టీడీపీ దాష్టీకం
పోలీసుల సమక్షంలో రైతులపై దాడి
వైఎస్సార్ సీపీ సర్పంచ్ భర్తను కాలర్ పట్టుకుని తోసిన మంత్రి కొల్లు
ఫరీద్‌ను టీడీపీ జెండా కర్రతో మోదిన మున్సిపల్ వైస్ చైర్మన్
బందరు మండలం పెదకరగ్రహారంలో ఉద్రిక్తత
బందరు మండలం పెదకరగ్రహారం సర్పంచ్ శొంఠి కళ్యాణి భర్త, వైఎస్సార్ సీపీ కార్యకర్త శొంఠి ఫరీద్‌పై తెలుగుదేశం శ్రేణులు దాడిచేశాయి. సాక్షాత్తు మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మచిలీపట్నం (కోనేరుసెంటర్) : బందరు మండలంలో మంగళవారం ప్రారంభమైన జనచైతన్య యాత్రలో తొలిరోజే ఉద్రిక్తతకు దారితీసింది. పెదకరగ్రహారం వెళ్లిన బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ర్ట కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావును పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దుచేసిన తర్వాతే గ్రామంలోకి అడుగుపెట్టాలంటూ రైతులు అడ్డుకున్నారు. సర్పంచ్ శొంఠి కళ్యాణి భర్త ఫరీద్, పలువురు రైతులు మంత్రి రవీంద్రను కలిసి పోర్టు భూముల విషయంపై మాట్లాడేందుకు ప్రయత్నించారు. నోటిఫికేషన్ రద్దు చేసిన తరువాతే తిరిగి గ్రామంలో అడుగుపెడతానని గతంలో మంత్రి ఇచ్చిన హామీని గుర్తుచేశారు. నోటిఫికేషన్ రద్దు చేసిన తరువాతే గ్రామంలోకి అడుగుపెట్టాలంటూ కరాఖండిగా చెప్పారు. ఆయన నచ్చజెప్పబోగా రైతులు ససేమిరా అన్నారు. మంత్రి అనుచరగణం అత్యుత్సాహంతో రైతులను రెచ్చగొడుతూ నినాదాలు చేశారు. ఆగ్రహించిన రైతులు ప్రతి నినాదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి రవీంద్ర, శొంఠి ఫరీద్‌ను కాలర్ పట్టుకుని నెట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య గ్రామస్తులను బెదిరించారు. రెచ్చిపోయిన మంత్రి అనుచరగణం ఫరీద్‌తో పాటు రైతులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పి.కాశీవిశ్వనాథం తన చేతిలో ఉన్న టీడీపీ జెండా కర్రతో ఫరీద్ తలపై బలంగా కొట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లోని ఒక ఎస్‌ఐ అధికార పార్టీ నాయకుల దాడికి పరోక్షంగా తన సహకారాన్ని అందించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బందరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ గ్రామంలో పోలీసు బలగాలు మోహరించారు.
మహిళల శాపనార్ధాలు
గ్రామస్తులపై టీడీపీ నాయకులు దాడి చేశారనే విషయం తెలుసుకున్న మహిళలు సంఘటనా స్థలానికి పరుగున వచ్చారు. సొమ్మసిల్లి ఉన్న ఫరీద్‌ను చూసి కుటుంబసభ్యులతో పాటు గ్రామానికి చెందిన పలువురు మహిళలు భోరున విలపించారు. జనచైతన్య యాత్ర ర్యాలీని వెంబడిస్తూ నాయకులకు శాపనార్ధాలు పెట్టారు. మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ర్ట కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, రూరల్ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావుతో పాటు మరి కొంత మందిపై తనపై దాడిచేశారని శొంఠి ఫరీద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.