బస్తీల్లో ఇక రణగొణ
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రాజమండ్రి, ఏడు మున్సిపాలిటీలు,
మూడు నగర పంచాయతీల్లో 30న పోలింగ్
వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
కాకినాడ, అనపర్తిలలో నిర్వహణకు కేసుల అడ్డంకి
అసలే రొదతో, రద్దీతో ఉండే పట్టణాలు..ఇకపై దాదాపు నెలరోజుల పాటు సమరాంగణాలుగా మారనున్నాయి. మూడేళ్ల జాప్యం తర్వాత రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌విడుదలైంది. జిల్లాలో రాజమండ్రి నగర పాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. వచ్చేనెల రెండున ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. మరో వారంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూలు విడుదలకాగలదని భావిస్తున్న తరుణంలో.. పురపోరును ఎదుర్కోవలసి రావడం రాజకీయ పార్టీలను, నాయకులను.. కత్తి తిప్పే సమయంలోనే విల్లు ఎక్కుపెట్టాల్సి వచ్చినట్టు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
సాక్షి, రాజమండ్రి :
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం ఉదయం విడుదల అయినా..హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఉండడంతో ఎన్నికలు వాయిదా పడొచ్చని పలువురు భావించారు. అయితే, ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో రాజకీయ పార్టీలకు, నేతలకు పురపోరుకు సన్నద్ధం కాక తప్పడ ం లేదు. జిల్లాలో కాకినాడ నగర పాలక సంస్థ, అనపర్తి నగర పంచాయతీ మినహా (ఈ రెండింటి విషయంలో పరిసర గ్రామాల విలీనానికి సంబంధించి హైకోర్టులో కేసులున్నాయి) రాజమండ్రి నగరపాలక సంస్థ, అమలాపురం, తుని, మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీలలో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ పట్టణాల పరిధిలోని సుమారు 5,44,756 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
శాసనసభ, లోక్‌సభ ఎన్నిక లు ముంచుకు వస్తాయన్న ముందుచూపుతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు చక చకా శంకుస్థాపనలు చేసేస్తున్న నేతలు.. ముందుగా మున్సిపల్ ఎన్నికల కోడ్ సోమవారం నుంచి అమలులోకి రావడంతో ఖంగు తిన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండడం, రాజకీయ పైరవీలకు తావు లేకుండడంతో కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయనే భయం నేతల్లో కనపడుతోంది. దీంతో ‘అభివృద్ధి పనులను’ పక్కన పెట్టి పురసమరానికి సమాయత్తమవుతున్నారు.
ఇదీ పురపోరు క్రమం..
ఈ నెల 10 నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు 18వ తేదీ తుది గడువు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. 30న పోలింగ్ జరుగుతుంది. అవసరమైన చోట రీ పోలింగ్ వచ్చే ఒకటిన నిర్వహిస్తారు. రెండున ఓట్లను లెక్కించి, సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తారు.
తిరస్కరణ ఓటుపై రాని స్పష్టత
ఎన్నికల కమిషన్ ఇటీవల ప్రవేశ పెట్టిన తిరస్కరణ ఓటు విధానం ఈ ఎన్నికల్లో అమలయ్యేదీ, లేనిదీ ఇంకా స్పష్టత రాలేదని పురపాలక శాఖ రాజమండ్రి రీజియన్ డెరైక్టర్ రమేష్‌బాబు తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘంనుంచి స్పష్టమైన ఆదేశాలు అందాల్సి ఉందన్నారు. ఎన్నికల సిబ్బంది వివరాలు సేకరిస్తున్నామని, మంగళవారం నాటికి యంత్రాంగంపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు.
ఉక్కిరిబిక్కిరవుతున్న రాజకీయ పార్టీలు
రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలనల నేపథ్యంలో శాసనసభ ఎన్నికలు తథ్యమనుకుంటున్న తరుణంలో వచ్చి పడ్డ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పక్షాలను అయోమయంలో పడేశాయి. విభజనకు సహకరించిన కాంగ్రెస్. టీడీపీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆ పార్టీల డివిజన్ స్థాయి నేతలు సహాయ నిరాకరణ చేస్తున్నందున అభ్యర్థుల ఎంపికే తలపోటుగా పరిణమించనుంది.
రాజమండ్రి మేయర్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో వివిధ పార్టీల నాయకులు సమర్థులైన అభ్యర్థినుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. రాజమండ్రిలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన క్యాడర్‌తో చర్చలు జరిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ నగరాధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో నేతలు ఎన్నికలపై సమాలోచనలు ప్రారంభించారు.
పురపోరుకు యంత్రాంగం సిద్ధం : కలెక్టర్
సాక్షి, కాకినాడ : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నామని కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 511 పోలింగ్ కేంద్రాలుండగా 562 ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. వీడియోగ్రఫీ లేదా వెబ్ కాస్టింగ్‌కు, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మున్సిపల్ కమిషనర్లతో సమావేశమైన కలెక్టర్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పట్టణాల్లో అభ్యంతరకరమైన హోర్డింగ్‌లు, ప్లెక్సీలు, కటౌట్‌లు తొలగించాలన్నారు.
ప్రతి మున్సిపాలిటీకి జిల్లాస్థాయి అధికారి, ఆర్డీఓలను ఎన్నికల పర్యవేక్షకులుగా నియమిస్తామన్నారు. మంగళవారం నుంచి కలెక్టరేట్లో జరిగే ఎన్నికల శిక్షణ కు కమిషనర్లు హాజరు కావాలని ఆదేశించారు. ప్రవర్తనా నియమావళికి సంబంధించి రాజకీయపార్టీలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. మున్సిపాలిటీల స్థాయిలో కమిషనర్లు పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.