సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటును ఉత్తరాంధ్ర ప్రజలు తరఫున తాను స్వాగతిస్తున్నానని వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నేతలు బానిస బతుకులు బతకొద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం మీడియాతో మాట్లాడిన వీరభద్రరావు.. విశాఖలో సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయాలన్న సీఎం నిర్ణయాన్ని అంతా స్వాగతించాలని కోరారు. రాజకీయ అవకాశం కోసం టీడీపీ నేతలు చంద్రబాబు దగ్గర తానా అంటే తందానా అనకండిని అన్నారు. ఉత్తరాంధ్ర చాలా కాలం నుండి వెనుకబడి పోయిందని, వ్యవస్థల వికేంద్రీకరణ సాహసోపేతమైన నిర్ణయమని అభినందించారు. (ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!)
సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడా మూడు చోట్ల వికేంద్రీకరణ లేదు. ఇదొక ప్రతిష్టాత్మక నిర్ణయం. సీఎం ఎక్కడ నుండి పరిపాలన చేస్తారు అని చంద్రబాబు అనటం సిగ్గుచేటు. వైఎస్ జగన్ విశాఖ నుండే పరిపాలన చేస్తారన్నది స్పష్టం. కేవలం ఓట్లు మాత్రం కావాల్సిన పెద్దమనిషి చంద్రబాబు నాయుడు. విశాఖ, రాయలసీమ అభివృద్ధిని వ్యతిరేకించడం దారుణం. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. విశాఖ పోర్ట్ అభివృద్ధి కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చంద్రబాబు, లోకేష్‌లు కమిషన్‌లకు కక్కుర్తిపడి నిర్మాణం కాకుండా అడ్డుతగిలారు. ఏ రాజకీయ నేత చేయని కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నారు.
సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ప్రజలు చంద్రబాబును హర్షించరు. అన్ని వ్యవస్థలు ఒకే చోట ఉండే మిగతా ప్రాంతాలు వెనుకబడి పోతాయి. రాజ్యాంగ సంస్థల వికేంద్రికరణ చాలా అవసరం. అమరావతిని రాజధానిగా తీసివేయడంలేదు. అక్కడ కూడా ఓ వ్యవస్థ ఉంది. అమరావతిలో ముందే భూములు కొనుగోలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అవన్నీ దెబ్బతింటాయనే బాధపడుతున్నారు. అందుకే ఓ వ్యాపారస్తుడిలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. సీఎం జగన్ ప్రకటన ద్వారా 2020లోనే వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభమై, 2021 నాటికి సెక్రటేరియట్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment