వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద..
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభిమానుల గెలుపు సంపూర్ణమైంది. నాలుగో విడతలోనూ జైత్ర యాత్ర కొనసాగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనకు పల్లె ప్రజలు నాలుగు విడతల్లోనూ జైకొట్టారు. పాలనలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పల్లె ముంగిటకు తెచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆలోచనకు గ్రామీణ ప్రజానీకం మొత్తం సానుకూలంగా స్పందించి బ్రహ్మరథం పట్టారు.
కుయుక్తులతో రాజకీయాలను నడపాలని ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీకి ప్రజలు ఓటుతో చావు దెబ్బ కొట్టారు. తెలుగుదేశం కంచుకోటలుగా జబ్బలు చరుచుకున్న ఆ పార్టీ నేతలకు దిమ్మ తిరిగే తీర్పును ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం గమనార్హం. కుప్పంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు భారీ విజయం నమోదు చేయడం.. టీడీపీ పతనానికి ప్రత్యక్ష సాక్ష్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
13,097 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే...
మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, నాలుగు విడతల్లో కలిపి 13,097 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో మొత్తంగా 10 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. ఒకటి, రెండు, మూడవ విడతల్లో ఎన్నికలు జరిగిన వాటిలో 7,869 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులను వైఎస్సార్‌సీపీ అభిమానులు చేజిక్కించుకున్నారు. నాలుగో విడతలోనూ ఆదివారం రాత్రి 12.30 గంటలకు అందిన సమాచారం మేరకు 80 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఈ తీర్పు ముఖ్యమంత్రి ప్రజా రంజక పాలనకు నిదర్శనం అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ఓటర్లు ఒక్క మాటగా అనుకొని ఓటు వేశారా.. అన్నట్టు 13 జిల్లాల్లోనూ, నాలుగు విడతల్లో ఒకే రకమైన ఫలితాలు రావడం ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని వారు పేర్కొన్నారు. ఈ తరహా ఫలితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటి సారని చెబుతున్నారు. గ్రామాల వారీగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు.. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఏమాత్రం తీసిపోవని అభివర్ణిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద అభిమానులు, కళాకారుల సంబరాలు
2,743 సర్పంచ్ స్థానాలకు పోలింగ్..
చివరి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 2,743 సర్పంచ్ పదవులకు ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 3,299 గ్రామ పంచాయతీల్లో ఈ విడతలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్లు జారీ కాగా, అందులో 554 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో రెండు చోట్ల అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,743 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆయా పంచాయతీల్లో పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగు గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
82.85 శాతం పోలింగ్..
మిగిలిన మూడు విడతల కంటే నాలుగో విడత ఓటింగ్ శాతం కాస్త ఎక్కువగా నమోదైంది. తొలి మూడు విడతల్లో 80 – 82 శాతం మధ్య ఓటింగ్ శాతం నమోదు కాగా, నాలుగో విడతలో 82.85 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 87.09 శాతం, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 76 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 81.79 శాతం పోలింగ్ నమోదైనట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు.
నెల్లూరు జిల్లాలో వర్షం వల్ల పోలింగ్‌కు స్వల్ప ఆటంకం..
నెల్లూరు జిల్లా కోవూరు, కొడవలూరు, పొదలకూరు మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ఆదివారం ఉదయం వర్షం కురిసిన కారణంగా పోలింగ్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం గణపర్రు గ్రామ పంచాయతీలో దివ్యాంగ మహిళలకు సంబంధించిన ఓటు పోలింగ్ అధికారి ఆమె చెప్పిన గుర్తుకు కాకుండా మరో గుర్తుకు వేశాడన్న వివాదంతో ఓటింగ్ ప్రక్రియకు కొంత అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామ పంచాయతీలో బీసీ–బి మహిళకు రిజర్వు చేసిన వార్డులో బీసీ–బి పురుష అభ్యర్థి పోటీలో ఉండడంతో అక్కడ ఎన్నికను నిలిపివేసినట్టు మండల అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో వర్షం కురవడం వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా అధికారులు ఆయా ప్రాంతాల్లో జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా విద్యుత్ సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలను చేపట్టారు.
గుంటూరు జిల్లా కంబంపాడులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఆనందోత్సాహం
చదవండి: (పులివెందుల ‘పంచ్’ అదిరింది)
Comments
Please login to add a commentAdd a comment