సమన్వయంతో ముందడుగు
- అందరినీ కలుపుకుంటూ పార్టీ బలోపేతం
- కార్యకర్తలకు కమిటీలతో గుర్తింపు
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమర్‌నాథ్ పిలుపు
విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్‌నాథ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పార్టీ ముఖ్యనాయకులు భారీగా హజరైన ఈ కార్యక్రమం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ సమన్వయంతో వ్యవహరిస్తూ పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు చేపడతామన్నారు. అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జిల్లాలో మండల, బూత్ స్థాయి కమిటీలు, నగరంలో అనుబంధ సంఘ, వార్డు కమిటీలు వేస్తామన్నారు. నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామన్నారు.
జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పారు. రాజధాని కోసం మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడుకు రాజధానికి అవసరమయ్యే వనరులు, స్థలాలు గురించి తెలుసా అని ప్రశ్నించారు. అబద్దాలు హామీలిచ్చి చంద్రబాబు గద్దెనెక్కారని ఆక్షేపించారు. అయిదేళ్ల పదవి కాదని ఒక్కసారి అధికారంలోకి వస్తే జీవితాంతం ప్రజల్లో నిలిచిపోయే పాలన అందించడ మే లక్ష్యమని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ యువకుడ్ని అధ్యక్షుడిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. జీవీఎంసీ ఎన్నికలను సవాలుగా తీసుకోవాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ విశాఖను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. నగరాన్ని రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ మాట్లాడుతూ సమష్టిగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామన్నారు.
మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు మాట్లాడుతూ గుడివాడ కుటుంబానికి జగన్‌మోహన్‌రెడ్డి తగిన గుర్తింపునిచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ పార్టీ పగ్గాలతో అమరనాథ్‌పై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కర్రి సీతారాం మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో విజయానికి శక్తివంచన కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకటరావు, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, ప్రగడ నాగేశ్వరరావు, రొంగలి జగన్నాథం, జిల్లా మాజీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, సీఈసీ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్, దామా సుబ్బారావు, అధికార ప్రతినిధి కంపా హనోకు, అనుబంధ సంఘ కన్వీనర్లు పక్కి దివాకర్, రవిరెడ్డి, విజయకుమార్‌రాజు, విల్లూరి భాస్కరరావు, కాళీదాసురెడ్డి పాల్గొన్నారు.