వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్ర రావు(పాత చిత్రం)
విశాఖపట్నం: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర ఖజానాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖాళీ చేశారని వైఎస్‌ఆర్‌సీపీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. విశాఖపట్నంలో దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వ్యవహారంపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు రద్దయి పోతాయని గ్రామాల్లో టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. టీడీపీ సర్కారే రద్దవుతుంది.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
బాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏ అధికారాలు ఉంటాయో చంద్రబాబుకు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పక్కన పెట్టి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు గట్టిగా చెప్పడంతో హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారని తెలిపారు. మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయాల్సి ఉంది.. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించే ధోరణిలో బాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లను బెదిరించి కౌంటింగ్‌లో అనుకూలంగా పని చేయాలని చెబుతున్నారని ఆరోపించారు. ఈసీ అనుమంతి లేకుండా కాపు కార్పొరేషన్ ఎండీని ఎలా బదిలీ చేస్తారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈసీ చర్యలు తీసుకోకుంటే బాబు రేపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తారని అన్నారు.
టీటీడీ బంగారం ఎవరు తరలిస్తున్నారు.. ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం తెలియాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ఇజ్రాయెల్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని.. కొనుగోలు చేసిన వాటితో ప్రతిపక్ష నాయకుల, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చంద్రబాబుతో పాటు సమావేశాలకు హాజరయిన అధికారులపై కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఎన్నికల నియమావళిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment