం తప్ప ప్రయోజనం శూన్యంగా మారింది. పాలక మండలి కమిటీలు అలంకార ప్రాయంగానే మిగిలాయి. ఈ ఏడాది వసూలు చేసిన మార్కెట్ ఫీజు మార్కెట్ కమిటీలు వసూలు చేసిన ఫీజు ఒంగోలు రూ.1.62 కోట్లు కందుకూరు రూ.1.42 కోట్లు మార్టూరు రూ.1.32 కోట్లు పర్చూరు రూ.2.30 కోట్లు దర్శి రూ.1.01 కోట్లు అద్దంకి రూ.1.76 కోట్లు చీరాల రూ.2.00 కోట్లు కొండపి రూ.3.24 కోట్లు మద్దిపాడు రూ.1.42 కోట్లు మార్కాపురం రూ.0.68 కోట్లు గిద్దలూరు రూ.0.76 కోట్లు పొదిలి రూ.0.21 కోట్లు ఎర్రగొండపాలెం రూ.0.98 కోట్లు కంభం రూ.0.54 కోట్లు -
కమిషనర్ కార్యాలయం ముట్టడి
కందుకూరు: కార్మికులను తొలగించినందుకు నిరసనగా కార్మికులు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటి కార్యలయంలో శుక్రవారం జరిగింది. పురపాలక సంఘంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న ఐదుగురు కార్మికులను తొలగించినందుకు నిరసనగా ఈ రోజు కార్మికులు కమిషనర్ కార్యాలయన్ని ముట్టడించారు. విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. -
చీరాల చేరుకున్న నిర్మలా సీతారామన్
ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలాసీతారామన్ చీరాల చేరుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతులను ఆమె పరామర్శించనున్నారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు ప్రాంతాలలోని పొగాకు వేలం కేంద్రాలను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పరిశీలిస్తారు. కాగా ఈ రోజు ఉదయం చీరాల రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆమెను రాష్ట్ర బీజేపీ నేతలు కలిశారు. నామినేటెట్ పదవుల్లో బీజేపీ కార్యకర్తలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయంపై చర్చించాలని నిర్మలాసీతారామన్ కు వినతి పత్రం అందజేశారు. -
రూ. 4.5 కోట్లతో నూతన కోర్టు
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్. శేషసాయి, జస్టిస్ సులేన్చౌదరిలు ప్రారంభించారు. శనివారం ప్రారంభించిన ఈ భవనంలో జూనియర్ సివిల్ కోర్టు, జూనియర్ క్రిమినల్ కోర్టులున్నాయి. ఈ భవనాన్ని రూ. 4.5 కోట్ల వ్యయంతో నిర్మించారు. -
వేటకు వెళ్లి ఇద్దరి మృతి
రేచర్ల: ప్రకాశం జిల్లాలో కుందేళ్లను వేటాడేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని రేచర్ల మండలంలో గురువారం వేకువ జామున వెలుగులోకి వచ్చింది. మండలంలోని అరవీటికోట గ్రామానికి చెందిన రసూల్(35), రంగనాయకులు(25) బుధవారం అర్ధరాత్రి తర్వాత కుందేళ్లను వేటాడేందుకు పొలాల్లోకి వెళ్లారు. దీంతో పొలాల్లో ఉన్న విద్యుత్ వైర్లు తగలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. -
ప్రకాశం జిల్లాలో నకిలీ పాస్‌పుస్తకాలు
ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెం మండలం పెద్దబోయనపల్లెలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో నకిలీ పాస్‌పుస్తకాలు వెలుగు చూశాయి. ఈ గ్రామంలో ఐదు నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలు బయటపడ్డాయని, ఇంకా 200 దాకా నకిలీ పుస్తకాలు ఉండవచ్చని తహశీల్దార్ జి. విజయలక్ష్మి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తే చాలా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు బయటపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20మంది గాయపడ్డారు. వివరాలు..జాతీయ రహదారిపై శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డబ్బు కోసమే గొంతు కోశారు
ప్రకాశం : ఆటో డ్రైవరును బ్లేడుతో గొంతుకోసి హత్య చేసిన నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు...కర్నూలు జిల్లా మహానంది మండలం గోకవరం గ్రామానికి చెందిన జాకీర్ హూస్సేన్(23)ను ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీన ముగ్గురు వ్యక్తులు ఒంగోలుకు వెళ్లాలంటూ జాకీర్ ఆటోను కిరాయికి మాట్లాడుకున్నారు. ఆటో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కిష్టంశెట్టి పల్లి దగ్గరకు వచ్చిన తర్వాత జాకీర్‌ను బ్లేడుతో గొంతు కోసి చంపేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు...ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన డి. రాజేశ్(20), కె. బహుదూర్(20), మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన డి. వెంకటేశ్‌లుగా గుర్తించారు. వారు డబ్బు కోసమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాక నిందితులు పాత నేరస్తులుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. (మార్కాపురం) -
నాటుపడవ బోల్తా : దంపతుల మృతి
మద్దిపాడు: ప్రకాశం జిల్లాలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో సోమవారం మధ్యాహ్నం పడవ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో చినగంజాం మండలం కాటంవారిపల్లెకు చెందిన కాటం వెంకటేశ్వర్లు(65), కాటం తాయారమ్మ(60) వృద్ద దంపతులు మృతి చెందారు. ఈ ఘటన మద్దిపాడు మండలం పాత బూరేపల్లి కాలనీ వద్ద జరిగింది. తాయారమ్మ మృత దేహం మాత్రమే లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. వారు అనుమతి లేకుండా చేపల వేటకు వెళ్లినట్టు తెలిస్తోంది.