సాక్షి, రాజమండ్రి :
ఆరునూరైనా ఆదాయాన్ని స్థిరీకరించుకోవాలని చూస్తున్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) కఠినచర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగానే రాజమండ్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్, విజిలెన్స్ విభాగం డీఈ రాజబాబుల బదిలీలు జరిగాయని ఆ సంస్థ వర్గాలు అంటున్నాయి. గురువారం సాయంత్రం హడావిడిగా జరిగిన ఈ బదిలీలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు ఆదేశాల మేరకు జనవరి మొదటి వారంలో జిల్లాలో హెచ్‌టీ వినియోగదారులపై విజిలెన్స్ దాడులు జరిగాయి. ఇప్పటి వరకూ ఎల్‌టీ రంగానికే పరిమితమైన దాడులు ఉన్నట్టుండి హెచ్‌టీ రంగానికి విస్తరించడం సంచలనం కలిగించింది. కాగా ఈ వినియోగంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఫిర్యాదుల మేరకు నేరుగా విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం రంగంలోకి దిగి ఁఆపరేషన్ హెచ్‌టీ* ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ దాడుల పర్యవసానంగానే ఈ ఇద్దరు అధికారులను బదిలీ చేసినట్టు సమాచారం.
హెచ్‌టీ కనెక్షన్లపై వరుస తనిఖీలు
గత ఏడాది ఏప్రిల్‌లో అనపర్తి
ఏడీఈ పరిధిలోని రాయవరం మండలం పసలపూడిలో ఓ హెచ్‌టీ కనెక్షన్ అసెస్‌మెంట్‌లో కనెక్షన్ మంజూరుకు రూ.1.08 కోట్లు చార్జి చేయాల్సి ఉండగా రూ.28 లక్షలు తక్కువగా కట్టించుకున్న అభియోగంపై అక్కడి ఏడీఈని ఇటీవలే శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. అప్పటికే సీఎండీ ఆదేశాల మేరకు డిసెంబరు 28న రాత్రి రాయవరం మండలంలోని ఓ రైస్ మిల్లుపై జరిపిన దాడిలో మిల్లు నిర్వాహకులు మీటర్‌ను ట్యాంపర్ చేసి విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్టు గుర్తించి, రూ.68 లక్షల అపరాధ రుసుం విధించారు. అనంతరం హెచ్‌టీ సర్వీసులపై వరుసగా పది రోజులు జరిపిన తనిఖీల్లో అధిక శాతం అనుమతికి మించిన విద్యుత్తును వినియోగిస్తున్న వైనం వెలుగు చూసింది. ఇదంతా అధికారుల పర్యవేక్షణా లోపంగా పరిగణించినందునే సీఎండీ కఠినచర్యలకు పూనుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత కేసును కూడా పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఈకి కూడా తెలియకుండానే అనపర్తి ఏడీఈని బదిలీ చేసినట్టు సమాచారం. ఇదే క్రమంలో ఎస్‌ఈ ప్రసాద్‌ను విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయంలో ఆపరేషన్స్ విభాగం జనరల్ మేనేజర్‌గా బదిలీ చేశారు.
విశాఖ డీపీఈ విభాగంలో డీఈగా ఉన్న గంగాధర్‌ను పదోన్నతిపై రాజమండ్రి ఎస్‌ఈగా నియమించారు. రాజమండ్రి డీపీఈ విభాగం డీఈని విజయనగరంలో కన్‌స్ట్రక్షన్ విభాగానికి బదిలీ చేసి కొత్తగా పదోన్నతి పొందిన పాడేరు ఏడీఈ రాంబాబును రాజమండ్రి డీపీఈ డీఈగా నియమించారు. ఎస్‌ఈ ప్రసాద్ 2012 జూలై 12న రాజమండ్రి సర్కిల్‌లో బాధ్యతలు స్వీకరించారు. కాగా బదిలీపై ఆయనను వివరణ కోరగా ప్రమోషన్లలో జూనియర్లకు అవకాశం కల్పించడంలో భాగంగా తమ బదిలీలు జరిగినట్టు చెప్పారు.
అధికారులకు ఈపీడీసీఎల్ షాక్
Published Sat, Feb 1 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement