కరెంట్ కట్
సాక్షి, ఏలూరు : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి సమ్మె బాట పట్టారు. ఒప్పందం మేరకు వేతన సవరణ అమలు చేయనందుకు నిరసనగా ఉదయం 6 గంటల నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. జిల్లాలోని దాదాపు అన్ని సబ్‌స్టేషన్లలో ఉదయం ఆరు గంటల నుంచి విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు డీఎస్ వరప్రసాద్, కో-కన్వీనర్ భూక్యా నాగేశ్వరావు, కన్వీనర్ సుబ్బారావుల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఏలూరువిద్యుత్ భవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానిక ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం గేట్లు మూసి వేశారు. యాజమాన్యం, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేతన సవరణ చేయాలని, తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. అంతవరకూ ఆందోళన విరమించేది లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించాల్సిందిగా పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. దీంతో ఎస్‌ఈ మద్దతు ప్రకటించారు.
సమ్మెలోకి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు
ఈపీడీసీఎల్ జిల్లా పరిధిలో 2,400 మంది శాశ్వత, తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. వీరిలో అటెండర్‌స్థాయి నుంచి డివిజనల్ ఇంజినీర్ స్థాయి వరకు వివిధ కేటగిరీల్లో వారు పనిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా, పర్యవేక్షణ, సబ్‌స్టేషన్ల నిర్మా ణం, పరిపాలన, అకౌంట్స్, కొనుగోళ్లు, మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ వంటి విధులను వీరు నిర్వర్తిస్తుంటారు. సబ్‌స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా సమ్మె బాట పట్టారు.
అనధికారికంగా విద్యుత్ సరఫరా
జిల్లాలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు 196 ఉన్నాయి. వీటిలో 152 ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్వహణలో, 44 సబ్‌స్టేషన్లు ఈపీడీసీఎల్ ఉద్యోగుల నిర్వహణలోనూ ఉన్నాయి. ఆదివారం ఉదయం కొన్ని సబ్‌స్టేషన్లను ఉద్యోగులు షట్‌డౌన్ చేశారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సిబ్బంది సమ్మెలోనే కొనసాగుతూనే విద్యుత్‌ను పునరుద్ధరించారు. మరోవైపు కాంట్రాక్టు సిబ్బంది ఇంకా సమ్మెలోకి వెళ్లకపోవడంతో వారి నిర్వహణలో ఉన్న సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే సమ్మె కారణాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు కూడా ఉండటంతో వారు సైతం విధులు బహిష్కరించే అవకాశం ఉంది.
కరెంట్ కట్‌తో ప్రజల అవస్థలు
ఉదయం ఆరు గంటల నుంచి కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. గ్రామాల్లో ఉదయం రక్షిత మంచినీటి సరఫరా నిలిచిపోయింది.ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతూనే మధ్యాహ్నం 1 గంటకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. దీంతో విద్యుత్ వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విద్యుత్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళితే జిల్లాలో అంధకారం అలుముకునే పరిస్థితి ఉంది. మండే ఎండలకు తోడు ఎడాపెడా విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలను విద్యుత్ ఉద్యోగుల సమ్మె కలవరపెడుతోంది.
సమ్మె కొనసాగితే..
సమ్మెకు సంబంధించి హైదరాబాద్‌లో అధికారులకు, విద్యుత్ జేఏసీ నేతల మధ్య ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. అవి ఫలప్రదమయితే ఏ క్షణాన అయినా సమ్మె విరమించే అవకాశం ఉంది. ఒక వేళ సమ్మె కొనసాగితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. కాంట్రాక్ట్ సిబ్బంది కూడా సమ్మెలో దిగితే జిల్లా మొత్తం చీకటిగా మారనుంది. అయితే అత్యవసర సేవలైన ఆస్పత్రులు, తాగునీటి సరఫరా విభాగాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూసే అవకాశం ఉంది.