ప్రత్యామ్నాయం వైపు.. | ఖరీఫ్‌ సీజ | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయం వైపు..

Published Thu, Jun 20 2019 11:05 AM | Last Updated on Thu, Jun 20 2019 11:05 AM

ఖరీఫ్‌ సీజ - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : వరుణుడు కరుణించడం లేదు. ఖరీఫ్‌ సీజను ప్రారంభమై పక్షం రోజులు గడిచినా వర్షం జాడ లేకుండా పోయింది. రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారు. కనీసం లోటు వర్షపాతం కాదు, ఏకంగా డ్రైస్పెల్‌ నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మోస్రా మండలంలో ఈ సీజనులో కనీసం జల్లులు కూడా పడలేదని వర్షపాతం రికార్డులు పేర్కొంటున్నాయి. అలాగే మిగిలిన 28 మండలాల్లోనూ డ్రైస్పెల్‌ కొనసాగుతోంది. కరువుకు సంకేతాలుగా చెప్పుకునే డ్రైస్పెల్‌ కొనసాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా సాధారణ సగటు వర్షపాతం 1,042 మిల్లీమీటర్లు. ఈనెల 19 వరకు సగటున 111 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉంది. కేవలం 10 మిల్లీ మీటర్లు మాత్రమే వర్షపాతం రికార్డు అయ్యింది. మోస్రా, కోటగిరిల్లో అసలు వర్షమే కురవలేదు.

వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశం
జిల్లాలో డ్రైస్పెల్‌ కొనసాగుతుండటంతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈనెలారులోగా వర్షాలు కురవకపోతే చేపట్టనున్న ప్రణాళికను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా ఏరువాక శాస్త్రవేత్తలను సంప్రదించారు. ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాని పక్షంలో రైతులకు ఆరుతడి పంటల విత్తనాల సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.

ఆందోళనలో రైతన్నలు.. 
వరుణుడి జాడ లేకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్‌లోనూ ఆశించిన మేరకు వర్షం కురవలేదు. దీనికి తోడు ఎండల తీవ్రతకు భూగర్భజలాలు కూడా అడుగంటి పోయాయి. సీజను ప్రారంభమై మూడు వారాలు దగ్గరపడుతున్నప్పటికీ చుక్క వర్షం కురవకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

 ముదురుతున్న నారు.. 
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో ముందుగా నాట్లు వేసుకుంటారు. వర్ని, బోధన్, ఎడపల్లి, నవీపేట్, కోటగిరి వంటి మండలాల్లో ముందుగా వరి నాట్లు వేస్తారు. ఈసారి కూడా చాలా మంది రైతులు నారుమడులు వేసుకున్నారు. ఈనెల 25లోగా నాట్లు వేసుకుంటేనే నారు పనిచేస్తుంది. లేనిపక్షంలో నారు పనికిరాకుండా పోతుంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో నారు పోసి 15 నుంచి 20 రోజులవుతోంది. మరో వారం, పది రోజుల్లో వర్షాలు కురవకపోతే ఈ నారు పనిచేయకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలంటున్న అధికారులు.. 
ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బోర్ల కింద సాగు చేసుకునే రైతులు నీటి వాడకం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బోర్ల వద్ద వరి సాగు చేసే రైతులు స్వల్ప కాలిక, మధ్యకాలిక రకాలను వేసుకోవాలని డాట్‌ సెంటర్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement