పరిశ్రమలపై విద్యుత్ పిడుగు
సాక్షి, రాజమండ్రి :
మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టయింది పరిశ్రమల పరిస్థితి. ఏడాదిగా కరెంటు కోతల నుంచి విముక్తి పొందామనుకుంటున్న తరుణంలో మళ్లీ విద్యుత్తు శాఖ పవర్ హాలిడే ప్రారంభించింది. అధికారిక కోతలు లేవంటూనే ఈపీడీసీఎల్ అధికారులు జిల్లాలో పరిశ్రమలకు సైతం సరఫరా నిలుపుచేయడం ప్రారంభించారు. గతంలో పవర్ హాలిడే విధించినప్పుడు ఆందోళనలు చేసిన నిర్వాహకులు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
పరిశ్రమల తీరిలా
జిల్లాలో సుమారు 8500కు పైగా పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. వీరందరూ సుమారు నెలకు 17 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తారు. పవర్ హాలిడే ద్వారా సుమారు మిలియన్ యూనిట్లను ఆదా చేయాలని విద్యుత్తుశాఖ ఆలోచిస్తోంది. ఈ పరిణామం పరిశ్రమలకు పిడుగుపాటుగా మారనుంది. ప్రధానంగా మూడువేలకు పైగా ఉన్న చిన్న పరిశ్రమలకు పవర్ హాలిడే ద్వారా నష్టం వాటిల్లనుంది. ఈ పరిస్థితి 10 శాతం ఉత్పాదకతపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా క్రూసిబుల్స్, రిఫ్రాస్ట్రక్చర్స్, రీసైకిల్డ్ పేపర్‌మిల్లులు, పీచు పరిశ్రమలు లాంటి చిన్న పరిశ్రమలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. జిల్లాలో ఉన్న 40 రీసైకిల్డు పరిశ్రమలు నెలకు రూ. 50 కోట్ల మేర టర్నోవర్ కలిగి ఉన్నాయి. సుమారు రూ. మూడు నుంచి నాలుగు కోట్ల విలువ చేసే ఉత్పాదకత తగ్గుతుందని ఈ పరిశ్రమల వర్గాలంటున్నాయి. మిగిలిన చిన్న పరిశ్రమలు అన్నీ కలిపి నెలకు మరో రూ. 15 కోట్ల వరకూ నష్టం చవిచూసే అవకాశాలు ఉన్నాయి.
హాలిడే ఇలా
2012 సెప్టెంబర్‌లో తొలిసారిగా రాష్ట్రంలో పవర్ హాలిడే ప్రకటించారు. వారానికి మూడురోజులు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. పరిశ్రమల నిర్వాహకుల ఆందోళనతో హాలిడేను వినియోగ నియంత్రణగా మార్చి ఉదయం 60 శాతం, సాయంత్రం 10 నుంచి 30 శాతం విద్యుత్తు వినియోగించుకునేలా మార్పులు చేశారు. ఈ ఆంక్షలను 2013 ఆగస్టులో తొలగించారు. సుమారు ఏడాది పాటు పరిశ్రమలు వివిధ రూపాల్లో విద్యుత్తు వినియోగ ఆంక్షలను భరించాయి. తాజాగా పరిశ్రమలకు వారానికి ఒకరోజు అంటే ప్రతి గురువారం విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిపివేయనున్నారు. విధిగా సంబంధిత వినియోగదారులు ఈ విరామాన్ని పాటించాలని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ ఎస్‌ఈ గంగాధర్ స్పష్టం చేశారు. కరెంటు కొరత ఎక్కువైతే అధిగమించేందుకు మరిన్ని రోజులపాటు సెలవు ప్రకటించే అవకాశాలను అధికారులు కొట్ట్టి పారేయలేకపోతున్నారు. వచ్చే జూన్ వరకూ ఎన్నికల సీజన్ కావడంతో అదనంగా కరెంటు వచ్చే అవకాశాలు లేవు. ఉన్న కరెంటునే సర్దుబాటు చేయాల్సి ఉండడంతో ఈ ఏడాది కోతల వాతలు దండిగా ఉంటాయని తెలుస్తోంది.