- తిరోగమనంలో జిల్లా పారిశ్రామిక రంగం
- విద్యుత్ కోతలతో ఆరు నెలలుగా అవస్థలు
- 205 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూత
- నష్టం రూ.425 కోట్లు పైమాటే, ఏడాదిన్నరగా కొత్త పరిశ్రమల్లేవు
పారిశ్రామిక రంగం చుట్టూ అంధకారం అలుముకుంది. సమీప భవిష్యత్తులో జిల్లా ఆ రంగంలో పురోగమించే అవకాశాలు దాదాపు మృగ్యమే. ఒక పక్క విద్యుత్ వెత లు, మరో పక్క ప్రభుత్వ ప్రోత్సాహం కరువై ప రిశ్రమలు కొట్టుమిట్టాడుతున్నాయి.గత ఏడాది న్నరగా జిల్లా పరిశ్రమ శాఖకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవటం ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది.
సాక్షి, విశాఖపట్నం : పారిశ్రామిక రంగం మునుపెన్నడూ లేనివిధంగా తిరోగమనంలో పయనిస్తోంది. వరుస విద్యుత్ కష్టాలు వెన్ను విరుస్తుండడంతో చిన్నా,పెద్దా, మధ్య తరహా కంపెనీలు కకావికలమవుతున్నాయి. వర్షాలు కురవక ఇప్పటికే వ్యవసాయరంగం, మత్స్యరంగం కుదేలవగా, ఇప్పుడు పారిశ్రామిక రంగం కూడా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. చేతినిండా కంపెనీలకు ఆర్డర్లున్నా విద్యుత్ సరఫరా లేక కుయ్యోమొర్రోమంటున్నాయి. పెద్ద కంపెనీలు బండిలాగిస్తున్నా మధ్యతరహా, చిన్న కంపెనీలు మాత్రం కరెంటు లేక బతికి బట్టకట్టలేకపోతున్నాయి. విద్యుత్ సంక్షోభం ఫలితంగా జిల్లాలో కొద్దిరోజులుగా 205కి పైగా పరిశ్రమలు మూతపడగా, నష్టం రూ.425 కోట్లపైగా దాటిపోయింది.
కోలుకోవడం కష్టమే
జిల్లాలో కుటీర, చిన్నతరహా పరిశ్రమలు 3,600 ఉన్నాయి. ఇవి కాకుండా మరో 55 పెద్ద కంపెనీలున్నాయి. వీటిలో 45వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. వీఎస్‌ఈజెడ్‌లోని 44 పరిశ్రమల్లో 6 వేలమంది ఉపాధి పొందుతున్నారు. ఫార్మా ఎస్‌ఈజెడ్‌లో 54 కంపెనీలు,ఏపీఐఐసీలో 900 పరిశ్రమలు,గాజువాక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 50 కంపెనీలున్నాయి. లక్షలాదిమంది కార్మికులు వీటిలో పని చేస్తున్నారు. పవర్‌హాలీడే కారణంతో ఈ కంపెనీలన్నీ తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుపోతున్నాయి. ఆరు నెలలుగా జిల్లాలో ఇదే తీరు. విభజనకు ముందు వరుస ఆందోళనతో జిల్లా పారిశ్రామిక రంగం తీవ్రంగా నష్టపోయింది.
మేనెలాఖరులో రెండురోజులు విద్యుత్ సమ్మె కారణంగా నష్టం రూ.101 కోట్లకు చేరింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఏదైనా చర్యలు తీసుకుంటుందని పారిశ్రామిక వర్గాలు ఆశపడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు కూడా చేతులెత్తేయడంతో పారిశ్రామిక వర్గాలు నిట్టూరుస్తున్నాయి.
జిల్లాలో దాదాపు అన్ని పరిశ్రమలు పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయాయి. వారంలో ఒకటి నుంచి రెండురోజులు విద్యుత్తు లేకపోవడం, మిగిలిన అయిదు రోజుల్లోనూ తీవ్ర అవాంతరాలు ఎదురవుతుండడంతో కంపెనీలు నష్టపోతున్నాయి. కొన్ని వారాలుగా పవర్ హాలీడే నిరంతరాయంగా కొనసాగడంతో జిల్లాలో 220 చిన్న, మధ్యతరహా యూనిట్లు మూతపడ్డాయి. ముఖ్యంగా ఫుడ్‌ప్రాసెసింగ్,మినరల్ వాటర్‌ప్లాంట్స్,ఫెర్రోఅల్లాయిస్, ఆటోమొబైల్ రంగాలు అల్లాడిపోతున్నాయి.
పెద్ద కంపెనీల్లా వీటికి జనరేటర్ వాడాలనుకున్నా సాధ్యపడడంలేదు. ఇవి 3వేల కేవీ సామర్థ్యంతో నడుస్తుండడంతో ఆ స్థాయి విద్యుత్‌ను జనరేటర్లు సరఫరా చేయలేకపోతుండడంతో మూసివేత మినహా మరో మార్గం లేక ఇవన్నీ తాత్కాలిక మూత విధానాన్ని పాటించాయి. ఇంజినీరింగ్,ఉక్కు,గార్మెంట్స్,కెమికల్ రంగాలైతే ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి.దీనివల్ల వేలాదిమంది కార్మికులు రోడ్డున పడుతున్నారు.