చంద్రబాబు మాకు మద్దతివ్వాల్సిందే | Chandrababu Naidu Should Support Us : YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాకు మద్దతివ్వాల్సిందే : వైఎస్‌ జగన్‌

Published Thu, Mar 8 2018 9:40 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Chandrababu Naidu Should Support Us : YS Jagan Mohan Reddy - Sakshi

సంతరావురులో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

సాక్షి, సంతరావురు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే తాము ఈ నెల (మార్చి) 21న కేంద్రంపై ప్రవేశ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి తీరాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన కోరితే ఇంకా ముందుగానే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాను సిద్ధమని, ఒక వేళ చంద్రబాబే అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు వచ్చినా మద్దతు ఇచ్చి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరిగితే తాను ఎలా పని చేసేందుకైనా సిద్ధమని అన్నారు. మార్చి 21నే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకుంది చంద్రబాబుకు గడువు ఇచ్చేందుకని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై బుధవారం సాయంత్రం అరుణ్‌ జైట్లీ ప్రకటన.. ఆ ప్రకటనపై చంద్రబాబు స్పందన నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా సంతరావురులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  


'జరిగిన పరిణామాలన్నింటిని గమనిస్తే అరుణ్‌జైట్లీ ప్రకటన కొత్తదేం కాదు. సెప్టెంబర్‌ 8, 2016లో కూడా ఆయన ఇవే మాటలు మాట్లాడారు.. అప్పుడు అర్థరాత్రి జైట్లీ ఇవే మాటలు చెబితే చంద్రబాబు స్వాగతించారు. జైట్లీకి, వెంకయ్యకు శాలువాలు కప్పారు. అసెంబ్లీలో పొగడ్తల వర్షం కురిపిస్తూ తీర్మానాలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన ఘట్టం, దానితో ఏ మేలు జరుగుతుందని, ఎన్నికల ముందు మాత్రం ప్రత్యేక హోదా సంజీవిని అనడం చంద్రబాబుకే చెల్లింది. ఇదంతా గతం. ఇప్పుడు కొత్తగా ఆయన మళ్లీ స్టాండ్‌ మార్చారు.. గతంలో అన్న మాటలే ఇప్పుడు జైట్లీ అంటే అవేదో నేడు చంద్రబాబు కొత్తగా మాట్లాడిన మాటల మాదిరిగా.. తానేదో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని తన మంత్రులను కేంద్ర కేబినెట్‌ మంత్రి వర్గం నుంచి ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు. ఇది ముమ్మాటికి ప్రజల విజయం. ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి, మరో ఏడాదిలో ఎన్నికలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామాలు చేస్తామని, అవిశ్వాస తీర్మానంవంటి అంశాల నేపథ్యంలో చంద్రబాబు దిగొచ్చారు.


ప్రజల విజయంతోనే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం చివరి దశ వచ్చే నాటికి మేమే భారత్‌కు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు పోరాటం చేశాం అని బ్రిటీషు వాళ్లు అన్నట్లుగా ఇప్పుడు చంద్రబాబు వ్యవహారం ఉంది. మొత్తానికి చంద్రబాబు తలఒగ్గాడు.. ఒగ్గినందుకు సంతోషం. అయితే, రాజీనామాలు చేయాలనుకున్న చంద్రబాబు అంతకుముందే ఢిల్లీ వాళ్లతో ఎందుకు ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇంకా ఆయన ఎన్డీయే కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో చిత్తశుద్ధి, విశ్వసనీయత, విలువలు, నిజాయితీ చాలా ముఖ్యం. బాబుకు ఇవేవి లేవు.. అందుకే పూటకో మాట రోజుకో పాట పాడుతున్నారు. ఏం చేసినా పడి ఉంటారులే అన్న చంద్రబాబు ఆలోచనకు చరమగీతం పాడే రోజు త్వరలోనే వస్తుంది. చంద్రబాబుకు ఒకటే చెబుతున్నా.. మేం మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం.. ఆ డేట్‌ ఎందుకు నిర్ణయించామంటే మీకు సమయం ఇవ్వడం కోసం.. రాష్ట్రంలోని 25మంది ఎంపీలు అవిశ్వాసం పెడితే కేంద్రానికి ఒక మెస్సేజ్‌ పోతుంది. 21వ తేదీకంటే ముందే అవిశ్వాసం పెట్టమంటే పెట్టేందుకు నేను సిద్ధం.. ముందుకు జరపాలన్నా.. జరుపుతా.. లేదా మీరు అవిశ్వాసం పెడతామన్నా మద్దతు ఇస్తా. పార్లమెంటు చివరి రోజున అవసరం అయితే, అంతా రాజీనామాలు చేద్దాం.. దేశం మొత్తం చూస్తుంది. పెద్ద చర్చ జరుగుతుంది. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి పెరిగి ఏం చేయాలో అది జరుగుతుంది.


14వ ఆర్థిక సంఘంపై..
14 ఆర్థిక సంఘం అని అరుణ్‌ జైట్లీ పదేపదే చెబుతున్నారు.. ఇది నిజంగా ఆశ్చర్యం.. ఇవే మాటలు ఆయన చెబితే.. ఆనాడే నేను ప్రెస్‌ మీట్‌ పెట్టాను .. బంద్‌ కాల్‌ కూడా ఇచ్చాను.. అసెంబ్లీలో కూడా ఈ ప్రస్తావన చేశాను. 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌ సింఘ్‌ వ్రాతపూర్వకంగా చాలా స్పష్టంగా రాశారు. ప్రత్యేక హోదా రద్దు చేసేందుకు కాదని.. అయినా .. 14వ ఆర్థిక సంఘం అపాయింట్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీ.. వైవీ రెడ్డి నేతృత్వంలో 2013లోనే చేస్తే 2015 అమల్లోకి వచ్చింది. అసలు 14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటి? ఈ ఆర్థిక సంఘం అమల్లోకి రాకముందే 2014 మార్చి2నే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేబినెట్‌ తీర్మానం చేసింది.. ప్రత్యేక హోదా ఇవ్వాలని అందులో స్పష్టంగా చెప్పింది. ప్రణాళిక సంఘానికి అమలుకోసం కూడా పంపించింది. ప్రణాళిక సంఘం కూడా 2014 డిసెంబర్‌ 31 వరకు ఉంది. జనవరి 1, 2015  నీతి ఆయోగ్‌ వచ్చింది. మోదీ పీఎం అయిన తర్వాత ఏడు నెలలపాటు ప్లానింగ్‌ కమిషన్‌ బతికే ఉంది. ఏడు నెలలపాటు ఫైల్‌ కదలకుండా అక్కడే పడి ఉంటే ఎందుకు చంద్రబాబు పట్టించుకోలేదు. 14వ ఆర్థిక సంఘం రాకముందే జరిగిపోయిన నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయరు. ఇవన్నీ చంద్రబాబుకు తెలియనివి కావు..

ఇలా రెండేళ్లకు ముందే చేయాల్సింది
చంద్రబాబు మాటలు చూస్తుంటే నిజంగా ఆయన ముఖ్యమంత్రేనా అనిపిస్తుంది.. ఇలాంటి మాటలు చెప్పొచ్చా.. రెండేళ్లకు ముందే చంద్రబాబు ఇప్పుడు చేసిన పని చేసి ఉంటే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు ఇలా చేశారు. ఏవో రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. పార్లమెంటులో అన్ని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారు. ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి విడగొట్టాయి. నాడు ఉన్న పార్టీలంతా సమన్యాయం చేసి విడగొట్టండి అంటే అసలు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్పిన ఏకైక పార్టీ మాదే(వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ). చరిత్ర హీనుడిగా చంద్రబాబు మిగిలిపోకుండా ఉండాలంటే మేం 21న పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వాలి.. లేదా మీరు అవిశ్వాసం పెట్టినా నేను మద్దతిస్తాను.. ప్రజాస్వామ్యంలో నాకు వీలయినంత మేరకు పోరాటం చేస్తాను. నేను విలువలను రాజకీయాల్లో బలంగా నమ్ముతాను. నాడు గుంటూరులో ఎనిమిది రోజులపాటు నిరాహార దీక్ష చేస్తే మోదీ వస్తున్నారని నా దీక్షను భగ్నం చేశారు. మద్దతు ఇవ్వాల్సిందిపోయి దగ్గరుండి బంద్‌లు నిర్వీర్యం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎన్ని బంద్‌లు చేస్తే అన్నింటిని విఫలం చేసే ప్రయత్నాలు చంద్రబాబు చేశారు. యువభేరీలకు పిల్లలు వస్తే వారిపై పీడీ యాక్ట్‌లు, హౌజ్‌ అరెస్టులు చేశారు.  


థర్డ్‌ ఫ్రంట్‌పై..
ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి కచ్చితంగా మద్దతు ఇస్తాం. బీజేపీ హోదా ఇవ్వకుంటే వారికి మద్దతు ఇవ్వం. కాంగ్రెస్‌ వాళ్లు ప్రధాని అయ్యే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. మున్మందు పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దాం. అందుకే ఏపీ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.. 25కు 25మంది ఎంపీలను వైఎస్‌ఆర్‌సీపీకి ఇవ్వండి.. మీరో మరోసారి ఎవ్వరినీ నమ్మొద్దు.. ఎవరు హోదాకు మద్దతిస్తే వారికి సపోర్ట్‌ చేస్తాం.. హోదాపై సంతకం చేశాకే మద్దతు ప్రకటిస్తాం.

రాష్ట్రంలో ఒంటరి పోరేనా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒంటిరగా పోరాటం చేస్తామా అనే విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సరికాదు.. వచ్చే ఏడాది ఈ అంశంపై చూద్దాం.

గోబెల్స్‌ సిద్ధాంతాలు నమ్మే చంద్రబాబు
గోబెల్స్‌ సిద్ధాంతాలు గట్టిగా నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒకే అబద్ధాన్ని పలుమార్లు చెప్పించడమే గోబెల్‌ సిద్ధాంతం.. చంద్రబాబు అదే చేస్తున్నారు. అనుకూల మీడియాను డెవలప్‌ చేసి అందులో అబద్ధాలు చెప్పించి చెప్పించి నిజమనిపిస్తున్నారు.. అవతలి వ్యక్తిపై బండవేయడం, బురద వేయడం చంద్రబాబుకు అలవాటు.. నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో జరగని అవినీతి ఉందా? దేశంలో ఎక్కడా లేని అవినితి రాష్ట్రంలో ఉంది. కాంట్రాక్టర్లు, ఇసుక, మట్టి, కరెంట్‌, భూములు ఇలా ఏది వదలకుండా అవినీతి జరుగుతోంది. అడ్డగోలుగా అవినీతి చేస్తూ మేనేజ్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కొనుగోలుకోసం నల్లధనం కోట్లలో ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయారు.. ఒక ప్రభుత్వ ఉద్యోగి దొరికితే వెంటనే జైలుకు పంపిస్తారు.. కానీ, ముఖ్యమంత్రిగా ఉండి దొరికిపోయినా బాధ్యతా యుతంగా ఆయన ఏమీ చేయరు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement