సాక్షి, రాజమండ్రి :
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలంటారు. అలాంటి పల్లెల ప్రతినిధులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. సమైక్యతే తమ అభిమతమని ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ఈ మేరకు తీర్మానాలు చేసి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపు మేరకు జిల్లాలో పార్టీ శ్రేణుల చొరవతో శుక్రవారం మండలాల వారీగా పంచాయతీల పాలకవర్గాల సమావేశాలు నిర్వహించి రాష్టాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానాలు చేశాయి. రాజమండ్రి రూరల్ నియోజకర్గ వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో కడియం మండలంలోని పంచాయతీ పాలకవర్గాలు ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించాయి. కాగా గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో సమైక్య దీక్షలు కొనసాగుతున్నాయి.
అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచ్‌లు పాలకవర్గాలతో సమైక్య తీర్మానాలు చేశారు. పార్టీ కో ఆర్డినేటర్ ఏజేవీబీ బుచ్చిమహేశ్వరరావు నేతృత్వంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో 30 పంచాయతీల్లో సర్పంచ్‌లు సమైక్య తీర్మానాలు చేశారు. పార్టీ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, మరో నేత భూపతిరాజు సుదర్శనబాబు, పెన్మత్స చిట్టిరాజు, పెయ్యల చిట్టిబాబు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం ఆదుర్రు పంచాయతీలో రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ ఆధ్వర్యంలో సర్పంచ్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన సమైక్య తీర్మానం చేశారు. మలికిపురం, రాజోలు మండలాల్లో పంచాయతీ పాలకవర్గాలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాయి. కో ఆర్డినేటర్‌లు మట్టా శైలజ, మత్తి జయప్రకాష్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో పంచాయతీ సర్పంచ్‌లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు సమైక్య తీర్మానాలు చేయించారు. పెద్దాపురం మండలంలోని పంచాయతీల్లో పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు సమైక్యతే తమ అభీష్టమని తీర్మానించారు. తుని నియోజకవర్గంలోని 51 పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో సమైక్య తీర్మానాలు ఆమోదించారు. హంసవరం పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో రాజా స్వయంగా పాల్గొన్నారు. తునిలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఏలేశ్వరంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. ఏలేశ్వరం మండలం రమణ య్యపేటలో నియోజక వర్గ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో సర్పంచ్ ఎలంపర్తి అప్పలనర్స సమైక్యాంధ్రకు మద్దతుగా పాలకవర్గంతో తీర్మానం చేయించారు.
జగ్గంపేటలో గ్రామ సభ
జగ్గంపేట మండలంలో సుమారు 30 పంచాయతీల్లో రాష్ట్ర సమైక్యతను పరిరక్షించాలని కోరుతూ తీర్మానాలు చేశారు. జగ్గంపేట మెయిన్‌రోడ్డులో సర్పంచ్ కె.ప్రసన్నరాణి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పాలకమండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మండపేట నియోజక వర్గంలోని కపిలేశ్వరపురం, రాయవరం, మండపేట రూరల్ మండలాల్లోని పలు పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి వీర వెంకట సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సమైక్య తీర్మానాలు చేశారు. అడ్డతీగల మండలంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో పలు పంచాయతీల్లో తీర్మానాలు చేశారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పలు పంచాయతీల్లో సమైక్య తీర్మానాలు చేసి ప్రధానికి, కేంద్ర మంత్రికి పంపనున్నారు. శుక్రవారం 254 పంచాయతీల్లో తీర్మానాలు చేశారు.
కొనసాగుతున్న దీక్షలు : కాగా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ప్రత్తిపాడు నియోజక వర్గం ఏలేశ్వరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు శుక్రవారంతో ముగి శాయి. 31 రోజులు జరిగిన దీక్షలను కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు విరమింప చేశారు.
కలిసి ఉంటేనే కలిమి
Published Sat, Nov 2 2013 3:51 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement