rajamundhry
-
పేదల కోసమే నా యుద్ధం: సీఎం వైఎస్ జగన్
-
Antarvedi: వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం ఫొటోలు
-
చంద్రబాబుకు దేశ ప్రధానిపై నమ్మకం లేదు
-
బంగారాన్ని స్క్రూ డ్రైవర్ రూపంలో తరలిస్తూ..
తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుకున్నారు. బంగారాన్ని టూల్ కిట్‌లోని స్క్రూ డ్రైవర్ రూపంలో తరలిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. అయినా గానీ పోలీసులకు చిక్కాడు. పట్టుబడిన బంగారం రెండున్నర కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. గుహాహటి నుంచి చెన్నై వెళ్తున్న రైలులో ఈ బంగారంను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.77 లక్షల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగారం మయన్మార్ నుంచి అక్రమంగా తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ ప్రయాణికుడిని డైరెక్టరేట్ ఆప్ రెవిన్యూ(డీఆర్ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
28న సీఎం చంద్రబాబు రాక
రాజమండ్రిలో ‘జన్‌ధన్ యోజన’కు శ్రీకారం గోదావరి పుష్కర సన్నాహాలపై సమీక్ష సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 28న జిల్లాకు రానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్‌ధన్ యోజన’కు రాజమండ్రిలో ఆయన శ్రీకారం చుట్టనున్నారు. దేశంలో ప్రతి కుటుంబానికీ ఒక బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీ) ఉండేలా, ఇప్పటి వరకూ బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలతో వాటిని ఖాతాలు తెరిపించే లక్ష్యంతో కేంద్రం జన్‌ధన్ యోజనను ప్రవేశపెట్టింది. మన రాష్ర్టంలో ఈ కార్యక్రమాన్ని తొలిదశలో తూర్పుగోదావరి జిల్లాతో పాటు విశాఖ, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి కుటుంబంలో భార్యాభర్తలిద్దరితో జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభింపచేసి, వారికి ఏటీఎం కార్డు తరహాలోనే రూపీకార్డు (స్వదేశీ ఏటీఏం కార్డు) జారీ చేస్తారు. దీనిని సంక్షేమ కార్యక్రమాలకు అనుసంధానం చేయనున్నారు. జన్‌ధన్ కింద బీమా సౌకర్యంతో పాటు ఆరునెలల తర్వాత ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం కల్పిస్తారు. ఈ పథకానికి రాష్ర్టస్థాయిలో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడి ఈ నెల 28న శ్రీకారం చుట్టనుండగా అదేరోజు సాయంత్రం 4 గంటలకు లైవ్ టెలికాస్ట్ ఆన్లైన్ ద్వారా మన రాష్ర్టంలో సీఎం చంద్రబాబు రాజమండ్రి జేఎన్ రోడ్‌లోని చెరుకూరి కల్యాణమండపంలో ప్రారంభించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. కాగా ఈ పర్యటనలో సీఎం గోదావరి పుష్కర సన్నాహాలపై సమీక్షించనున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే (జూన్ 27న) చంద్రబాబు నగరం గ్రామంలో పైపులైన్ పేలుడు సృష్టించిన విషాదాన్ని చూసి, బాధితుల్ని పరామర్శించేదుకు జిల్లాకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ రెండు నెలలకు జిల్లాకు రానున్నారు. సీఎం పర్యటన సన్నాహాలపై కలెక్టర్ నీతూప్రసాద్ మంగళవారం చెరుకూరి కల్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించ నున్నారు. -
పరిశ్రమలపై విద్యుత్ పిడుగు
సాక్షి, రాజమండ్రి : మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టయింది పరిశ్రమల పరిస్థితి. ఏడాదిగా కరెంటు కోతల నుంచి విముక్తి పొందామనుకుంటున్న తరుణంలో మళ్లీ విద్యుత్తు శాఖ పవర్ హాలిడే ప్రారంభించింది. అధికారిక కోతలు లేవంటూనే ఈపీడీసీఎల్ అధికారులు జిల్లాలో పరిశ్రమలకు సైతం సరఫరా నిలుపుచేయడం ప్రారంభించారు. గతంలో పవర్ హాలిడే విధించినప్పుడు ఆందోళనలు చేసిన నిర్వాహకులు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పరిశ్రమల తీరిలా జిల్లాలో సుమారు 8500కు పైగా పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. వీరందరూ సుమారు నెలకు 17 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తారు. పవర్ హాలిడే ద్వారా సుమారు మిలియన్ యూనిట్లను ఆదా చేయాలని విద్యుత్తుశాఖ ఆలోచిస్తోంది. ఈ పరిణామం పరిశ్రమలకు పిడుగుపాటుగా మారనుంది. ప్రధానంగా మూడువేలకు పైగా ఉన్న చిన్న పరిశ్రమలకు పవర్ హాలిడే ద్వారా నష్టం వాటిల్లనుంది. ఈ పరిస్థితి 10 శాతం ఉత్పాదకతపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువగా క్రూసిబుల్స్, రిఫ్రాస్ట్రక్చర్స్, రీసైకిల్డ్ పేపర్‌మిల్లులు, పీచు పరిశ్రమలు లాంటి చిన్న పరిశ్రమలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. జిల్లాలో ఉన్న 40 రీసైకిల్డు పరిశ్రమలు నెలకు రూ. 50 కోట్ల మేర టర్నోవర్ కలిగి ఉన్నాయి. సుమారు రూ. మూడు నుంచి నాలుగు కోట్ల విలువ చేసే ఉత్పాదకత తగ్గుతుందని ఈ పరిశ్రమల వర్గాలంటున్నాయి. మిగిలిన చిన్న పరిశ్రమలు అన్నీ కలిపి నెలకు మరో రూ. 15 కోట్ల వరకూ నష్టం చవిచూసే అవకాశాలు ఉన్నాయి. హాలిడే ఇలా 2012 సెప్టెంబర్‌లో తొలిసారిగా రాష్ట్రంలో పవర్ హాలిడే ప్రకటించారు. వారానికి మూడురోజులు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. పరిశ్రమల నిర్వాహకుల ఆందోళనతో హాలిడేను వినియోగ నియంత్రణగా మార్చి ఉదయం 60 శాతం, సాయంత్రం 10 నుంచి 30 శాతం విద్యుత్తు వినియోగించుకునేలా మార్పులు చేశారు. ఈ ఆంక్షలను 2013 ఆగస్టులో తొలగించారు. సుమారు ఏడాది పాటు పరిశ్రమలు వివిధ రూపాల్లో విద్యుత్తు వినియోగ ఆంక్షలను భరించాయి. తాజాగా పరిశ్రమలకు వారానికి ఒకరోజు అంటే ప్రతి గురువారం విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిపివేయనున్నారు. విధిగా సంబంధిత వినియోగదారులు ఈ విరామాన్ని పాటించాలని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ గంగాధర్ స్పష్టం చేశారు. కరెంటు కొరత ఎక్కువైతే అధిగమించేందుకు మరిన్ని రోజులపాటు సెలవు ప్రకటించే అవకాశాలను అధికారులు కొట్ట్టి పారేయలేకపోతున్నారు. వచ్చే జూన్ వరకూ ఎన్నికల సీజన్ కావడంతో అదనంగా కరెంటు వచ్చే అవకాశాలు లేవు. ఉన్న కరెంటునే సర్దుబాటు చేయాల్సి ఉండడంతో ఈ ఏడాది కోతల వాతలు దండిగా ఉంటాయని తెలుస్తోంది. -
బస్తీల్లో ఇక రణగొణ
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల రాజమండ్రి, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 30న పోలింగ్ వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి కాకినాడ, అనపర్తిలలో నిర్వహణకు కేసుల అడ్డంకి అసలే రొదతో, రద్దీతో ఉండే పట్టణాలు..ఇకపై దాదాపు నెలరోజుల పాటు సమరాంగణాలుగా మారనున్నాయి. మూడేళ్ల జాప్యం తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌విడుదలైంది. జిల్లాలో రాజమండ్రి నగర పాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. వచ్చేనెల రెండున ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. మరో వారంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూలు విడుదలకాగలదని భావిస్తున్న తరుణంలో.. పురపోరును ఎదుర్కోవలసి రావడం రాజకీయ పార్టీలను, నాయకులను.. కత్తి తిప్పే సమయంలోనే విల్లు ఎక్కుపెట్టాల్సి వచ్చినట్టు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాక్షి, రాజమండ్రి : మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం ఉదయం విడుదల అయినా..హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఉండడంతో ఎన్నికలు వాయిదా పడొచ్చని పలువురు భావించారు. అయితే, ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో రాజకీయ పార్టీలకు, నేతలకు పురపోరుకు సన్నద్ధం కాక తప్పడ ం లేదు. జిల్లాలో కాకినాడ నగర పాలక సంస్థ, అనపర్తి నగర పంచాయతీ మినహా (ఈ రెండింటి విషయంలో పరిసర గ్రామాల విలీనానికి సంబంధించి హైకోర్టులో కేసులున్నాయి) రాజమండ్రి నగరపాలక సంస్థ, అమలాపురం, తుని, మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీలలో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ పట్టణాల పరిధిలోని సుమారు 5,44,756 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నిక లు ముంచుకు వస్తాయన్న ముందుచూపుతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు చక చకా శంకుస్థాపనలు చేసేస్తున్న నేతలు.. ముందుగా మున్సిపల్ ఎన్నికల కోడ్ సోమవారం నుంచి అమలులోకి రావడంతో ఖంగు తిన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండడం, రాజకీయ పైరవీలకు తావు లేకుండడంతో కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయనే భయం నేతల్లో కనపడుతోంది. దీంతో ‘అభివృద్ధి పనులను’ పక్కన పెట్టి పురసమరానికి సమాయత్తమవుతున్నారు. ఇదీ పురపోరు క్రమం.. ఈ నెల 10 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు 18వ తేదీ తుది గడువు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. 30న పోలింగ్ జరుగుతుంది. అవసరమైన చోట రీ పోలింగ్ వచ్చే ఒకటిన నిర్వహిస్తారు. రెండున ఓట్లను లెక్కించి, సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తారు. తిరస్కరణ ఓటుపై రాని స్పష్టత ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రవేశ పెట్టిన తిరస్కరణ ఓటు విధానం ఈ ఎన్నికల్లో అమలయ్యేదీ, లేనిదీ ఇంకా స్పష్టత రాలేదని పురపాలక శాఖ రాజమండ్రి రీజియన్ డెరైక్టర్ రమేష్‌బాబు తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘంనుంచి స్పష్టమైన ఆదేశాలు అందాల్సి ఉందన్నారు. ఎన్నికల సిబ్బంది వివరాలు సేకరిస్తున్నామని, మంగళవారం నాటికి యంత్రాంగంపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. ఉక్కిరిబిక్కిరవుతున్న రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలనల నేపథ్యంలో శాసనసభ ఎన్నికలు తథ్యమనుకుంటున్న తరుణంలో వచ్చి పడ్డ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పక్షాలను అయోమయంలో పడేశాయి. విభజనకు సహకరించిన కాంగ్రెస్. టీడీపీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆ పార్టీల డివిజన్ స్థాయి నేతలు సహాయ నిరాకరణ చేస్తున్నందున అభ్యర్థుల ఎంపికే తలపోటుగా పరిణమించనుంది. రాజమండ్రి మేయర్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో వివిధ పార్టీల నాయకులు సమర్థులైన అభ్యర్థినుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. రాజమండ్రిలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన క్యాడర్‌తో చర్చలు జరిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ నగరాధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నేతలు ఎన్నికలపై సమాలోచనలు ప్రారంభించారు. పురపోరుకు యంత్రాంగం సిద్ధం : కలెక్టర్ సాక్షి, కాకినాడ : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నామని కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 511 పోలింగ్ కేంద్రాలుండగా 562 ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. వీడియోగ్రఫీ లేదా వెబ్ కాస్టింగ్‌కు, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మున్సిపల్ కమిషనర్లతో సమావేశమైన కలెక్టర్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పట్టణాల్లో అభ్యంతరకరమైన హోర్డింగ్‌లు, ప్లెక్సీలు, కటౌట్లు తొలగించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీకి జిల్లాస్థాయి అధికారి, ఆర్డీఓలను ఎన్నికల పర్యవేక్షకులుగా నియమిస్తామన్నారు. మంగళవారం నుంచి కలెక్టరేట్లో జరిగే ఎన్నికల శిక్షణ కు కమిషనర్లు హాజరు కావాలని ఆదేశించారు. ప్రవర్తనా నియమావళికి సంబంధించి రాజకీయపార్టీలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. మున్సిపాలిటీల స్థాయిలో కమిషనర్లు పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. -
అధికారులకు ఈపీడీసీఎల్ షాక్
సాక్షి, రాజమండ్రి : ఆరునూరైనా ఆదాయాన్ని స్థిరీకరించుకోవాలని చూస్తున్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) కఠినచర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగానే రాజమండ్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్, విజిలెన్స్ విభాగం డీఈ రాజబాబుల బదిలీలు జరిగాయని ఆ సంస్థ వర్గాలు అంటున్నాయి. గురువారం సాయంత్రం హడావిడిగా జరిగిన ఈ బదిలీలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు జనవరి మొదటి వారంలో జిల్లాలో హెచ్‌టీ వినియోగదారులపై విజిలెన్స్ దాడులు జరిగాయి. ఇప్పటి వరకూ ఎల్టీ రంగానికే పరిమితమైన దాడులు ఉన్నట్టుండి హెచ్‌టీ రంగానికి విస్తరించడం సంచలనం కలిగించింది. కాగా ఈ వినియోగంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఫిర్యాదుల మేరకు నేరుగా విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం రంగంలోకి దిగి ఁఆపరేషన్ హెచ్‌టీ* ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ దాడుల పర్యవసానంగానే ఈ ఇద్దరు అధికారులను బదిలీ చేసినట్టు సమాచారం. హెచ్‌టీ కనెక్షన్లపై వరుస తనిఖీలు గత ఏడాది ఏప్రిల్‌లో అనపర్తి ఏడీఈ పరిధిలోని రాయవరం మండలం పసలపూడిలో ఓ హెచ్‌టీ కనెక్షన్ అసెస్మెంట్లో కనెక్షన్ మంజూరుకు రూ.1.08 కోట్లు చార్జి చేయాల్సి ఉండగా రూ.28 లక్షలు తక్కువగా కట్టించుకున్న అభియోగంపై అక్కడి ఏడీఈని ఇటీవలే శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. అప్పటికే సీఎండీ ఆదేశాల మేరకు డిసెంబరు 28న రాత్రి రాయవరం మండలంలోని ఓ రైస్ మిల్లుపై జరిపిన దాడిలో మిల్లు నిర్వాహకులు మీటర్‌ను ట్యాంపర్ చేసి విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్టు గుర్తించి, రూ.68 లక్షల అపరాధ రుసుం విధించారు. అనంతరం హెచ్‌టీ సర్వీసులపై వరుసగా పది రోజులు జరిపిన తనిఖీల్లో అధిక శాతం అనుమతికి మించిన విద్యుత్తును వినియోగిస్తున్న వైనం వెలుగు చూసింది. ఇదంతా అధికారుల పర్యవేక్షణా లోపంగా పరిగణించినందునే సీఎండీ కఠినచర్యలకు పూనుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత కేసును కూడా పరిగణనలోకి తీసుకుని ఎస్ఈకి కూడా తెలియకుండానే అనపర్తి ఏడీఈని బదిలీ చేసినట్టు సమాచారం. ఇదే క్రమంలో ఎస్ఈ ప్రసాద్‌ను విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయంలో ఆపరేషన్స్ విభాగం జనరల్ మేనేజర్‌గా బదిలీ చేశారు. విశాఖ డీపీఈ విభాగంలో డీఈగా ఉన్న గంగాధర్‌ను పదోన్నతిపై రాజమండ్రి ఎస్ఈగా నియమించారు. రాజమండ్రి డీపీఈ విభాగం డీఈని విజయనగరంలో కన్స్ట్రక్షన్ విభాగానికి బదిలీ చేసి కొత్తగా పదోన్నతి పొందిన పాడేరు ఏడీఈ రాంబాబును రాజమండ్రి డీపీఈ డీఈగా నియమించారు. ఎస్ఈ ప్రసాద్ 2012 జూలై 12న రాజమండ్రి సర్కిల్లో బాధ్యతలు స్వీకరించారు. కాగా బదిలీపై ఆయనను వివరణ కోరగా ప్రమోషన్లలో జూనియర్లకు అవకాశం కల్పించడంలో భాగంగా తమ బదిలీలు జరిగినట్టు చెప్పారు. -
అధికారుల వేధింపులతో ఆర్థిక ఇబ్బందులు
ప్రైవేట్ ట్రావెల్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆరోపణ రాజమండ్రి, న్యూస్‌లైన్ : అధికారుల వేధింపుల కారణంగా ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆధాపడి జీవిస్తున్న 20వేల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రైవేట్ ట్రావెల్స్ వర్కర్స్ అసోసియేషన్ పేర్కొంది. అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి ట్రావెల్స్ నిర్వాహకులు, డ్రైవర్లు, గ్యారేజీ కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట రమణ (గెడ్డం రమణ) మాట్లాడుతూ, పాలెం సంఘటన తర్వాత ప్రైవేటు బస్సుల డ్రైవర్లను రవాణా శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. యాజమాన్యాలు చేసిన తప్పులకు డ్రైవర్లను ఇరికించి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో డ్రైవర్లకు స్టేషన్ బెయిల్ వచ్చేదని, ఇప్పుడైతే మూడు నెలల వరకూ బెయిలు ఇవ్వడం లేదన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడే అధికారులు స్పందిస్తున్నారని, అలాకాకుండా మొదటినుంచీ ఒకేలా వ్యవహరిస్తే యాజమాన్యాలు, వర్కర్లు దానికనుగుణంగా నడుచుకునేవారన్నారు. అధికారుల వేధింపులకు నిరసనగా ఆర్డీవో, ఆర్టీఏ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. పాలెం బస్సు దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
కడతేరిపోయేంత కష్టమేమొచ్చిందో?
పూత, పిందెలతో ఉన్న పచ్చని చెట్టు పెనుగాలికి కూకటివేళ్లతో నేలకూలినట్టు- పిల్లాపాపలతో కళకళలాడుతున్న ఓ కుటుంబం మృత్యువు ఒడిలో ఒరిగిపోయింది. నూరేళ్లు కష్టంలో, సుఖంలో తోడుగానీడగా ఉంటానన్న వాడే ఆమెను కడతేర్చాడో లేక ఏ కష్టానికి ఎదురీదలేకో వారిద్దరూ కలిసే కన్నబిడ్డలతో సహా కడతేరిపోవాలని నిర్ణయించుకున్నారో.. ఆ దంపతులు, వారి ఇద్దరి పాపలు.. ఎవరికీ చెప్పకుండా మౌనంగా, అంతుబట్టని మర్మంగా ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. మూడు పదులు నిండకుండానే.. బహుశా.. తమ మరణశాసనం తామే రాసుకున్న ఆ ఇద్దరూ ముద్దుల మూటల్లాంటి తమ ఇద్దరు బిడ్డలను కూడా వెంట తీసుకుపోయారు. సాక్షి, రాజమండ్రి/న్యూస్‌లైన్, కంబాలచెరువు : రాజమండ్రి రిలయన్స్ మార్ట్‌లోని బేకరీలో చెఫ్‌గా పని చేసే రౌతు చిన్నమనాయుడు (28), అతడి భార్య లక్ష్మి (23), కుమార్తెలు తేజ (3), గాయత్రి (ఏడాదిన్నర) శుక్రవారం శేషయ్యమెట్టలోని వారి ఇంట్లో విగతజీవులై కనిపించారు. ఉదయం పదిన్నర సమయంలో పొరుగింటి పిల్లలు చిన్నమనాయుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. ఎంత తట్టినా ఎవరూ పలకకపోయే సరికి పక్కనే ఉన్న కిటికీ లోంచి తొంగి చూడగా వేలాడుతున్న చిన్నమనాయుడి కాళ్లు కనిపించాయి. పిల్లలు చెప్పిన విషయాన్ని పెద్దలు వెంటనే పోలీసులకు తెలిపారు. డీఎస్పీ నామగిరి బాబ్జి, ట్రైనీ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ రమేష్ ఆ ఇంటికి చేరుకుని వీఆర్వో సమక్షంలో తలుపులు పగులకొట్టారు. తల్లీబిడ్డల మృతదేహాలు నేలపై పడి ఉండగా చిన్నమనాయుడు ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. తల్లీబిడ్డల మృతదేహాలనుంచి తీవ్ర దుర్గంధం రావడం, బ్లేడుతో కోసుకున్నట్టు చిన్నమనాయుడి ఎడమచేతి మణికట్టు నుంచి స్రవించిన నెత్తురు గడ్డ కట్టకుండా పల్చగా ఉండడంతో తల్లీబిడ్డలు మృతి చెంది రెండు రోజులవుతుందని, చిన్నమనాయుడు శుక్రవారం ఉదయమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. తల్లీబిడ్డల నోటి నుంచి నురుగు రావడంతో వారి మృతికి విషమేదో కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. బుధవారమే భార్యాబిడ్డలకు విషమిచ్చిన నాయుడు రెండు రోజుల తర్వాతతొలుత మణికట్టు కోసుకుని, అనంతరం ఉరి వేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అయితే లక్ష్మి మెడ పైన కూడా కమిలినట్టు ఉండడంతో రెండు రోజుల క్రితం ఆమె కూడా ఉరి వేసుకుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆమెను నాయుడు కిందకు దించి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఆ ఇంట్లో ఎలాంటి పురుగుమందుల డబ్బా కనిపించకపోవడంతో నాయుడు భార్యాబిడ్డల మరణం తర్వాత ఎక్కడో పారేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కానీ, ఎలాంటి విష పదార్థం కానీ కనిపించలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చి, నాయుడి కుటుంబ నేపథ్యాన్ని క్షుణ్నంగా ఆరా తీస్తే తప్ప పూర్తి వివరాలు చెప్పలేమని డీఎస్పీ బాబ్జీ పేర్కొన్నారు. ఏ బలమైన కారణం బలిగొందో? చిన్నమనాయుడి కుటుంబం విషాదాంతానికి ఆర్థిక ఇబ్బందులే కారణ ం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నాయుడికి సొంత ఊరిలో అప్పులు ఉన్నట్టు తెలియడంతో పాటు ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంట్లో పడుకునేందుకు మంచం కూడా లేకపోవడం, వంట సామాన్లు కూడా చాలీచాలనట్టు ఉండడం, పోపుల పెట్టె నిండుకుని ఉండడం, బియ్యం నాలుగైదు కిలోలు మాత్రమే ఉండడాన్ని బట్టి ఆర్థికంగా చిక్కుల్లో ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. మృతదేహాల శారీరక పరిస్థితి, ముఖ కవళికలను బట్టి రెండురోజుల నుంచి భోజనం చేసి ఉండకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే చిన్నమనాయుడికి అప్పులేమీ లేనట్టు అతని కుటుంబీకులు చెబుతున్నారు. అలాంటప్పుడు కుటుంబ మంతా ఇలా అంతమైపోవడానికి ఏ బలమైన కారణం ప్రేరేపించి ఉంటుందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంతకీ వీరు ఆత్మహత్య చేసుకునేందుకు మరో కారణం ఏమైనా ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఆలుబిడ్డలంటే ఎంతో అపురూపం.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ సమీపంలోని లుంబూరుకు చెందిన చిన్నమనాయుడికి, అదే జిల్లా కొండాపురానికి చెందిన లక్ష్మికి 2009లో వివాహమైంది. తండ్రితో విభేదాలు తలెత్తడంతో చిన్నమనాయుడు భార్య, పిల్లలతో హైదరాబాద్ వెళ్లి ఓ బేకరీలో పనికి కుదిరాడు. అక్కడ బేకరీ వంటకాల తయారీలో నైపుణ్యం సంపాదించిన చిన్నమనాయుడు ఏడాదిన్నర కిందట రాజమండ్రి వచ్చి పుష్కరాల రేవు సమీపంలోని రిలయన్స్ మార్ట్ బేకరీలో రూ.12,500 జీతానికి చేరాడు. తండ్రితో పంతం కొద్దీ తన ఇంటి గడప తొక్కని నాయుడు మధ్య మధ్య అత్తగారింటికి మాత్రం వెళ్లి వచ్చేవాడు. నాయుడికి ఉద్యోగం, కుటుంబం తప్ప మరో వ్యాపకం లేదని, పెళ్లాం, పిల్లలను అపురూపంగా చూసుకునే వాడని సహోద్యోగులు అంటున్నారు. అలాంటి కుటుంబానికి ఎలాంటి కష్టం ఎదురై, ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారోనని కంట తడిపెడుతున్నారు. ఇరవై రోజుల క్రితం నాయుడి కుటుంబం అన్నవరం వెళ్లి దైవదర్శనం చేసుకుందని, ఇంతలోనే వారంతా శాశ్వతంగా ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చూస్తామనుకోలేదు.. చిన్నమనాయుడు నెమ్మదస్తుడు. స్థానికంగా అప్పులు లేవు. కుటుంబాన్ని రాజమండ్రి తీసుకువచ్చే వరకూ లక్ష్మీవారపుపేటలో కొందరు స్నేహితులం అంతా కలిసి ఉండేవాళ్లం. తర్వాత ఇల్లు మారాడు. డ్యూటీ కచ్చితంగా చేసేవాడు. మంగళవారం సెలవు తీసుకున్న నాయుడు బుధవారం డ్యూటీకి వచ్చాడు. గురువారం రాలేదు. ఇంటి వెళ్లేసరికి తాళం వేసి ఉంది. కానీ ఇప్పుడు ఇలా చూస్తామనుకోలేదు. - శ్రీను, చిన్నమనాయుడి సహోద్యోగి గుట్టుగా ఉండేవారు.. శుక్రవారం ఉదయం ఆరుగంటలప్పుడు నేను డ్యూటీకి బయల్దేరుతుంటే నాయుడు ఇంట్లోకి వెళ్తూ కనిపించాడు. తర్వాత 11 గంటలకు ఇంటికి వచ్చే సరికి కుటుంబం అంతా చనిపోయారన్నారు. ఈ ఘోరాన్ని నమ్మలేకపోతున్నాను. ఎదురుగా ఉంటున్నా వారి పరిస్థితి తెలిసేది కాదు. అంత గుట్టుగా ఉండే ఆ దంపతులకు ఏమి కష్టం వచ్చిందో? - లక్ష్మి, చిన్నమనాయుడి పొరుగింటి వాసి, శేషయ్యమెట్ట ఒకటో తేదీకల్లా అద్దె ఇచ్చే వాడు.. మా ఆయన పనిచేసే చోటే పనిచేస్తున్నాడు కదా అని ఇల్లు అద్దెకు ఇచ్చాం. మేం కొంచెం దూరంలోని వేరే ఇంట్లో ఉంటాం. అద్దె రూ.1700 ఏ నెలకు ఆనెల ఒకటోతేదీకల్లా ఇచ్చేసేవాడు. ఆ దంపతులు బయట వాళ్లతో చాలా రిజర్వుడుగా ఉంటారు. రోజూ పిల్లలకు అన్నీ కొనిపెడతాడు. గొడవలు కూడా లేవు. కానీ ఇలా ఎందుకు చేశారో ఆర్థం కావడంలేదు. - సత్యవతి, చిన్నమనాయుడి ఇంటి యజమానురాలు -
ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరతపై దృష్టి
భీమడోలు, న్యూస్‌లైన్ : జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉందని, సమస్యపై దృష్టి సారిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు(రాజమండ్రి) డాక్టర్ డి.షాలినిదేవి అన్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువార ం జిల్లా ైవె ద్య ఆరోగ్యశాఖాధికారిణి టి.శకుంతల కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారిణి ఆస్పత్రిలో లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పలు విభాగాలు, రికార్డులను పరిశీలించారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీ షాలినిదేవి మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్ట్, మత్తు వైద్యుడు, పిల్లల వైద్యులు అవసరమని, అయితే జిల్లాలో పూర్తిస్థాయిలో ఏ సీహెచ్‌సీలో ఆ ముగ్గురు వైద్యులు లేరన్నారు. సమస్యను అధిగమించేందుకు శ్రద్ధ వహిస్తామన్నారు. జననీ సురక్ష యోజన పథకం లబ్ధికి ఆధార్ సీడింగ్ తప్పనిసరన్నారు. డీఎంహెచ్‌వో శకుంతల మాట్లాడుతూ మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద జిల్లాలో ప్రతి ఏటా సబ్ సెంటర్‌కు రూ.10 వేలు అందించే వారమని, ప్రస్తుతం రూ. 7500లు తొలి విడతగా అందించినట్లు తెలిపారు. జిల్లాలో 73 పీహెచ్‌సీలు ఉండగా కొత్తగా మార్టేరులో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 25 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీని ఉపాధి కల్పనాధికారి కార్యాలయానికి అప్పగించినట్లు చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 13న చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 19 కాంట్రాక్ట్ వైద్యుల పోస్టుల్లో ఐదుగురిని నియమించినట్లు చెప్పారు. అనాసక్తి కనబర్చిన 14 మందిని బ్లాక్ లిస్ట్‌లో ఉంచామన్నారు. వైద్యులు క్రాంతిభూపతి, భరత్, శాంతికమల, సిబ్బంది పాల్గొన్నారు. వేతనాలు ఆన్లైన్లో చెల్లించండి ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : ఆశ కార్యకర్తలకు వేతనాల చెల్లింపులో ఆలస్యానికి తావు లేకుండా ఇకపై ఆన్లైన్ ద్వారా చెల్లించాలని రీజినల్ డెరైక్టర్ డాక్టర్ షాలినిదేవి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులకు ఆదేశాలిచ్చారు. గురువారం డీఎంహెచ్‌వో కార్యాలంయలో జరిగిన ఆశ నోడల్ ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆశ కార్యకర్తల సేవలు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో భాగంగా వారి ద్వారా ఆసుపత్రుల్లో ప్రసవాలపై గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ శకుంతల మాట్లాడుతూ ఈనెల 19న పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతానికి ఆశ కార్యకర్తలు కృషి చేయూలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విస్తరణాధికారి సీహెచ్ నాగేశ్వరరావు, అధికారులు నాగమణి, లిడియా పాల్గొన్నారు. -
బిల్లు చూస్తే బైర్లే
సాక్షి, రాజమండ్రి : షాక్ కొట్టాలంటే కరెంటు తీగలే పట్టుకోనక్కరలేదు.. ఇకపై వచ్చే బిల్లుల్ని తాకినా చాలు. ప్రభుత్వం ఏడాది తిరక్కుండా మరోసారి ప్రతిపాదిస్తున్న చార్జీల పెంపుతో బిల్లు చూసిన వెంటనే మీటర్లో చక్రంలా జనం కళ్లు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రతిపాదనలతో ప్రధానంగా మధ్యతరగతి, పేదవర్గాల పైనే భారం పడనుంది. ఈ ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణా మండలి యథాతథంగా ఆమోదిస్తే జిల్లాపై పడే అదనపు భారం నెలకు సగటున రూ.14.8 కోట్లని ప్రాథమిక అంచనా. అసలే ప్రకృతి విపత్తులతో అనేక విధాలుగా నష్టపోయిన జిల్లా ప్రజలకు విద్యుత్ చార్జీల తాజా పెంపుదల పుండుపై కారం కానుంది. జిల్లాలో వినియోగం ఇలా.. జిల్లాలో 14 లక్షల మంది విద్యుత్తు వినియోగదారులు ఉండగా నెలకు సుమారు 140 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగమవుతోంది. ఇందు లో వివిధ కేటగిరీలకు చెందిన 12.10 లక్షల మంది గృహ వినియోగదారులు (నవంబరు లెక్కల ప్రకారం) నెలకు సుమారు 96.5 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు. పెంచనున్న చార్జీలతో వీరిపై పడే అదనపు భారం రూ.11.58 కోట్లు ఉండగలదని అంచనా. చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు నిర్వహిస్తున్న కేటగిరీ-2కి చెందిన 1,12,000 వినియోగదారులు 16.5 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు. వీరిపై పడనున్న భారం రూ.1.65 కోట్లని అంచనా. ఇంకా చిన్న, కుటీర పరిశ్రమలకు సంబంధించి 9400 కనెక్షన్లు ఉండ గా 17 మిలియన్ యూనిట్లు వినియోగమవుతోంది. వీరిపై పడే భారం రూ.0.87 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ధార్మిక,సేవా సంస్థలకు పంపిణీ అయ్యే వినియోగం ఒక మిలియన్ యూనిట్లుగా ఉంది. ఈ కేటగిరీలో ఉన్న 14,000 కనెక్షన్లకు అదనంగా పడనున్న భారం రూ.15 లక్షల వరకూ ఉండనుంది. ఇంకా పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలోని 10 వేలకు పైగా నీటి పథకాలు, వీధిలైట్ల కనెక్షన్లపై పడే అదనపు భారం రూ.55 లక్షల వరకూ ఉండబోతోంది. జిల్లాలో తాజా వినియోగం లెక్కల ప్రకారం 300 యూనిట్లలోపు విద్యుత్తు వాడకందారులు 11.30 లక్షలకు పైగా ఉన్నారు. వీరిపైనే చార్జీల భారం ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. -
సదుపాయాలు అరకొరే..
సాక్షి, రాజమండ్రి : పల్లెల్లో ప్రజారోగ్య పరిరక్షణకు ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాలు (సబ్ సెంటర్లు) సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా యి. అనేక చోట్ల అద్దె ఇళ్లల్లో, శిథిల భవనాల్లో నిర్వహించాల్సిన దుస్థితి. వీటికి కొత్త భవనాలు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. జిల్లాలో 103 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 20 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), ఏడు ఏరియా ఆస్పత్రుల పరిధిలో 809 ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిని ఏఎన్ఎంలు నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం ఏఎన్ఎం సబ్ సెంటర్లో ఉంటూ.. 24 గంటలూ పేదలకు అందుబాటులో ఉంటారు. రోగులకు ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే సమీప పీహెచ్‌సీలకు తరలించేందుకు ఇక్కడ సదుపాయాలు అందుబాటులో ఉండాలి. కేవలం 130 మాత్రమే ఏఎన్ఎం క్వార్టర్లతో కలిసి ఉన్నాయి. మిగిలిన 639 అద్దె ఇళ్లల్లోనే ఉండ గా సుమారు 400 కేంద్రాలు మందులు నిల్వ చేసుకునే వీలు కూడా లేని స్థితిలోఏఎన్ఎంల ఇళ్లలోనే కొనసాగుతున్నాయి. పక్కా భవనాలు కావాల్సిన సబ్ సెంటర్లు వందల సంఖ్యలో ఉండగా, ఈ ఏడాది 23 కేంద్రాలకు మాత్రమే భవనాలు మంజూరయ్యాయి. కనీసం మరో వంద మంజూరవుతాయని భావించిన అధికారులకు నిరాశే మిగిలింది. కనీస సదుపాయాలకూ కరువే.. జిల్లాలో ప్రతి 5 వేల మందికి ఒక సబ్ సెంటర్ ఉంది. గ్రామీణ ప్రజలు చిన్నచిన్న వ్యాధులకు వీటిపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలోని సమస్యాత్మకమైన 55 పీహెచ్‌సీల పరిధిలోని సుమారు 300 సబ్ సెంటర్లలో రోగులను పరీక్షించేందుకు కూడా సదుపాయాలు లేవు. 2012-13లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ చేసిన సర్వే ప్రకారం 21 సబ్సెంటర్లలో తాగునీరు, కరెంటు, టాయ్లెట్లు కూడా లేవని వెల్లడైంది. ప్రతిపాదనలు పంపాం : డీఎంహెచ్ఓ పీహెచ్‌సీలకు భవనాల కొరత తీరినా జిల్లాలో సబ్ సెంటర్లకు పక్కా భవనాల అవసరం ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి చెప్పారు. మరిన్ని భ వనాలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వీటికి అనుబంధంగా అంగన్వాడీ కేం ద్రాలను నిర్మించాలని కోరామన్నారు. -
కలిసి ఉంటేనే కలిమి
సాక్షి, రాజమండ్రి : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలంటారు. అలాంటి పల్లెల ప్రతినిధులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. సమైక్యతే తమ అభిమతమని ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ఈ మేరకు తీర్మానాలు చేసి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపు మేరకు జిల్లాలో పార్టీ శ్రేణుల చొరవతో శుక్రవారం మండలాల వారీగా పంచాయతీల పాలకవర్గాల సమావేశాలు నిర్వహించి రాష్టాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానాలు చేశాయి. రాజమండ్రి రూరల్ నియోజకర్గ వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కడియం మండలంలోని పంచాయతీ పాలకవర్గాలు ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించాయి. కాగా గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో సమైక్య దీక్షలు కొనసాగుతున్నాయి. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచ్‌లు పాలకవర్గాలతో సమైక్య తీర్మానాలు చేశారు. పార్టీ కో ఆర్డినేటర్ ఏజేవీబీ బుచ్చిమహేశ్వరరావు నేతృత్వంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో 30 పంచాయతీల్లో సర్పంచ్‌లు సమైక్య తీర్మానాలు చేశారు. పార్టీ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, మరో నేత భూపతిరాజు సుదర్శనబాబు, పెన్మత్స చిట్టిరాజు, పెయ్యల చిట్టిబాబు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం ఆదుర్రు పంచాయతీలో రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ ఆధ్వర్యంలో సర్పంచ్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన సమైక్య తీర్మానం చేశారు. మలికిపురం, రాజోలు మండలాల్లో పంచాయతీ పాలకవర్గాలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాయి. కో ఆర్డినేటర్లు మట్టా శైలజ, మత్తి