మళ్లీ చీకట్‌లు!
- విశాఖలో 3 గంటలు
- గ్రామీణ ప్రాంతాల్లో 5 గంటలు కోత
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ కోతల్లేని నవ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని పాలకులు ఊదరగొడుతుంటే...ఈపీడీసీఎల్ అధికారులు వేళాపాళాలేకుండా సరఫరా నిలిపివేసి వినియోగదారులకు నరకయాతన చూపెడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఉపాధి హామీ పీడీ శ్రీరాములనాయుడు నర్సీపట్నంలో క్లస్టర్ సమావేశం నిర్వహిస్తుండగా కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలుతురులోనే సమావేశాన్ని కొనసాగించాల్సి వచ్చింది. విశాఖలో 3 గంటలు, గ్రామీణ జిల్లాలో 4 నుంచి 5 గంటలు సరఫరా నిలిపివేశారు.
పరిశ్రమలకు 5 గంటల కోత విధించారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కూడా చాలా వరకు పడిపోయింది. సరఫరా, డిమాండ్ల మధ్య వ్యత్యాసంతో సాంకేతిక సమస్యలు ఏర్పడి కొన్ని యూనిట్లు ట్రిప్పయ్యాయి. దీంతో వేసవి మాదిరి విద్యుత్ కోతలు మొదలయ్యాయి. జిల్లా వరకు పరిశీలిస్తే శుక్రవారం 16 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. 15 మిలియన్ యూనిట్లు దాటి సరఫరా కాని పరిస్థితి. దీంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 4 నుంచి 5 గంటలపాటు విద్యుత్ కోతలుండగా, విశాఖలో మూడు గంటలు అత్యవసర కోతలు విధించారు. గురువారంతో పోలిస్తే గ్రామీణ, విశాఖ ప్రాంతాల్లో ఒక్కో గంట కోతలు పెరిగాయి.
తగ్గిన ఉత్పత్తి :
ఈపీడీసీఎల్ పరిధిలో శుక్రవారం నాటికి విండ్ పవర్ జనరేషన్ పూర్తిగా పడిపోయింది. 500 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ విద్యుత్ కేవలం మూడు మాసాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది వారం రోజుల ముందే అయిపోయింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కూడా 700 మెగావాట్ల వరకు క్షీణించింది. సాధారణంగా 2,400-2,500 మెగావాట్లు ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్ ప్రస్తుతం 1800 మెగావాట్లు మించి ఉత్పత్తి కాని పరిస్థితి. మరోవైపు వర్షాలు పడకపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ వాడ కం బాగా పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు.
ఎండల తీవ్రత కూడా ఉండడంతో ఏసీల వినియోగం భారీగా ఉన్నట్టు పేర్కొంటున్నారు. శుక్రవారం ఈపీడీసీఎల్ పరిధిలో డిమాండ్ 2,200 మెగావాట్ల వరకు ఓ దశలో ఉంది. కానీ కోటా 1574 మెగావాట్లు మాత్రమే. అయినప్పటికీ ప్రత్యామ్నాయ సర్దుబాట్లుతో 1970 మెగావాట్ల వరకు శుక్రవారం విద్యుత్‌ను అందించగలిగారు.
పరిశ్రమలకు భారీ కోత : విద్యుత్ ఉత్పత్తి క్షీణించి, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈపీడీసీఎల్ అధికారులకు పరిశ్రమలపై పడ్డారు. గృహ వినియోగానికి సాధ్యమైనంత వరకు ఇబ్బందులుండరాదన్న ఉద్దేశంతో విద్యుత్ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలించకపోయినా.. భారీ వర్షాలు కురవకపోయినా విద్యుత్ వెతలు మరింత ఎక్కువయ్యే ప్రమాదముందని ఈపీడీసీఎల్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.