సాక్షి, అమరావతి: పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేందుకు రైతన్నలు పడుతున్న వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.
మార్కెట్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏఏంసీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చుచేయగా.. మిగిలిన కొద్దిపాటి సొమ్ములను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసే వారు. దీంతో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఏఎంసీలకు కొత్తరూపునివ్వడంతో పాటు.. రైతు క్షేత్రాల నుంచి మార్కెట్లకు అనుసంధానించే రోడ్లను నిర్మించాలని సంకల్పించింది.
ఇదే లక్ష్యంతో మార్కెటింగ్ సెస్‌ను కాస్త సవరిస్తూ ధాన్యంపై 2శాతం, రొయ్యలపై 1 శాతం, చేపలపై రూ.0.50 శాతం, మిగిలిన అన్నిరకాల నోటిఫైడ్ వ్యవసాయ, లైవ్‌స్టాక్ ఉత్పత్తులపై ఒక శాతం చొప్పున సెస్ పెంపును ప్రతిపాదించింది. ధాన్యం మినహా ఇతర ఉత్పత్తులపై ప్రతిపాదించిన సెస్ వసూలుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
అంతర్గత రహదారులకు పెద్దపీట
మరోవైపు వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను యార్డులు, మార్కెట్లకు తరలించుకునేందుకు వీలుగా రైతు క్షేత్రాల నుంచి ఏఏంసీలకు, ఏఎంసీల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలను అనుసంధానిస్తూ అనుబంధ రహదారుల నిర్మాణం, ఏఎంసీలు, యార్డులు, మార్కెట్లు, చెక్ పోస్టులు, యార్డులు, రైతు బజార్లను ఆధునికీకరించడం, కొత్తగా ఏర్పడిన ఏఎంసీలకు భవనాలతో పాటు కొత్త జిల్లాలకు అనుగుణంగా కార్యాలయ భవనాలు నిర్మించాలని సంకల్పించారు.
ఈ మేరకు ఏపీ మార్కెటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు(ఏపీఎంఐడీపీ)లో భాగంగా రూ.1072.93 కోట్లతో 11,088 కి.మీ. మేర అంతర్గత రహదారుల నిర్మాణం, మరో 9,123 కి.మీ.మేర రహదారుల మరమ్మతులు, రూ.527 కోట్లతో ఏఎంసీలు, యార్డులు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వం పరిపాలనామోదం ఇచ్చింది.
నాబార్డు ద్వారా రూ.1,003.94 కోట్ల రుణం
మార్కెట్ సెస్ రూపంలో ఏటా రూ.550 కోట్ల ఆదాయం వస్తుండగా, ధాన్యంపై సెస్ పెంపు వల్ల గతేడాది రూ.648 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.708 కోట్లు వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదన్న ఆలోచనతో ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలని నిర్ణయించింది. ఆ బా«ధ్యతలను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింది.
ఇటీవలే ఈ ప్రాజెక్టు కోసం గిడ్డంగుల సంస్థకు నాబార్డు రూ.1,003.94 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తంలో రూ.861.53 కోట్లతో అనుబంధ రహదారుల నిర్మాణం, రూ.197.76 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కింద 2024–24 ఆర్థిక సంవత్సరంలో రూ.446.20 కోట్లు, 2025–26లో రూ.669.29 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించారు.
రైతు సంక్షేమం కోసమే..
పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కల్లాల నుంచి మార్కెట్లకు తరలించేందుకు అనువైన రహదారుల నిర్మాణంతో పాటు మార్కెట్ కమిటీల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం రూ.1599.92 కోట్ల అంచనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇటీవలే నాబార్డు రూ.1003.94 కోట్ల రుణం మంజూరైంది.
ఈ నిధులతో 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టనున్న పనులకు పరిపాలనామోదం ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నాం. మౌలిక వసతుల కల్పన కోసం రుణం తీసుకుంటున్నామే తప్ప, ఈ రుణం కోసం రైతులపై పన్నుల భారం మోపుతున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment