♦ ఎట్టకేలకు మార్గం సుగమం
♦ అనుకూలంగా హైకోర్టు తీర్పు
♦ మొదలైన ఆశావహుల సందడి
సిద్దిపేట/సిద్దిపేట జోన్: సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. హైకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో స్థానిక రాజకీయ నేతల్లో హుషారు నెలకొంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలన్నింటికీ ఎన్నికలు పూర్తయినా ఇక్కడ ఎన్నికలు జరగలేదు. ఇటీవల వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేటకు కూడా ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరగడంతో ఆశావహులు సందడిచేశారు. కాని ఎన్నికల సంఘం ఆయా మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ జారీ చేసే సమయానికి కోర్టులో విచారణ కొనసాగడంతో ఇక్కడ మరోమారు ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2011 సంవత్సరంలో సిద్దిపేట మున్సిపాలిటీ శివార్లలోని ప్రశాంతినగర్, హనుమాన్‌నగర్, గాడిచర్లపల్లి, ఇమాంబాద్, నర్సాపూర్, రంగధాంపల్లి గ్రామాలనుమున్సిపాలిటీలో విలీనం చేశారు. విలీనాన్ని వ్యతిరేకిస్తు ఆయా గ్రామ పంచాయతీల మాజీ ప్రజా ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు.
వారికి అనుకూలంగా కోర్టు స్టే విధించింది. అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. విలీనానికి సంబంధించి ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా సజావుగా జరిపినట్టు మున్సిపల్‌అధికారులు తగిన సమాచారం కోర్టుకు సమర్పించారు. కోర్టులో కేసు విచారణలో ఉండటంతో ఎన్నికలు వరుసగా వాయదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన విచారణ అనంతరం హైకోర్టు న్యాయమూర్తి కేసును ప్రధాన న్యాయమూర్తికి నివేదించినట్టు సమాచారం. శుక్రవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి మున్సిపాలిటీలో విలీన గ్రామాలకు ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ ఈ క్రమంలో నమోదైన ఆరు కేసులను కొట్టివేస్తూ మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమనం చేశారు.
ఇదిలా ఉంటే.. సిద్దిపేట మున్సిపాలిటీలో గతంలో 32 వార్డులున్నాయి. ఆరు గ్రామ పంచాయతీలు విలీనమైన తర్వాత కూడా కేవలం రెండు మాత్రమే పెరిగి 34 వార్డులయ్యాయి. ఎన్నికల్లో బరిలోకి దిగే వారి సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశముంది. అందులోనూ వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఫలితంగా టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువే.. ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు మంత్రి హరీశ్‌రావుకు కత్తిమీద సాములా మారనుంది.