జయప్రకాష్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో పంచాయతీ సర్పంచ్‌లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు సమైక్య తీర్మానాలు చేయించారు. పెద్దాపురం మండలంలోని పంచాయతీల్లో పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు సమైక్యతే తమ అభీష్టమని తీర్మానించారు. తుని నియోజకవర్గంలోని 51 పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో సమైక్య తీర్మానాలు ఆమోదించారు. హంసవరం పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో రాజా స్వయంగా పాల్గొన్నారు. తునిలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఏలేశ్వరంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. ఏలేశ్వరం మండలం రమణ య్యపేటలో నియోజక వర్గ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో సర్పంచ్ ఎలంపర్తి అప్పలనర్స సమైక్యాంధ్రకు మద్దతుగా పాలకవర్గంతో తీర్మానం చేయించారు. జగ్గంపేటలో గ్రామ సభ జగ్గంపేట మండలంలో సుమారు 30 పంచాయతీల్లో రాష్ట్ర సమైక్యతను పరిరక్షించాలని కోరుతూ తీర్మానాలు చేశారు. జగ్గంపేట మెయిన్‌రోడ్డులో సర్పంచ్ కె.ప్రసన్నరాణి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పాలకమండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మండపేట నియోజక వర్గంలోని కపిలేశ్వరపురం, రాయవరం, మండపేట రూరల్ మండలాల్లోని పలు పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి వీర వెంకట సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సమైక్య తీర్మానాలు చేశారు. అడ్డతీగల మండలంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో పలు పంచాయతీల్లో తీర్మానాలు చేశారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పలు పంచాయతీల్లో సమైక్య తీర్మానాలు చేసి ప్రధానికి, కేంద్ర మంత్రికి పంపనున్నారు. శుక్రవారం 254 పంచాయతీల్లో తీర్మానాలు చేశారు. కొనసాగుతున్న దీక్షలు : కాగా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ప్రత్తిపాడు నియోజక వర్గం ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు శుక్రవారంతో ముగి శాయి. 31 రోజులు జరిగిన దీక్షలను కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు విరమింప చేశారు. -
వార్డెన్ నరకం చూపుతున్నారు
రంపచోడవరం, న్యూస్‌లైన్ : తమకు మంచి భోజనం పెట్టడం లేదని, పెట్టేది కూడా అరకొరగా ఉంటోందని రాజమండ్రిలోని గిరిజన మేనేజ్మెంట్ హాస్టల్ విద్యార్థులు గురువారం ఐటీడీఏ పీఓ నాగరాణికి ఫిర్యాదు చేశారు. వార్డెన్ కృష్ణమోహన్ తమకు నరకం చూపిస్తున్నారంటూ వాపోయారు. రంపచోడవరం ఐటీడీఏ పీఓ సి. నాగరాణిని వారు గురువారం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంచి భోజనం పెట్టడం లేదని, అడిగితే పోయి ఐటీడీఓ ిపీఓతో చెప్పుకోండి అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తున్నట్టు వారు తెలిపారు.ప్రతీ రోజూ కనీసం 10 మందికి ఆహారం సరిపోవడం లేదన్నారు. ఏటీడబ్ల్యూఓ పల్లయ్య హాస్టల్‌ను సందర్శించినప్పుడు వార్డెన్ మెను ప్రకారం ఆహారం అందించడం లేదని చెప్పామని, విద్యార్థులకు ఇష్టప్రకారం ఆహారం ఇవ్వాలని ఆయన వార్డెన్‌కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. 16 మంది ఇంటర్ విద్యార్థులకు హాస్టల్లో ఇప్పటికి ప్రవేశ నెంబర్లు ఇవ్వలేదన్నారు. దాని గురించి అడిగితే రూ. 50 వేలు అవుతుందని, అది మీరు పెట్టుకుంటారా అంటూ వార్డెన్ విరుచుకుపడుతున్నారన్నారు. ఓఎన్జీసీ హాస్టల్‌కు ఇచ్చిన పుస్తకాలు కూడా చదువుకునేందుకు ఇవ్వడం లేదన్నారు. బయట వ్యక్తులను తీసుకువచ్చి తమను బెదిరిస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన పీఓ నాగరాణి వార్డెన్‌ను విధుల నుంచి తప్పిస్తామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధామస్ పల్లిదానంకు విద్యార్థులు తమ సమస్యలు, వార్డెన్ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. విద్యార్థులు ఆందోళనకు సెంటర్ ఫర్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు బాలు అక్కిస, పీడీఎస్‌యూ జిల్లా మాజీ అధ్యక్షుడు రమణ, డివిజన్ అధ్యక్షుడు కె.భానుప్రసాద్, కె.విజయకుమార్ మద్దతు తెలిపారు. పీఎంఆర్సీ వద్ద కొద్ది సేపు బైఠాయించారు.