సాక్షి, రాజమండ్రి :
షాక్ కొట్టాలంటే కరెంటు తీగలే పట్టుకోనక్కరలేదు.. ఇకపై వచ్చే బిల్లుల్ని తాకినా చాలు. ప్రభుత్వం ఏడాది తిరక్కుండా మరోసారి ప్రతిపాదిస్తున్న చార్జీల పెంపుతో బిల్లు చూసిన వెంటనే మీటర్‌లో చక్రంలా జనం కళ్లు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రతిపాదనలతో ప్రధానంగా మధ్యతరగతి, పేదవర్గాల పైనే భారం పడనుంది. ఈ ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణా మండలి యథాతథంగా ఆమోదిస్తే జిల్లాపై పడే అదనపు భారం నెలకు సగటున రూ.14.8 కోట్లని ప్రాథమిక అంచనా. అసలే ప్రకృతి విపత్తులతో అనేక విధాలుగా నష్టపోయిన జిల్లా ప్రజలకు విద్యుత్ చార్జీల తాజా పెంపుదల పుండుపై కారం కానుంది.
జిల్లాలో వినియోగం ఇలా..
జిల్లాలో 14 లక్షల మంది విద్యుత్తు వినియోగదారులు ఉండగా నెలకు సుమారు 140 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగమవుతోంది. ఇందు లో వివిధ కేటగిరీలకు చెందిన 12.10 లక్షల మంది గృహ వినియోగదారులు (నవంబరు లెక్కల ప్రకారం) నెలకు సుమారు 96.5 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు. పెంచనున్న చార్జీలతో వీరిపై పడే అదనపు భారం రూ.11.58 కోట్లు ఉండగలదని అంచనా. చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు నిర్వహిస్తున్న కేటగిరీ-2కి చెందిన 1,12,000 వినియోగదారులు 16.5 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు. వీరిపై పడనున్న భారం రూ.1.65 కోట్లని అంచనా. ఇంకా చిన్న, కుటీర పరిశ్రమలకు సంబంధించి 9400 కనెక్షన్లు ఉండ గా 17 మిలియన్ యూనిట్లు వినియోగమవుతోంది. వీరిపై పడే భారం రూ.0.87 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ధార్మిక,సేవా సంస్థలకు పంపిణీ అయ్యే వినియోగం ఒక మిలియన్ యూనిట్లుగా ఉంది.
ఈ కేటగిరీలో ఉన్న 14,000 కనెక్షన్లకు అదనంగా పడనున్న భారం రూ.15 లక్షల వరకూ ఉండనుంది. ఇంకా పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలోని 10 వేలకు పైగా నీటి పథకాలు, వీధిలైట్ల కనెక్షన్లపై పడే అదనపు భారం రూ.55 లక్షల వరకూ ఉండబోతోంది. జిల్లాలో తాజా వినియోగం లెక్కల ప్రకారం 300 యూనిట్లలోపు విద్యుత్తు వాడకందారులు 11.30 లక్షలకు పైగా ఉన్నారు. వీరిపైనే చార్జీల భారం ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి.
బిల్లు చూస్తే బైర్లే
Published Fri, Dec 6 2013 1:15 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM
Advertisement
Advertisement