కందుకూరు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సాక్షి, కందుకూరు (ప్రకాశం జిల్లా) : ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం 91వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
‘తెలుగుదేశం పార్టీ పార్టనర్ పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది అనే అంశాలను తెలుసుకుంటారట. అయ్యా పవన్ కళ్యాణ్ గారూ.. 2014 నుంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రతీసారీ రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ ఆయన డ్రామాలు ఆడుతున్నారు. దీన్ని బట్టి తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయా? లేదా? అని.
మీ కమిటీ పరిశోధన... కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా ఉంది. ఎంతిచ్చారు.. ఎంత తీసుకున్నారన్న విషయం పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను రక్షించే ప్రత్యేక హోదాపై మీరు పోరాడాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధికి కావాల్సిన నిధులు వాటంతట అవే వస్తాయి. హోదాతో సమానంగా ప్యాకేజి ఇస్తామని కేంద్ర అన్నదట.. సరే మరి అయితే అని దానికి చంద్రబాబు తలూపారట. హోదాకు ప్యాకేజికి నక్కకు నాకలోకానికి ఉన్న తేడా వుంది. హోదా వస్తే ఆదాయపు పన్ను, జీఎస్టీలను పెట్టుబడులు పెట్టే కంపెనీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరి ప్యాకేజీలో అలాంటి నిబంధనలు ఉంటే చూపించండి.
ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పని చేయకుండా డ్రామా ఆర్టిస్టుగా మారాడు. గత 15 రోజులుగా ఎడతెగని డ్రామాను నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఈ 15 రోజుల ఎల్లోమీడియా పేపర్లను తిరగేసినా, చానెళ్ల ప్రసారాలను తిలకించినా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాలుగేళ్లుగా ఏళ్లుగా చంద్రబాబు బీజేపీతో కలసి ఉన్నారు. టీడీపీ ఎంపీలను కేంద్రంలో మంత్రులుగా పెడతాడు. బడ్జెట్ ప్రకటించేప్పుడు మంత్రులకు కేటాయింపుల వివరాలు తెలుస్తాయి. అయినా వాటిని ప్రశ్నించకుండా.. అలానే ఆమోదింపజేశాడు.
గత నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. ప్రతి బడ్జెట్ కేటాయింపుల అనంతరం బీజేపీని పొగిడాడు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అన్ని రాష్ట్రాల కన్నా మనమే ఎక్కువ సాధించాం అన్నాడు. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా? ప్రశ్నించాడు. ఆ కథనాన్ని ప్రతి పక్షాలకు చంద్రబాబు సవాల్ అని ఓ దినపత్రిక రాసింది. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు రాష్ట్రానికి ఏం చేయకపోయినా వెళ్లిన ప్రతిసారీ వారందరికీ శాలువాలు కప్పుతాడు. వాళ్లు చెవిలో క్యాబేజీ పెడితే పెట్టించుకుంటాడు. రాష్ట్రానికి వచ్చి మన చెవిలో పువ్వు పెడదామని చూస్తాడు.
ప్యాకేజి కోసం సిగ్గు లేకుండా హోదాను ఎలా తాకట్టుపెట్టావు బాబూ?. ప్రత్యేక హోదా సాధనతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. మార్చి 1న కలెక్టరేట్ల వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ధర్నాలు చేస్తుంది. మార్చి 3న పార్టీ నేతలను ఢిల్లీకి పంపుతా. మార్చి 5న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. మార్చి నుంచి 6 ఏప్రిల్ వరకూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి పార్లమెంటు వేదికగా వీరోచితంగా పోరాడుతారు. అప్పటికీ హోదాను ప్రకటించకపోతే రాకపోతే రాజీనామాలు చేస్తాం.
హోదా కోసం ఎవరితోనైనా కలసి నడుస్తాం అని ప్రకటించా. రాష్ట్రానికి చెందిన మొత్తం 25 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని పిలుపు ఇచ్చి మూడు రోజులైంది. లీకులు మీద లీకులు ఇస్తున్నాడే తప్పు హోదా గురించి చంద్రబాబు మాట్లాడడు. హోదా కోసం రాజీనామా చేయండయ్యా అంటే.. చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అన్నాడు. తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుంది. మార్చి చివరి వారంలో ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం.
ఒకవేళ టీడీపీ నాయకులే ఆ పని చేస్తే.. మేం మద్దతు ఇస్తాం. కానీ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోవడానికి 54 మంది సభ్యుల సంతకాలు కావాలి. అంత బలం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు లేదు. మాకు ఐదుగురు ఎంపీలు ఉన్నారు. మిగిలిని వారిని మీ చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. పవన్ కళ్యాణ్ గారూ.. మిమ్మలి ఒక్కటే కోరుతున్నా.. మీరు కానీ చంద్రబాబు కానీ ప్యాకేజీ పేరుతో రాష్ట్రాన్ని మోసం చేయొద్దు. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడదాం. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేద్దాం అని చెబుతున్నా.’
Comments
Please login to add a commentAdd a comment