- 6న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
- 19న విడుదల కానున్న నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: మొన్న జీహెచ్‌ఎంసీ, నిన్న వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి సమరోత్సాహంలో ఉన్న టీఆర్‌ఎస్ మరో ప్రతిష్టాత్మక పోరుకు తెరతీస్తోంది. మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీకి ఏప్రిల్ 3న ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ఎన్నికలకు 19వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏప్రిల్ 3న పోలింగ్ నిర్వహించి 6న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడమే తరువాయి అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్ కూడా రానుంది. మున్సిపాలిటీల ఎన్నికల షెడ్యూల్‌ను 40 నుంచి 16 రోజులకు ప్రభుత్వం కుదించడం తెలిసిందే.
దాదాపు రెండేళ్లుగా ఎన్నికలపై స్టే
సిద్దిపేట మున్సిపాలిటీలో 6 శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రెండేళ్ల కింద అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు హైకోర్టులో సవాలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే ఏకపక్షంగా తమ గ్రామాలను విలీనం చేశారన్న స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు విధించిన స్టే దాదాపు రెండేళ్లు కొనసాగింది. న్యాయ చిక్కులతో దీర్ఘకాలంగా ఎన్నికలు జరగకపోవడంతో సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు పలు పురపాలికలకు కేంద్రం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇతర గ్రాంట్లూ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన ప్రభుత్వం, వారి అభ్యంతరాలను పరిష్కరించింది. తర్వాత ఆ 6 పంచాయతీలను సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేస్తూ మళ్లీ ఉత్తర్వులిచ్చింది. దాంతో హైకోర్టు స్టేను ఎత్తివేసింది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ టీడీపీ నుంచి నాలుగుసార్లు, టీఆర్‌ఎస్ నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు.
నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అక్కడినుంచి ఐదోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మేడ్చల్, కొల్లాపూర్, దుబ్బాక నగర పంచాయతీల ఎన్నికలు కూడా చాలాకాలంగా వాయిదా పడ్డాయి. కోర్టు కేసుల అడ్డంకులు తొలగగానే వీలైనంత త్వరగా వాటికి కూడా ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.
సిద్దిపేట మున్సిపాలిటీకి ఏప్రిల్ 3న ఎన్నికలు
Published Thu, Mar 17 2016 4:01 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement