ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడిగా బరిలో నిలిచి, గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యాక ఆ పార్టీ పెద్దల వేధింపులు భరించలేక విలవిల్లాడిపోయిన ఓ దళిత ప్రజాప్రతినిధి గోడు ఇది. పామూరు మండలానికి చెందిన తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ సర్పంచ్ తాతపూడి భూషణం చాలా కాలంగా ఆ పార్టీ నేతల ఆగడాలకు విసిగిపోయారు. తన గోడును ఆ పార్టీ నేతలెవ్వరూ పట్టించుకోక పోవడంతో బుధవారం జగన్ పాదయాత్ర సాగుతున్న ప్రాంతానికి చేరుకుని రోడ్డు పక్కన చెప్పులు కుడుతూ నిరసన తెలిపారు. కొంత సేపటి తర్వాత అక్కడికి చేరుకున్న జననేతకు తాను అనుభవించిన కష్టాలను చెప్పుకున్నాడు.
‘గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన కొద్దిరోజులకే నన్ను ఆ పదవి నుంచి తొలగించారు. ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ అడ్డదారిన పార్టీ పెద్దోళ్లు ఒకతన్ని సర్పంచ్ పదవిలో నియమించారు. గ్రామస్తుల మద్దతుతో పోరాడి తిరిగి సర్పంచ్ పదవిని దక్కించుకున్నాను. అయినా అధికారులపై ఒత్తిడి తెచ్చి చెక్ పవర్ రద్దు చేయించారు. రకరకాలుగా వేధింపులకు గురిచేశారు. సర్పంచ్ అన్నమాటే కానీ ఏనాడూ ఆ కుర్చీలో కూర్చోనివ్వలేదు. శిలాఫలకాల్లో ఎక్కడా నా పేరు వేయలేదు. వారు నియమించిన వ్యక్తి పేరే వేశారు. పైగా నేను ఊళ్లో ఉండనని తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఊరు వదిలి నేనెక్కడికి పోతాను? వారి చెప్పుచేతల్లో ఉంటూ వారు చెప్పిన తప్పుడు పనులు చేయాలేదనేది వారి బాధ. ఈ పరిస్థితిలో చెక్ పవర్ రద్దుపై హైకోర్టుకు వెళ్లి అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నా. నాలుగు నెలల పాటు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ ఉత్తర్వులు సైతం అమలు కాకుండా టీడీపీ పెద్దలు అడ్డుకున్నారు. ఆ సమయంలోనే గ్రామ పంచాయతీ నిధులను భారీ మొత్తంలో టీడీపీ పెద్దలే డ్రా చేసుకొని దుర్వినియోగం చేశారు. వారి ఆగడాలను ప్రశ్నిస్తే నన్ను కులం పేరుతో దూషించారు.. అవమానించారు. పోలీసుస్టేషన్‌లో ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాను. అయినా టీడీపీ పెద్దలపై కనీస చర్య తీసుకోలేదు’ అని బావురుమన్నారు.
సీఎం, లోకేశ్ దృష్టికి కూడా తీసుకెళ్లా..
తనకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేశ్‌తో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవోల వద్ద పలుమార్లు చెప్పుకున్నా ఒక్కరూ పట్టించుకోలేదని భూషణం వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులుగా ఉన్న వారు పలు సందర్భాల్లో దళితుల పట్ల చులకనగా మాట్లాడటం కారణంగా గ్రామాల్లోనూ స్థానిక అధికార పార్టీ నాయకులు అలానే వ్యవ«హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారని.. మరో మంత్రి సైతం దళితులు శుభ్రంగా ఉండరని వ్యాఖ్యానించారని ఆయన జగన్‌కు గుర్తు చేశారు. ఇంత జరిగినా అధిష్టానం తనను వేధించిన పెద్దల వైపే నిలిచిందని, దళితులకు గౌరవం లేని ఇలాంటి పార్టీలో ఉండలేనని చెప్పారు. ఆ పార్టీకి రాజీనామా చేçస్తున్నానని ప్రకటించారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పారు. ఆయన గోడు సావధానంగా విన్న జగన్.. ‘అధైర్య పడవద్దు, నేను అండగా ఉంటాను’ అని భూషణానికి «ధైర్యం చెప్పారు. అనంతరం భూషణం వైఎస్సార్‌సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment