తీగలాగితే
Published Wed, Jan 8 2014 2:41 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
సాక్షి, ఏలూరు :గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లుల నిర్వాహకులు చేస్తున్న విద్యుత్ దోపిడీని ఆ శాఖ అధికారులు బట్టబయలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రైస్‌మిల్లులో తీగను లాగితే పశ్చిమగోదావరి జిల్లాలోనూ డొంకలు కదులుతున్నాయి. రెండురోజులుగా విద్యుత్ శాఖ అధికారులు జిల్లాలోని రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకూ 148 మిల్లులపై దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ వినియోగిస్తున్న 40 మిల్లులపై కేసులు నమోదు చేశారు. వాటి నుంచి రూ.14.30 లక్షలను అపరాధ రుసుంగా వసూలు చేశారు. ఈపీడీసీఎల్ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు డిటెన్షన్ ఆఫ్ ఫిలఫరేజ్ ఆఫ్ ఎనర్జీ (డీపీఈ) విభాగం పర్యవేక్షక ఇంజినీర్ ఎన్.గంగాధర్ (విశాఖపట్నం) పర్యవేక్షణలో మన జిల్లా డీపీఈ విభాగం డీఈ రాజ్‌కుమార్, ఏడీఈలు వెంకటేశ్వర్లు, సత్యమోహన్, హెచ్‌డీ మీటర్ ఏడీఈలు అంబేద్కర్, ఉమామహేశ్వరరావు బృందంగా ఏర్పడి రైస్ మిల్లులపై దాడులు నిర్వహించారు. జిల్లాలో 580 రైస్‌మిల్లులు ఉన్నాయి.
ఇవన్నీ హెచ్‌టీ విద్యుత్ సర్వీసులతో నడుస్తున్నాయి. సాధారణంగా హెచ్‌టీ వినియోగదారులు విద్యుత్ మోసాలకు పాల్పడే పరిస్థితి ఉండదని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. ఎందుకంటే హెచ్‌టీ మీటర్ల రీడింగ్‌ను ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే డీఈ, ఏడీఈ స్థాయి అధికారులు తీస్తుంటారు. మీటర్లో ఏ విధమైన లోపాలున్నా బిల్లులో వచ్చే తేడా వారికి తెలిసిపోతుంది. అంతేకాకుండా ఏ ఫీడర్ పరిధిలో ఎంత లోడ్ పడుతుందనేది కూడా తెలుస్తుంది. అయి నా మిల్లర్లు విద్యుత్‌ను అదనంగా వినియోగిస్తున్నారంటే విద్యుత్ శాఖ స్థానిక సిబ్బంది సహకారం తప్పనిసరిగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement