సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాద స్థాయి తగ్గుముఖం పట్టింది. ప్రమాదానికి కారణమైన ట్యాంక్‌లో ఉష్ణోగ్రత తగ్గడంతో.. అందులో ద్రవరూపంలో ఉన్న స్టైరీన్ క్రమంగా ఘన రూపంలోకి మారుతోంది. దీంతో వాయువు వెలువడే అవకాశం లేకపోవడంతో గండం నుంచి దాదాపు గట్టెక్కినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
► ప్రమాదం సంభవించినప్పుడు ట్యాంక్ లోపలి ఉష్ణోగ్రత 150 డిగ్రీల వరకు ఉండగా.. ప్రస్తుతం 73 డిగ్రీలకు చేరుకుంది. సోమవారం రాత్రి నాటికి 50 డిగ్రీలకు చేరుకునే సూచనలున్నాయి. ఉపరితల ఉష్ణోగ్రతలు 98.4 డిగ్రీల నుంచి 92.6 డిగ్రీలకు చేరుకున్నాయి.
► ఉష్ణోగ్రతని తగ్గించేందుకు ట్యాంక్‌పై నిరంతరం నీటిని చల్లుతున్నారు. ఈ చల్లే క్రమంలో ఆవిరి విడుదలవుతోంది. ఈ ఆవిరి వాసనే అప్పుడప్పుడూ వస్తుందనీ.. దీనికి ప్రజలు భయపడొద్దని నిపుణులు చెబుతున్నారు.
► నిరంతరం నీటిని చల్లుతుండటంతో ద్రవరూపంలో ఉన్న స్టైరీన్ ఘనీభవనం చెందుతోంది. పూర్తిగా గడ్డకట్టేస్తే.. చిన్నపాటి వాయువు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు.
► ప్రమాదం సంభవించినప్పుడు ట్యాంక్‌లో 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరీన్ నిల్వ ఉండగా... ప్రస్తుతం 1550 మెట్రిక్ టన్నులకు చేరింది.
► ప్రమాదానికి కారణమైన ట్యాంక్ పక్కన ఉన్న 3 వేల మెట్రిక్ టన్నుల ట్యాంక్‌ని ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో ఉన్న స్టైరీన్ మోనోమర్ నిల్వల్ని ప్లాంట్ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం స్టైరీన్ నిల్వలే కాకుండా.. ప్లాంట్‌లో ఉన్న రసాయనిక నిల్వలన్నింటినీ అక్కడి నుంచి తరలించేందుకు అవసరమైన రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.
► ట్యాంక్ ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, ప్లాంట్‌లో స్టైరీన్ వాయువు తీవ్రత, గాఢతని నిపుణుల బృందం ఎప్పటికప్పుడు నమోదు చేస్తోంది.
గండం నుంచి గట్టెక్కినట్లే..!
Published Mon, May 11 2020 4:30 AM | Last Updated on Mon, May 11 2020 4:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment