విశాఖపట్నం, కోటవురట్ల(పాయకరావుపేట): అనుభవం ఉందని గెలిపించిన పాపానికి చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి రాష్ట్రంలో అరాచక పాలన సాగించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, అధికారులు వాటాలు పంచుకుని మరీ దోచుకున్నారని, రైతును కోలుకోలుకుండా చేశారని దుయ్యబట్టారు. మంగళవారం తంగేడు వచ్చి ఇక్కడి రాజులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేవని, అవినీతిని పెంచి పోషించిన చంద్రబాబుకు ఉద్వాసన పలకేలా ఓటరు తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. ఇపుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కాదని, తెలుగు కాంగ్రెస్ అని, ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలగాలంటే చంద్రబాబును ఓడించాలని టీడీపీ కార్యకర్తలను కోరుతున్నామన్నారు. మళ్లీ రాక్షస పాలన రాకుండా చంద్రబాబును ఇంటికి పంపాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు.
అవినీతి ఎమ్మెల్యేలను తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లపై పడి వారం వారం కలెక్షన్లు చేసుకుంటూ రూ.వందల కోట్లు గడించారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఇసుక మాఫియా ఎంతగా పాతుకుపోయిందో అందరికీ తెలుసన్నారు. రూ.కోట్లు గుమ్మరించి గెలిచేద్దామన్న భావన చంద్రబాబుకు ఉందని, ప్రజలు చైతన్యవంతులుగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఓటింగ్ సమయంలో కూడా చంద్రబాబు కుయుక్తులు పన్నుతాడని, దీనిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సమర్ధంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీపై ప్రజల్లో పూర్తి అసంతృప్తి ఉందని, జాతీయ చానళ్లు కూడా తమ సర్వేలో వైఎస్సార్‌సీపీకే పట్టమని ప్రకటించాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల ఇబ్బందులు, సమస్యలపై పూర్తి అవగాహన వచ్చిందని, అతను మునుపటి యువకుడు కాదని అనుభవంతో రాటుతేలిన గొప్ప నాయకుడన్నారు. దేశ చరిత్రలోనే ఎవ్వరూ చేయలేనటువంటి పాదయాత్ర చేసి ప్రతీ పేదవాడి కష్టాలు తెలసుకున్నారన్నారు. ఇప్పుడు ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డికి ఒక అవకాశం ఇద్దామన్న భావనలో ఉన్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం కృషి చేస్తానన్నారు. జిల్లాలో అత్యధిక సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందని, పాయకరావుపేట నియోజకవర్గంలో తంగేడు రాజుల సారధ్యంలో భారీ మెజారిటీతో గొల్ల బాబూరావు గెలుపు ఖాయమన్నారు. ఈసారి రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment