మోటారు సైకిల్ మీద పాలక్యాన్లతో వెంకన్నబాబు
అన్నవరం: ఉపసర్పంచ్ వెంకన్నగారు.. పాలు పలుచగా ఉన్నాయండీ.. అని ప్రజలు అడుగుతుంటే.. ఉపసర్పంచ్‌కి పాలకి సంబంధం ఏంటని కొత్త వారు ఆశ్చర్యపోతుంటారు. పాల వ్యాపారం చేసే వెంకన్న ఉపసర్పంచ్‌గా ఎన్నికైనా యథావిధిగా సైకిల్ మీద ఖాతాదారులకు పాలు విక్రయిస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పంచాయతీ ఉప సర్పంచ్ సంగతి. స్థానిక వెలంపేటలో ఉండే బొబ్బిలి వెంకన్నబాబు 35 సంవత్సరాలుగా పాల వ్యాపారం చేస్తున్నారు. పాల వెంకన్నగా పేరు పొందారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఎంతో అభిమానం. 2013లో తొమ్మిదో వార్డు పదవికి పోటీచేసి రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అదే తొమ్మిదో వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభిమానిగా పోటీచేసి 182 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీ వార్డు సభ్యుల్లో ఇదే అత్యధిక మెజార్టీ. అన్నవరం పంచాయతీ సర్పంచ్ పదవితోపాటు 16 వార్డులకుగాను 15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులే విజయం సాధించారు. దీంతో ఉపసర్పంచ్ పదవికి తీవ్రపోటీ ఏర్పడింది. దీర్ఘకాలంగా పార్టీ విధేయుడిగా ఉండడం, బీసీ వర్గానికి చెంది అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం, అన్నింటికి మించి వివాద రహితుడనే పేరుండడంతో బొబ్బిలి వెంకన్నబాబును ఉపసర్పంచ్ పదవికి ప్రత్తిపాడు శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్రప్రసాద్ ప్రతిపాదించారు.
సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్‌రాజా దీన్ని బలపర్చగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో వెంకన్న ఉపసర్పంచ్ అయ్యారు. ఆ మరుసటి రోజు నుంచే ఆయన తన మోటారు సైకిల్ మీద ఖాతాదారులకు పాలు విక్రయిస్తున్నారు. ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకు, సాయంత్రం ఆరుగంటల నుంచి రాత్రి పదిగంటల వరకు పాల వ్యాపారం చేస్తానని, ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఉపసర్పంచ్‌గా గ్రామానికి సేవచేస్తానని వెంకన్నబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment