dhadi veera badhra rao
-
వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవడమేంటి?
సాక్షి, విశాఖ: వాలంటీర్ల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాగాన్ని పని చేయనీయకుండా అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేయటాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వారి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్తర్వులను జారీ చేయకుండా ఎన్నికల కమిషనర్‌ను నియంత్రించాలని ఆయన కోరారు. కమిషనర్ ఇచ్చిన న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులపై ప్రభుత్వం ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా కోర్టు సమయం కూడా వృధా అవుతుందని పేర్కొన్నారు. వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు విఘాతం కలుగుతుందని, దాని వల్ల రాష్ట్రంలోని పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా రాజకీయ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానకుంటే కుప్పంలో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని జోస్యం చెప్పారు. -
ఏపీ రాజధాని: ఉత్తరాంధ్ర తరఫున స్వాగతిస్తున్నా
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటును ఉత్తరాంధ్ర ప్రజలు తరఫున తాను స్వాగతిస్తున్నానని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నేతలు బానిస బతుకులు బతకొద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అసెంబ్లీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం మీడియాతో మాట్లాడిన వీరభద్రరావు.. విశాఖలో సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయాలన్న సీఎం నిర్ణయాన్ని అంతా స్వాగతించాలని కోరారు. రాజకీయ అవకాశం కోసం టీడీపీ నేతలు చంద్రబాబు దగ్గర తానా అంటే తందానా అనకండిని అన్నారు. ఉత్తరాంధ్ర చాలా కాలం నుండి వెనుకబడి పోయిందని, వ్యవస్థల వికేంద్రీకరణ సాహసోపేతమైన నిర్ణయమని అభినందించారు. (ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడా మూడు చోట్ల వికేంద్రీకరణ లేదు. ఇదొక ప్రతిష్టాత్మక నిర్ణయం. సీఎం ఎక్కడ నుండి పరిపాలన చేస్తారు అని చంద్రబాబు అనటం సిగ్గుచేటు. వైఎస్ జగన్ విశాఖ నుండే పరిపాలన చేస్తారన్నది స్పష్టం. కేవలం ఓట్లు మాత్రం కావాల్సిన పెద్దమనిషి చంద్రబాబు నాయుడు. విశాఖ, రాయలసీమ అభివృద్ధిని వ్యతిరేకించడం దారుణం. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. విశాఖ పోర్ట్ అభివృద్ధి కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు, లోకేష్‌లు కమిషన్లకు కక్కుర్తిపడి నిర్మాణం కాకుండా అడ్డుతగిలారు. ఏ రాజకీయ నేత చేయని కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నారు. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ప్రజలు చంద్రబాబును హర్షించరు. అన్ని వ్యవస్థలు ఒకే చోట ఉండే మిగతా ప్రాంతాలు వెనుకబడి పోతాయి. రాజ్యాంగ సంస్థల వికేంద్రికరణ చాలా అవసరం. అమరావతిని రాజధానిగా తీసివేయడంలేదు. అక్కడ కూడా ఓ వ్యవస్థ ఉంది. అమరావతిలో ముందే భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అవన్నీ దెబ్బతింటాయనే బాధపడుతున్నారు. అందుకే ఓ వ్యాపారస్తుడిలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. సీఎం జగన్ ప్రకటన ద్వారా 2020లోనే వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభమై, 2021 నాటికి సెక్రటేరియట్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’ అని అన్నారు. -
‘టీడీపీ ఆఫీసులో జగన్ ఫోటో పెట్టుకోండి’
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలని టీడీపీ నేతలనుద్దేశించి వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. శుక్రవారం దాడి వీరభద్రరావు విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడి నైతిక విలువలను తుంగలో తొక్కిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి నైతిక విలువలు నేర్చుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తే టీడీపీలో ఒక్క చంద్రబాబు నాయుడే మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని దేశంలోని అన్ని చట్టసభల్లోనూ అమలు చేయాలని కోరారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నైతిక విలువలు పాటిస్తే గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించారు. -
‘బాబు లక్ష శాతం ఓడిపోవడం ఖాయం’
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో లక్ష శాతం ఓడిపోవడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు జోస్యం చెప్పారు. మంగళవారం దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ.. ఓడిపోవడం ఖాయమని తెలిసే దేశమంతా తీర్ధయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. పిలవని పేరంటానికి చంద్రబాబు నాయుడు వెళ్లడమే కాకుండా తాను ఏదో సారించేస్తానని ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అందరి దగ్గరకు వెళ్లి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. -
అధికారుల వైఫల్యాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
అనకాపల్లిటౌన్: ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్ వైఫల్యాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్టు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తెలిపారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో వైఫల్యాలే కాకుండా అధికారపార్టీకి అనుకూలంగా పక్షపాత వైఖరితో నిరంకుశంగా కలెక్టర్ ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కలెక్టర్‌ను చంటీ అని ముద్దుగా పిలుస్తారని కూడా విస్తృతప్రచారం ఉందని, ఎన్నికల రోజు చాలా ఈవీఎంలు పని చేయకపోతే వాటిని వెంటనే మార్పు చేయడానికి వందశాతం ఈవీఎంలు అదనంగా అందుబాటులో ఉన్నప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వాటిని వినియోగించనివ్వకుండా ఉత్తర్వులు ఇచ్చారని ఆయన తెలిపారు. మరమ్మతులు చేసే వారు నియోజకవర్గానికి ముగ్గురు ఉన్నారని, వారు వచ్చేవరకు మార్చవద్దని ఆదేశాలు ఇచ్చి జిల్లాలో ఓటర్లను మూడు,నాలుగు గంటలపాటు క్యూలైన్లో నిలబడే పరిస్థితి కల్పించారని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న భావనతో వారికి పోస్టల్ బ్యాలెట్‌పేపర్లు అందకుండా అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. జిల్లాలో సుమారు 33 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పనిచేయగా అందులో పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్లు 27,168 మందికి పంపామని చెప్పారని ఆయన తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ బ్యాలెట్లను 28,451 మందికి పంపామని ప్రకటించారన్నారు. ఈ విధంగా రెండు కలిపి సుమారు 10 వేల మందికి బ్యాలెట్‌పేపర్లు పంపకపోవడం వల్ల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఆయన తెలిపారు. గతంలో జమిలి ఎన్నికలు జరిగినప్పుడు శాసనసభల రిటర్నింగ్ అధికారులే అసెంబ్లీ, పార్లమెంట్లో పోస్టల్ బ్యాలెట్లను ఒకసారే కవర్లో పెట్టి పంపేవారని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు పరుస్తున్నారన్నారు. మన జిల్లాలో రెండింటినీ విడదీసి పార్లమెంట్ ఓట్లను కలెక్టర్ కార్యాలయం నుంచి పంపడానికి నిర్ణయించారని తెలిపారు. అధికారులు ప్రకటించిన ప్రకారం కూడా ఓటర్లకు పూర్తిస్థాయిలో బ్యాలెట్లు అందలేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోరే ఉద్యోగుల ఫారం 12 దరఖాస్తులను పోలింగ్ ముందురోజు వరకు ఇవ్వవచ్చు కానీ, కలెక్టర్ పోలింగ్‌కు నాలుగురోజుల ముందు 7వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులను తీసుకున్నారని తెలిపారు. మార్చి 31వతేదీన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పత్రాను పంపి, వాటిని ఏప్రిల్ 5లోపు అందజేమని ఆదేశించారని చెప్పారు. మరికొంతమందికి ఏప్రిల్ 5వతేదీన పోస్టల్బ్యాలెట్లు ఇచ్చి, 10వతేదీలోపు అందజేయాలని ఆదేశించారని ఆయన తెలిపారుజిల్లాలో ఉద్యోగులకు కావాలనే ఓటు హక్కు లేకుండా జిల్లా కలెక్టర్ చేశారని ఆరోపించారు. నింపిన బ్యాలెట్ పేపర్లను రిటర్నింగ్ అధికారులకు ఇవ్వకుండా పోస్టులో పంపాలని నిబంధన పెట్టినందువల్ల కౌంటింగ్ నాటికి కూడా పోస్టల్ బ్యాలెట్లు అందని పరిస్థితులు ఏర్పడతాయన్నారు. వీవీ ప్యాట్ వెయ్యి స్లిప్‌లు మాత్రమే పడతాయి. అది తెలిసి కూడా 1400 వరకు ఓటర్లను బూత్‌లకు కూడా ఒక్కొక్క ఈవీఎంను కేటాయించినట్టు ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అవే ఈవీఎంలు కౌంట్ చేస్తే 10 స్లిప్‌లు మాత్రమే వచ్చి, మిగిలిన 400 స్లిప్‌లు కనిపించవన్నారు. ఈ సమస్యను అధికారులు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల రోజు ఈవీఎంల్లో మాక్ పోలింగ్ చేసిన పిదప వాటిని క్లోజ్ చేయాలి. అలా చేయకపోతే నిజమైన పోలింగ్ మాక్ పోలింగ్ వల్ల వచ్చిన సంఖ్యకు తేడా వస్తే దాన్ని ఎలా పరిష్కరిస్తారన్నారు. వైఎస్సార్సీపీ తరఫున జిల్లా అభ్యర్థులు నాలుగుపర్యాయాలు కలెక్టర్‌కు సమస్యలు చెప్పినప్పటిìకీ పట్టించుకోలేదని ఆరోపించారు. అడిగిన సమాచారం ఇవ్వరు, పైగా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు రాజ్యాంగ ప్రకారం ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించమంటే కలెక్టర్ రాజ్యాంగాన్ని అవహేళన చేశారని, దురదృష్టవశాత్తు రాజ్యాంగంలో ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చలేదని రాజ్యాంగ నిర్మాతను చులకనగా మాట్లాడారన్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసే కలెక్టర్ ఈ ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరుపుతారన్న నమ్మకం మాకు లేదన్నారు. సీనియర్ కేంద్ర అధికారులను ప్రత్యేక అబ్జర్వర్లుగా పంపి కౌంటింగ్ బాధ్యతలు అప్పగించాల్సిందిగా ఆయన కోరినట్టు చెప్పారు. -
‘టీడీపీ సర్కారే రద్దవుతుంది.. భయపడొద్దు’
విశాఖపట్నం: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర ఖజానాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖాళీ చేశారని వైఎస్ఆర్సీపీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. విశాఖపట్నంలో దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వ్యవహారంపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు రద్దయి పోతాయని గ్రామాల్లో టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. టీడీపీ సర్కారే రద్దవుతుంది.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. బాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏ అధికారాలు ఉంటాయో చంద్రబాబుకు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పక్కన పెట్టి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు గట్టిగా చెప్పడంతో హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారని తెలిపారు. మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయాల్సి ఉంది.. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించే ధోరణిలో బాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లను బెదిరించి కౌంటింగ్‌లో అనుకూలంగా పని చేయాలని చెబుతున్నారని ఆరోపించారు. ఈసీ అనుమంతి లేకుండా కాపు కార్పొరేషన్ ఎండీని ఎలా బదిలీ చేస్తారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈసీ చర్యలు తీసుకోకుంటే బాబు రేపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తారని అన్నారు. టీటీడీ బంగారం ఎవరు తరలిస్తున్నారు.. ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం తెలియాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ఇజ్రాయెల్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని.. కొనుగోలు చేసిన వాటితో ప్రతిపక్ష నాయకుల, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చంద్రబాబుతో పాటు సమావేశాలకు హాజరయిన అధికారులపై కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఎన్నికల నియమావళిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
కోడ్ ఉల్లంఘించిన చంద్రబాబు పదవి నుంచి వైదొలగాలి
-
‘ఆయన టీడీపీని భ్రష్టు పట్టించాడు’
విశాఖపట్నం: తెలుగు వారి అభ్యున్నతి కోసం పుట్టిన టీడీపీని నారా చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం పదవి, డబ్బు మాత్రమే చంద్రబాబుకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ పొరపాటున గెలిస్తే చంద్రబాబు కేంద్రంలో మంత్రి పదవి పొందాలని తాపత్రయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి బాబు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కొనసాగించడం తగదన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని వెంటనే సీఎంగా చంద్రబాబుని తొలగించాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ నేతలకు ఎథిక్స్ లేవు
-
చంద్రబాబు మళ్లీ రాకూడదు
విశాఖపట్నం, కోటవురట్ల(పాయకరావుపేట): అనుభవం ఉందని గెలిపించిన పాపానికి చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి రాష్ట్రంలో అరాచక పాలన సాగించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, అధికారులు వాటాలు పంచుకుని మరీ దోచుకున్నారని, రైతును కోలుకోలుకుండా చేశారని దుయ్యబట్టారు. మంగళవారం తంగేడు వచ్చి ఇక్కడి రాజులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేవని, అవినీతిని పెంచి పోషించిన చంద్రబాబుకు ఉద్వాసన పలకేలా ఓటరు తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. ఇపుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కాదని, తెలుగు కాంగ్రెస్ అని, ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలగాలంటే చంద్రబాబును ఓడించాలని టీడీపీ కార్యకర్తలను కోరుతున్నామన్నారు. మళ్లీ రాక్షస పాలన రాకుండా చంద్రబాబును ఇంటికి పంపాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. అవినీతి ఎమ్మెల్యేలను తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లపై పడి వారం వారం కలెక్షన్లు చేసుకుంటూ రూ.వందల కోట్లు గడించారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఇసుక మాఫియా ఎంతగా పాతుకుపోయిందో అందరికీ తెలుసన్నారు. రూ.కోట్లు గుమ్మరించి గెలిచేద్దామన్న భావన చంద్రబాబుకు ఉందని, ప్రజలు చైతన్యవంతులుగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఓటింగ్ సమయంలో కూడా చంద్రబాబు కుయుక్తులు పన్నుతాడని, దీనిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు సమర్ధంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీపై ప్రజల్లో పూర్తి అసంతృప్తి ఉందని, జాతీయ చానళ్లు కూడా తమ సర్వేలో వైఎస్సార్సీపీకే పట్టమని ప్రకటించాయన్నారు. జగన్మోహన్రెడ్డికి ప్రజల ఇబ్బందులు, సమస్యలపై పూర్తి అవగాహన వచ్చిందని, అతను మునుపటి యువకుడు కాదని అనుభవంతో రాటుతేలిన గొప్ప నాయకుడన్నారు. దేశ చరిత్రలోనే ఎవ్వరూ చేయలేనటువంటి పాదయాత్ర చేసి ప్రతీ పేదవాడి కష్టాలు తెలసుకున్నారన్నారు. ఇప్పుడు ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి ఒక అవకాశం ఇద్దామన్న భావనలో ఉన్నారన్నారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం కృషి చేస్తానన్నారు. జిల్లాలో అత్యధిక సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని, పాయకరావుపేట నియోజకవర్గంలో తంగేడు రాజుల సారధ్యంలో భారీ మెజారిటీతో గొల్ల బాబూరావు గెలుపు ఖాయమన్నారు. ఈసారి రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
దాడికి సముచిత స్థానం
అనకాపల్లి : శాసనమండలి మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు వైఎస్సార్సీపీలో సముచిత స్థానం దక్కింది. ఇటీవలే పార్టీలో చేరిన ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపిం ది. ఆయన తనయుడు రత్నాకరరావును అనకాపల్లి పార్లమెంటు ఎన్నికల పరిశీలకునిగా నియమించారు. సీనియర్ రాజ కీయ వేత్తగా గుర్తింపు పొం దిన వీరభద్రరావు, తనయు డు రత్నాకరరావు సేవలను పార్టీ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. వీరభద్రరరావు, రత్నాకరరావులకు పార్టీలో సముచిత స్థానం కల్పించి కీలకమైన బాధ్యతలను అప్పగించడంపై అనుచరులు, పార్టీ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
అరకులోయలో జగన్నినాదం
వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పేరుచెబితే సోనియా గాంధీ, చంద్రబాబుకు భయం పుడుతుందని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు దాడి వీరభద్రరావు అన్నారు. గురువారం అరకులోయలో నియోజకవర్గం సమన్వయకర్త కుంభా రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన భారీ సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీని ఓడించాలన్నఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు ఒడిగట్టాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వెలుగు రేఖలు నిండుతాయన్నారు. సభకు వేల సంఖ్యలో గిరిజనం తరలిరావడంతో అరకులోయ జనసంద్రమైంది. కార్య క్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణాదాస్, బొబ్బిలి పార్లమెంట్ ఇన్చార్జ్ బేబీ నాయన తదితరులు మాట్లాడారు. - న్యూస్‌లైన్, అరకులోయ