బల్బు వెలగదు.. ఫ్యాన్ తిరగదు ఎడాపెడా కోతలు
Published Sun, Oct 20 2013 2:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
సాక్షి, రాజమండ్రి :విద్యుత్తు కోతలు వేసవిని తలపిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి తగ్గిందంటూ సాకు చూపి వేళాపాళా లేకుండా కోతలు అమలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎనిమిది, పట్టణాల్లో కనీసం ఆరు, నగరాల్లో నాలుగు గంటల చొప్పున విద్యుత్ కోత విధిస్తున్నారు. ఉత్పత్తి తగినంత లేకపోతే అదనంగా మరో రెండు గంటలు కోతలు తప్పవని ఈపీడీసీఎల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చలికాలం వస్తున్నా.. విద్యుత్ కోతలేమిటంటూ వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో వినియోగంతో పోల్చి చూస్తే ఈ ఏడాది వినియోగం విపరీతంగా పెరిగిందని విద్యుత్తు శాఖ లోడ్ మానిటరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు.
మూడు రోజులుగా.. మరింతగా..
జిల్లాలో విద్యుత్ కోతలు మూడు రోజులుగా మరీ అధికమయ్యాయి.
జిల్లాకు రోజుకు సగటున 10.287 మిలియన్ యూనిట్ల కోటా ఇస్తారు. ఈ నెల 18 వరకూ మొత్తం 185 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా, సుమారు 125 మిలియన్ యూనిట్లు మాత్రమే పంపిణీ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంటే కావాల్సిన దానిలో సుమారు 67 శాతం మాత్రమే పంపిణీ జరగగా 33 శాతం అధికంగా వినియోగమైంది. ఒక్క 18వ తేదీనే 10.906 మిలియన్ యూనిట్లు కోటాగా విడుదల కాగా.. పారిశ్రామిక, గృహ, వ్యవసాయ అవసరాలకు కలిపి మొత్తం 16.70 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగినట్టు నమోదైంది.
రాత్రి కోతలపైనే దృష్టి
పూర్తిగా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి పైనే ఆధారపడ్డ ఏపీఈపీడీసీఎల్‌కు కరెంటు కొరత బొగ్గు కొరత కారణంగా రోజుకో విధంగా ఉత్పత్తి ఉంటోందని, అందువల్ల అధికారికంగా కోతల సమయాలు చెప్పలేమని అధికారులు అంటున్నారు. పీక్ అవర్స్‌గా పిలిచే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య విద్యుత్తు వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో ఆ సమయంలో గ్రామాల్లో మూడు; పట్టణాలు, నగరాల్లో రెండు గంటల చొప్పున కోతలు విధిస్తున్నారు.
Advertisement
Advertisement