రాజమండ్రి :‘రాష్ట్రంలో ఇక విద్యుత్ కోతలుండవు.. వారానికి ఏడు రోజులూ.. 24 గంటలూ (24/7) విద్యుత్ సరఫరా జరుగుతుంది’ అని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చేసిన ప్రకటనలన్నీ వట్టి ‘కోతలు’గా తేలిపోయాయి. కొరత, సాంకేతిక సమస్యల పేరుతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోజుకు నాలుగైదుసార్లు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఒక్కోసారి రెండు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా రాత్రిపూట విద్యుత్ కోత సర్వసాధారణంగా మారింది. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. పగటిపూట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్ ఉత్పత్తి పడిపోవడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లాకు రావాల్సిన విద్యుత్‌లో రోజుకు 2 వేల మెగావాట్లు కొరత ఉంటోంది. దీంతో రాత్రి వేళల్లో లోడ్ రిలీఫ్ ప్రకటించాల్సి వస్తోందని అంటున్నారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, కొత్త లైన్లు వేయడం, ఎవరైనా వినియోగదారుని సర్వీసు నిలిచిపోతే మరమ్మతులు చేయడంవంటి పనులు కూడా దీనికి తోడవుతున్నాయి. మండు వేసవిలోనే విద్యుత్ సరఫరా బాగుందని, వర్షాకాలం మొదలైన తరువాత కోతలేమిటని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ ‘కోతలే’..
Published Sun, Sep 6 2015 1:17 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Advertisement