
సాక్షి, విశాఖపట్నం: రానున్నది రాజన్న రాజ్యమేనని, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ అన్నారు. వైఎస్సార్‌సీపీ 9వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఉదయం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మళ్ల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో భూకబ్జాలు పెచ్చుమీరిపోయాయన్నారు. విశాఖలో భూట్యాంపరింగ్ జరిగి లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని సాక్ష్యాత్తు అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమారే వెల్లడించారని గుర్తు చేశారు.
సుమారు మూడున్నర కోట్ల ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను ఐటీ గ్రిడ్ అనే ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం పెద్ద సైబర్ నేరమన్నారు. అంచెలంచెలుగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూ, దొంగ ఓట్లు సృష్టిస్తూ టీడీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టిందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కలిగి ఉండడం వారి హక్కు అన్నారు. రాష్ట్రంలో ఉన్న 40 వేలకు పైగా బూత్‌ల్లో ఈ నెల 15వ తేదీ వరకు అధికారులను అందుబాటులో ఉంచి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టాలని కోరారు. ప్రజల ఆదరణ, అభిమానం తమ పార్టీ వైపే ఉన్నాయని చెప్పారు.
ఈ సారి వై.ఎస్.జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. టీడీపీ చేస్తున్న కుట్ర, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని, దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా రానున్న ఎన్నికల్లో తీర్పు ఉంటుందని చెప్పారు. తమ మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, అవి ఫలించవన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
టికెట్ ఎవరికిచ్చినా కష్టపడి పనిచేయండి
పార్టీ విశాఖ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఎనిమిదేళ్లపాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, అదే స్ఫూర్తితో ఎన్నికల్లో పనిచేయాలన్నారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో టికెట్ ఎవరికిచ్చినా అందరం కలిసి పనిచేసి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి కొత్త వ్యక్తులు చేరారని, అందరికీ పదవులు వరించవని, అలాగని ఎవరూ నిరుత్సోహపడవద్దని సూచించారు. మనమంతా ఏకతాటిగా పనిచేసి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment