సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరింది. ప్రజలకు సత్వరమే సేవలందించే పేరిట ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్‌ను తమ స్వప్రయోజనాలకోసం వినియోగించుకుంటున్నారు. దీన్ని ప్రతిపక్షానికి చెందిన నేతల కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల మౌఖిక ఆదేశాలతో ఈ తంతు సాగుతోంది. సీఎం కార్యాలయ అధికారులు, రియల్‌టైమ్ గవర్నెన్స్ అధికారి ఎ.బాబు పూర్తిస్థాయిలో ‘పచ్చ’పార్టీ నేతలుగా మారిపోయి.. అధికార దుర్వినియోగానికి దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలపై రియల్ టైమ్ నిఘా ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 20 వేలకుపైగా సీసీ కెమేరాలను రియల్‌టైమ్ గవర్నెన్స్‌కు అనుసంధానం చేశారు. వీటిలో 6,459 సీసీ కెమేరాల ద్వారా రియల్‌టైమ్ గవర్నెన్స్ ప్రత్యక్ష ప్రసారం ఉంది. వీటిని సీఎం కార్యాలయ అధికారులతోపాటు రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యాలయంలో ఎ.బాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిపక్ష నేతల ప్రచార కార్యకలాపాలు ఏ రీతిలో సాగుతున్నాయి.. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు.. ఇత్యాది వివరాలను పర్యవేక్షించడమేగాక వెంటనే ఈ విషయాలను ఎప్పటికప్పుడు సీఎంకు, ఆయన కుమారుడు లోకేశ్‌కు తెలియజేస్తున్నారు. వారిచ్చిన వివరాల ఆధారంగా సీఎం, ఆయన కుమారుడు లోకేష్ ప్రతి చర్యలను చేపడుతున్నారు. ఆయా నియోజక వర్గాల్లో స్థానిక నేతలతో సంప్రదింపులకోసం కొంతమందిని ప్రత్యేకంగా పంపిస్తున్నారు.
అధికారపార్టీ సేవలో ఆర్టీజీఎస్..
ప్రజలకు సత్వరమే సేవలందించే పేరిట ఏర్పాటైన ఆర్టీజీఎస్ సీఎం చంద్రబాబు, అధికార పార్టీ సేవలో తరిస్తోంది. ఏయే నియోజకవర్గాల ప్రజల్లో అధికార పార్టీ పట్ల, అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఆర్టీజీఎస్ ద్వారా ఎ.బాబు, సీఎంవో అధికారులు సేకరిస్తూ వాటిని సీఎంకు, లోకేశ్‌కు సూచిస్తుండడం గమనార్హం. మరోవైపు రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారు. ఇందుకోసం 2 వేలమందితో ప్రైవేట్ సైన్యాన్ని రెండేళ్లక్రితమే నియమించుకున్నారు. ఆ సైన్యాన్ని ఇప్పుడు అధికార దుర్వినియోగం ద్వారా పార్టీ ప్రయోజనాలకోసం సీఎం, ఆయన కుమారుడు వినియోగించుకుంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనే..
ప్రతిపక్ష నేతలతోపాటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం.. ఆ విషయాల్ని అధికారపార్టీకి చేరవేయడం ద్వారా మేలు చేయడానికి రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని సచివాలయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. ప్రభుత్వ వ్యవస్థను ఇలా ఒక పార్టీ ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేయడమంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది తీవ్రమైన చర్యగా, అధికార దుర్వినియోగంగా పరిగణించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే ప్రజాసాధికార సర్వే ద్వారా రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన ఆర్టీజీఎస్ ఇటీవల ఆ వివరాల్ని టీడీపీ కోసం రూపొందించిన సేవా మిత్ర యాప్‌కు ఐటీగ్రిడ్స్ కంపెనీ ద్వారా ఏ.బాబు చేరవేసిన విషయం వీడియో సాక్షిగా వెల్లడవడం తెలిసిందే. ఇప్పుడు అధికారపార్టీ ప్రయోజనాల కోసం ఆర్టీజీఎస్‌ను పూర్థిస్థాయిలో దుర్వినియోగం చేస్తుండడం బహిర్గతమైన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ వ్యవస్థ మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తమ అధీనంలోకి తీసుకోవడం మంచిదని అధికార వర్గాలే పేర్కొంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment