మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ
నందనవనం (సింగరాయకొండ): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరు కున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామ ఎస్‌సీ కాలనీలో మంగళవారం సాయంత్రం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ పీఎం జీవనజ్యోతి యోజన అనే పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు దానికి పేరు మార్చి చంద్రన్న బీమా అని పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలకు తన పేరు పెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఎమ్‌జీఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో పేదలకు ఉపాధి కల్పించడమే కాక, సిమెంటు రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, శ్మశాన వాటికలకు ప్రహరీలు నిర్మిస్తే చంద్రబాబు మాత్రం గత ఐదేళ్లలో మోడీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విషప్రచారం చేశారని ఆరోపించారు. సమాజంలో ప్రతి పేదవాడిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమని ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు లో పాల్గొని పార్టీ రాష్ట్రంలో బలపడటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.వి. కృష్ణారెడ్డి, దారా సాంబయ్య, రమణారావు, కనుమల రాఘవులు, ఇత్తడి అక్కయ్య, కొణిజేటి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment