టీడీపీలో నైరాశ్యం | There Is No Candidates for TDP in Visakhapatnam | Sakshi
Sakshi News home page

టీడీపీలో నైరాశ్యం

Published Wed, Mar 3 2021 3:28 AM | Last Updated on Wed, Mar 3 2021 11:02 AM

There Is No Candidates for TDP in Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట: పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవం నుంచి కోలుకోక ముందే మున్సిపల్‌ ఎన్నికల భయం టీడీపీని వణికిస్తోంది. సొంత జిల్లాలో సైతం పార్టీ కోలుకోలేని దెబ్బ తినడంతో తీవ్రంగా డీలా పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే కుప్పంలో పర్యటిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా టీడీపీ శ్రేణుల్లో నిస్పృహ ఆవరించింది. వరుస ఓటములతో ముఖ్య నాయకులు స్తబ్దుగా ఉండిపోవడం, కేడర్‌ నిస్తేజంగా మారడంతో ఈసారి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని స్పష్టమవుతోంది. ఎలాగూ ఓడిపోతామని తెలియడంతో చాలాచోట్ల టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. ఒకవైపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్నా ఇప్పటికీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసుకోలేకపోవడం టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది.

ఇక విశాఖలో సైకిల్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకపక్క పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువవడం మరోపక్కఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ఓటు ఎలా అడగాలో అంతుబట్టక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌చార్జిలు లేకపోవడం, ఉన్నవారు ఎలాగూ గెలిచే పరిస్థితి లేదని అంటీముట్టనట్లు ఉండటంతో పోటీ చేసే అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. అనేక చోట్ల ముఖ్య నాయకులే చేతులెత్తేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకోలేమని తప్పుకుంటున్నారు. దీంతో చంద్రబాబు జారిపోతున్న నాయకులు, కేడర్‌ను కాపాడుకోలేక నిత్యం ఏదో ఒక హడావుడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

బెజవాడలో సిగపట్లు.. 
విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎంపీ కేశినేని నాని అంతా తానే అనే రీతిలో వ్యవహరిస్తుండడం మిగిలిన నాయకులకు మింగుడు పడడంలేదు. నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గానికి సీట్లు ఇవ్వకపోవడంతో ఎన్నికల వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.   

గుంటూరులో దయనీయం.. 
గుంటూరు కార్పొరేషన్‌లో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. గుంటూరు వెస్ట్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మద్దాల గిరి టీడీపీని వీడడంతో పార్టీ కేడర్‌ చాలావరకూ ఆయన వెంటే నడిచింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్రను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించినా నగరంపై ఆయనకు పట్టు లేకపోవడంతో ఈ ఎన్నికల్లో పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌లా పర్యటించినా ప్రయోజనం లేదని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

చేతులెత్తేసిన నేతలు.. 
తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసిన సుగుణమ్మ మౌనంగా ఉండటం, ఆమెపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉండడంతో తిరుపతి కార్పొరేషన్‌లో టీడీపీని నడిపించే వారు లేరు. కడప, కర్నూలు, ఒంగోలు, ఏలూరు, మచిలీపట్నం తదితర కార్పొరేషన్లలోనూ ఎన్నికల బాధ్యతను స్వీకరించే నాయకులు ఎవరూ టీడీపీలో కానరావడం లేదు.  

విశాఖలో సైకిల్‌ అస్తవ్యస్తం..
విశాఖపట్నం కార్పొరేషన్‌లో పురపోరుకు ముందే సైకిల్‌కు పంక్చరైంది. రెండు చోట్ల టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాకపోవడంతో వామపక్షాలకు సీట్లు కేటాయించాల్సిన దుస్థితి నెలకొంది. టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి సైతం ఎన్నికలకు ముందే పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ తరఫున అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో 72వ వార్డు సీపీఐకి, 78వ వార్డుని సీపీఎంకు కేటాయించారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగుస్తున్నా మంగళవారం రాత్రికి కూడా అన్ని వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేయలేని దుస్థితి టీడీపీలో నెలకొంది. జీవీఎంసీ 8, 33 వార్డుల్లో స్థానికేతరులకు బీ ఫారాలు ఇచ్చారని నగర పార్టీ ఆందోళనకు కార్యకర్తలు దిగారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలోనే బాహాబాహీకి దిగడంతో వారిని వారించలేక ఆయన మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. కాగా ఎమ్మెల్యే గంటా ముఖ్య అనుచరుడు, పార్టీ సీనియర్‌ నేత కాశీ విశ్వనా«థ్‌ టీడీపీని వీడి బుధవారం రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement