
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 21న వాయుగుండంగా మారనుంది. ఇది థాయ్‌లాండ్ వైపుగా ప్రయాణించనుంది. దీని ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరో 10 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణం కంటే.. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గడం, దీనికి తోడు గాలులు వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు పడిపోతే అతి శీతల గాలులు(కోల్డ్‌వేవ్స్)గా ప్రకటిస్తారు.
ఏజెన్సీలో పలు చోట్ల ఈ తరహా కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టులో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. డుంబ్రిగుడలో 8, అరకు, జి.మాడుగుల, లంబసింగిలో 9, పెదబయలులో 9.5, పాడేరులో 11, చింతపల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.