
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత ఉధృతమవుతోంది. సాధారణం కంటే కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియా, పర్వత ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా రికార్డవుతున్నాయి.
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఆ జిల్లాలోని హుకుంపేటలో 3.7, చింతపల్లిలో 4.9, అరకులోయలో 5.1 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజనులో హుకుంపేటలో నమోదైన 3.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యల్పం. అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, నంద్యాల, కాకినాడ, వైఎస్సార్ జిల్లాలు చలితో వణుకుతున్నాయి.
ఈశాన్య, ఉత్తర గాలుల వల్లే...
ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత అధికంగా ఉంది. అటు నుంచి ఉత్తర గాలులు మన రాష్ట్రంపైకి వీస్తున్నాయి. వీటికి ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చల్ల గాలులు కూడా తోడవుతున్నాయి. వీటి ప్రభావంతోనే రాష్ట్రంలో చలి ఉధృతి పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో చలి తీవ్రత ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద శనివారం ‘సాక్షి’కి తెలిపారు. వాయవ్య గాలులు కూడా మొదలైతే కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత క్షీణిస్తాయని, జనవరి ఆరంభం నుంచి చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
చలికి పొగమంచు తోడు...
ప్రస్తుతం చలి ఉధృతికి పొగమంచు కూడా తోడవుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. సముద్రం పైనుంచి ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల వల్ల పొగమంచు ఏర్పడుతోంది. ఈ పొగమంచు దట్టంగా అలముకోవడం వల్ల రోడ్లపై ముందు వెళుతున్న వాహనాలు కనిపించక ఒకదానికొకటి ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనచోదకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.