అంధకారంలో విశాఖ నగరం
* విద్యుత్తు, సమాచార, రవాణా వ్యవస్థలు విచ్ఛిన్నం
హుదూద్ ధాటికి విశాఖపట్నంలోని విద్యుత్తు, సమాచార, రవాణా వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. వేలసంఖ్యలో విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. ఈ నష్టం కోట్లలోనే లెక్కతేలనుంది. శనివారం రాత్రి నుంచే విశాఖ నగరంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. ఇక ఆదివారం నాటి విధ్వంసంతో మరో రెండురోజుల వరకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.
గృహాల్లో ఇన్వర్టర్లలో ఛార్జింగ్ కూడా దాదాపు అయిపోవడంతో విశాఖ నగరం రెండురోజులు అంధకారంలో కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి దాపురించింది. ఇక కేబుల్ వైర్లు చాలావరకు తెగిపోయి సెల్ టవర్లు పనిచేయడం మానేశాయి. దాంతో విశాఖ నగరంలో ల్యాండ్‌ఫోన్, సెల్ ఫోన్, ఇంటర్‌నెట్ సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. సమాచార సంబంధాలు తెగిపోయాయి.
ఒకటీ అరా ఫోన్లు పనిచేసినా కరెంటు లేక టీవీలు కూడా పనిచేయకపోవటంతో అసలు విశాఖలో ఏం జరుగుతోందన్నది విశాఖవారే ఇతర ప్రాంతాల్లోని వారికి ఫోన్లు చేసి తెలుసుకోవాల్సి వచ్చింది. ఆదివారం రాత్రికి గాలుల తీవ్రత కొంత తగ్గినా వర్షం భారీగా కురుస్తుండటంతో ఇళ్లలోంచి బయటకి వచ్చే పరిస్థితి లేక... బయట ఏం జరుగుతోందో తెలీక భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. సెల్‌ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయి ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.
విశాఖలోని రోడ్లతోపాటు ఇతర ప్రాంతాలతో అనుసంధానించే అన్ని ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్‌హెచ్ 16 మీద ఎక్కడిపడితే అక్కడ వందల సంఖ్యలో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. దాంతో ఇతర ప్రాంతాలతో విశాఖ నగరానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కట్టర్లు తెచ్చి చెట్లను కోసి, స్తంభాలు తీసి రోడ్లపై రాకపోకలను పునరుద్ధరించడానికి ఎంతసమయం పడుతుందన్నది చెప్పలేని స్థితి నెలకొంది.