జనం సమస్యల్ని ఐడెంటిఫై చేయడం, వాటిని లోతుగా అవగాహన చేసుకోవడం, త్వరితంగా వాటిని పరిష్కరించడం లాంటి వాటితో రైతుకు రక్షణ, రైతుకూలీకి భద్రత, వృత్తిపని వారికి ఊరట, పేదలకు ధీమా, యువతకు భరోసా, మహిళలకు ప్రగతి, గిరిజనులకు కొండంత అండ, మైనారిటీలకు అభయం, చేనే తన్నకు చేయూతనిచ్చిన అభివృద్ధి–సంక్షేమ పథకాల్ని సంతృప్త స్థాయిలో అమలుపరచి సంతోషాంధ్రను నిర్మించినవాడు గత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇదే రీతి ఆలోచనలు, లక్ష్యాలు వైఎస్ జగన్‌లోనూ ఉన్నాయని నమ్ముతున్న జనం ఆయనను కూడా వైఎస్సార్‌ను ఆదరించి, అభిమానించిన రీతిలోనే అభిమానిస్తున్నారు. అందుకే ఇతర పార్టీల ఓటర్లు, చిన్నా పెద్దా నాయకులు వెల్లువలా ఆయనవైపు వస్తున్నారు.
కానీ, నేటి సీఎం చంద్రబాబు ఇలా ఆలోచించడానికి ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే ఆయన ఎన్ని సార్లు సీఎం అయినా జనం సమస్యలు తీరలేదు. ప్రజల జీవన పరిస్థితి మెరుగుపడలేదు. ఒకరకంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడల్లా అన్ని వర్గాలవారి బతుకులు దారుణంగా దిగజారిపోయాయి. అందుకు కారణం ఆయన ఆలోచనా ధోరణే. జనం ఎల్లప్పుడూ సమస్యల్లో ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష, ఫిలాసఫీ. జనం సమస్యల్లో ఉంటేనే తనవైపు దృష్టి పెడతారు, తను పెట్టే ఆశలకు, ప్రలోభాలకు లొంగుతారు. అంటే, జనానికి సమస్యలు ఉంటేనే వారిని నమ్మించి ఓట్లను పొందవచ్చు. అధికారంలో కొనసాగవచ్చు అనేదే ఆయన సిద్ధాంతం. అందుకే, జనం అవసరాల్ని ఎప్పుడూ పట్టించుకోడు.
పట్టించుకున్నట్లు కాగితాలపై చూపిస్తాడు. ఎన్నికలయ్యాక గత సీఎంలు జనానికి ఇచ్చినవాటితోపాటు, తను ఇచ్చినట్లు నటించిన వాటిని కూడా తొలగించేస్తాడు లేదా కుదించేస్తాడు. అలాంటి నిర్వాకాల్లో రేషన్ కార్డులు ఏరివేయడాలు, పేదల పెన్షన్ల సంఖ్య తగ్గించడాలు, ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, రైతు రుణాలు ఎనభై ఏడు వేల కోట్లు ఇస్తానని చెప్పి పధ్నాలుగు వేల కోట్లు మాత్రమే ఇవ్వడం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీని పూర్తిగా ఎగ్గొట్టడం, ఆర్టీసీ వంటి పలు సంస్థల్ని ప్రైవేట్‌పరం చేయడానికి ప్రయత్నించడం వంటివి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా జనానికి చెవిలో పూలు పెట్టి నమ్మక ద్రోహం చేస్తున్న ఆయన నిర్వాకాల్ని జానపదుల్లాగా నిత్యం జనం చెప్పుకోవడం రాష్ట్రమంతటా అగుపడుతోంది.
వెన్నుపోట్లు, టోకరాలు, ప్రజలకు చెవిలో పువ్వులు– ఇదేగా నీ రాజ్యం చంద్రబాబూ. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచావు, తోడల్లుడి తోకకు నిప్పంటించి బయటకు గెంటివేశావు, తోడబుట్టిన వాడిని తరిమేశావు, బావమరుదుల్ని రాజకీయం బలితీశావు, నీదికాని పార్టీలో నిలువెత్తున పెరిగావు. మామ పెట్టిన పార్టీని మామకే లేకుండా చేశావు– ఇదేగా నీ రాజ్యం చంద్రబాబూ. తుపాకీ తూట్లు, వాటర్‌కేన్ల పోటు,్ల రైతు ఉద్యమకారులకు ఇక్కట్లు, రైతులకు ఆత్మహత్యలు, వ్యవసాయ కూలీలకు అగచాట్లు చంద్రబాబు పాలనలో మామూలైపోయాయి. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య నేరం కాబట్టి నష్టపరిహారం ఇవ్వను అన్నావు.
సారా వెల్లువలు, అప్పుల వరదలు, పరదేశీ డబ్ల్యూటీఓ వాకిట్లో అరవై వేల కోట్ల అప్పుకు గతంలో ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు, ప్రపంచ వాణిజ్య సంస్థకు సలాములు కొట్టే గులాములుగా తెలుగువారిని దిగజార్చడం– ఇదేగా నీ రాజ్యం బాబూ. రైతు, కార్మిక ఉద్యమాల్ని, మహిళా, విద్యార్థి ఉద్యమాల్ని నిర్దాక్షిణ్యంగా అణచేశావు. అసలు ప్రజా ఉద్యమాల్నే ఊసులేకుండా చేసేశావు. ప్రజల హక్కుల్ని కాలరాస్తావు. కోటి వరాలను కోతల వరాలుగా మార్చిన నీ మాటలను, చేతలను జనం ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. రోజుకో అబద్ధం, రోజుకో పార్టీతో మిత్రత్వం, ముసుగు లాలూచీ చేస్తుంటే జనం అర్థం చేసుకోలేని స్థితిలో లేరు. నీ నిజ స్వరూపాన్ని క్షుణ్ణంగా అర్థంచేసుకుని.. అన్ని పార్టీల్లోని ఓటర్లూ వైఎస్ జగన్ పక్షం చేరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఈ ఎన్నికల్లో నీకు గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
వ్యాసకర్త : డా‘‘ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్రశాఖ,ఎస్వీయూ, తిరుపతి
సెల్ : 98495 84324
Comments
Please login to add a commentAdd a comment