హత్యా రాజకీయాలతో నెగ్గాలనుకుంటున్నారు | YS Jagan Fires On Chandrababu Criminal Politics | Sakshi
Sakshi News home page

హత్యా రాజకీయాలతో నెగ్గాలనుకుంటున్నారు

Published Sat, Mar 23 2019 4:22 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

YS Jagan Fires On Chandrababu Criminal Politics - Sakshi

శుక్రవారం పులివెందులలో జరిగిన బహిరంగ సభకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం. అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

మీరు వేసే ప్రతి ఓటుతో రాష్ట్ర భవిష్యత్తులో మార్పులు రాబోతున్నాయి. నేను దేవుడిని నమ్ముతున్నా, ప్రజలపైనే ఆధారపడ్డా. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నినా.. దేవుడి ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో రేపు వచ్చేది కచ్చితంగా మన అందరి ప్రభుత్వమే.

చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపేస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో తిరిగేవారు ఎవరూ ఉండరని అనుకున్నారు. చిన్నాన్నను చంపేసి, తర్వాత ఆ నేరాన్ని ఆయన కుటుంబ సభ్యులపైనే నెట్టేస్తే, ఎవరినైనా అన్యాయంగా అరెస్టు కూడా చేస్తే పులివెందులలో కూడా ప్రచారం చేసే వాళ్లు ఉండరని కుతంత్రాలు పన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల్లో దహనకాండకు, హత్యలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు తన మనుషులకు నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట! ఆ నేరాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై నెట్టేద్దామని చెప్పాడట! 

కడప గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా. పులివెందుల గడ్డపై పుట్టినందుకు ఇంకెంతో గర్వపడుతున్నా.  కష్టంలోనూ గుండె ధైర్యంతో ఎలా ముందుకెళ్లాలో ఈ గడ్డ నాకు నేర్పించింది. మనపై వందల నిందలు వేస్తున్నా, వందల కుట్రలు జరుగుతున్నా తొణకకుండా, బెదరకుండా నిబ్బరంగా ఎలా ఉండాలో ఈ గడ్డ నేర్పింది. మనం మంచి చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్లు కుళ్లుతో దుష్ట పన్నాగాలు, కుతంత్రాలు పన్నినా చెరగని చిరునవ్వుతో ఎలా ఉండాలో ఈ గడ్డ నేర్పించింది. మంచిరోజులు తప్పనిసరిగా వస్తాయి, అప్పుడు నిజం వెలుగులోకి వస్తుందని, చీకటి తర్వాత వెలుగు రాక తప్పదని, అప్పటిదాకా ఓపిక, సహనంతో ఉండాలని ఈ గడ్డ నేర్పింది. 
– పులివెందుల సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కడప:
 ‘‘రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల్లో దహనకాండకు, హత్యలకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు తన మనుషులకు నిన్ననే ఆదేశాలు ఇచ్చాడట! ఆ నేరాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై నెట్టేద్దామని చెప్పాడట! వాళ్ల ఐదేళ్ల పరిపాలనను ప్రజలకు చూపించి ఓట్లు అడిగే సత్తా వాళ్లకు లేదు. వాళ్ల అబద్ధాలు, మోసాలతో ప్రజలు విసుగెత్తిపోయారన్న సంగతి వాళ్లకు తెలుసు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ఎన్నికలు జరగకుండా, కేవలం హత్యా రాజకీయాల మీద ఎన్నికలు జరగబోతున్నాయి’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఆయన శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, అందుకే కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం ఓట్లను చీల్చేందుకు రకరకాల జిత్తులు, ఎత్తులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. బహిరంగ సభ అనంతరం మధ్యాహ్నం 1.49 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. బహిరంగ సభలో ఆయన ఏం మాట్లాడారంటే... ‘‘చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పరిపాలన మనం చూశాం. ఇప్పుడు చివరి ఘట్టానికొచ్చాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మనం చూడని మోసం లేదు, అబద్ధం లేదు, అన్యాయం లేదు, దుర్మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రజలకు ఒక మాట చెబుతున్నా. మీ కష్టాలు నేను విన్నాను, మీకు నేనున్నాను. పంటలకు గిట్టుబాటు ధరల్లేని పరిస్థితి చూశాం. వ్యవసాయ రుణాలు మాఫీ కాక రైతులు అల్లాడిపోతున్న పరిస్థితిని కూడా చూశాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాలేదు. పంటలు ఎండిపోవడం చూశాం. బీమా రాక రైతులు ఎదుర్కొంటున్న బాధలు చూశాం.  

యువత ఆశలు ఆవిరైపోతున్నాయ్‌  
గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళల అగచాట్లను చూశాం. వారి రుణాలు మాఫీ కాలేదు. సున్నా వడ్డీకి రుణాల పథకం గాలికి ఎగిరిపోయింది. పసుపు–కుంకుమ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు చూశాం. యువతకు ఉద్యోగాలు లేవు. ఉపాధి కోసం వారు పక్క రాష్ట్రాలకు వలసబాట పట్టారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మిస్తారని, ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూసిన యువతను చూశాం. కళ్ల ఎదుటే ఆశలు ఆవిరైపోతున్న పరిస్థితి చూశాం. మీ అందరికీ భరోసా ఇచ్చేలా చెబుతున్నా. పులివెందుల అంటే మాకు ఎంతో ప్రేమ.  రాతి నేలలో సేద్యం చేయడం ఎలాగో ఈ గడ్డ మన అందరికీ నేర్పించింది. ఈ నేలలో నీటిని నింపితే బంగారాన్ని పండించవచ్చని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మనకు చేసి చూపించారు. పది మందికి సాయం చేయడం, మాటపై నిలబడడం, మాట కోసం ఎంతటి కష్టాన్నయినా ఓర్చుకోవడం మనకు తెలుసు.  

కల్మషమైన రాజకీయాల మధ్య ఉన్నాం...  
రాష్ట్రంలో ఇవాళ దారుణమైన కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు కల్మషమైన రాజకీయాల మధ్య మనం ఉన్నాం. అత్యంత సౌమ్యుడైన వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపించింది వాళ్లే. మళ్లీ బురద చల్లేదీ వాళ్లే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వారే హత్య చేయిస్తారు, వారి పోలీసులతోనే దర్యాప్తు జరిపిస్తారు. వాళ్లు ఏం చెబితే అదే దర్యాప్తులో తేలుతుంది. వాళ్ల జేబుల్లో ఉన్న పోలీసు అధికారులతో తప్పుడు దర్యాప్తు నివేదికలు ఇప్పిస్తారు. వాస్తవాలను వక్రీకరిస్తూ వాళ్లకు కావాల్సినట్టుగా రాసేది, చూపించేది వాళ్ల పత్రికలు, టీవీ చానళ్లే. వాళ్ల కుట్రలు, కట్టుకథలు చూస్తే రాజకీయాలు ఎంత దారుణంగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.  

టీడీపీకి డిపాజిట్లు గల్లంతే..  
ఎన్నికల్లో కడప జిల్లాలో నెగ్గలేమని వాళ్లు(టీడీపీ) నిర్ధారణకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారు. వాళ్ల ఐదేళ్ల పరిపాలనను ప్రజలకు చూపించి ఓట్లు అడిగే సత్తా వాళ్లకు లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలపై ఎన్నికలు జరగకుండా, కేవలం కడపలో హత్యా రాజకీయాల మీద ఎన్నికలు జరగబోతున్నాయి. చంద్రబాబు పన్నుతున్న కుట్రలను చూస్తే చాలా బాధ కలుగుతోంది.  

ఎన్నికలే మన లక్ష్యం కావాలి  
నాన్న చనిపోయినప్పుడు, కాంగ్రెస్‌ పార్టీతో నేను పోరాటం చేస్తున్నప్పుడు మీరంతా నాకు అండగా, తోడుగా నిలబడ్డారు. చంద్రబాబు ఎలాంటి అన్యాయాలు చేసినా, అన్యాయపు కేసులు పెట్టినా, అన్యాయపు అరెస్టులు చేసినా మీరంతా సంయమనం కోల్పోవద్దని కోరుతున్నా.  ఎన్నికలే మనకు లక్ష్యం కావాలి. ఎన్నికల్లోగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పెద్దపెద్ద నాయకులందరినీ అరెస్టు చేస్తారేమో. గ్రామాల్లో ఉండేది మీరు. మిమ్మల్నయితే ఎవరూ ఏమీ చేయలేరు. నేను మళ్లీ పులివెందులకు ప్రచారానికి రాకపోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా నేను తిరగాలి. జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రచారం మీరే నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందేమో. కడప జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ కదలిక రావాలి. రావణుడి పాలన వానరులతోనే అంతమైంది.  

పార్టనర్‌ సినిమాకు నిర్మాత చంద్రబాబే  
రాష్ట్రవ్యాప్తంగా కుట్రలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు తన వ్యూహంలో భాగంగా తన భాగస్వామితో(పార్టనర్‌) ప్రతిపక్షంలో ఉన్న మనపై తానే స్క్రిప్ట్‌ను చదివిస్తున్నాడు. ఆ పార్టనర్‌ ఎవరో మీకు తెలుసు కదా? ఒక సినిమా నటుడు. చంద్రబాబే స్క్రిప్ట్‌ రాస్తాడు, డైలాగ్‌లు కొట్టిస్తాడు. చంద్రబాబు ఎలా ఆదేశిస్తే ఆ పార్టనర్‌ అలాగే చేస్తాడు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ నటుడు తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాడు. పార్టనర్‌ సినిమాకు నిర్మాత చంద్రబాబే, డబ్బులు చంద్రబాబువే, డైలాగ్‌లు ఆయనవే, అభ్యర్థుల ఎంపిక కూడా ఆయనదే. బి–ఫామ్‌లు మాత్రమే తన పార్టనర్‌తో ఇప్పిస్తాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై జగన్‌ను ఇబ్బంది పెట్టినప్పుడు వారి(చంద్రబాబు–కాంగ్రెస్‌) ఆదేశాల ప్రకారం నడుచుకున్న సీబీఐ అధికారి ఎవరో మీకు తెలుసు.

ఆ అధికారిని భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని, టీడీపీ టిక్కెట్‌ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నాడు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఆ అధికారిని తన పార్టనర్‌ పార్టీలో చేర్పించాడు. అతడిని విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టించాడు. వీళ్లంతా కలిసి గొప్పగొప్ప డ్రామాలు ఆడుతున్నారు. నిన్న చంద్రబాబు పార్టనర్‌ నామినేషన్‌ వేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించాయి. ప్రతిపక్షం ఓట్లను చీల్చేందుకు ఒకటి రెండు డ్రామాలు కాదు, రకరకాల జిత్తులు, ఎత్తులు వేస్తున్నారు. మనకు ఇలాంటి డ్రామాలు ఆడాల్సిన పని లేదు. ఇలాంటి సినిమాలు తీయాల్సిన అవసరం మనకు లేదు. దేవుడిని నమ్ముతున్నా, నేను ప్రజలపైనే ఆధారపడ్డా. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నినా.. దేవుడి ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో రేపు వచ్చేది మన అందరి ప్రభుత్వమే.  

నవరత్నాల గురించి అందరికీ చెప్పండి  
రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి చంద్రబాబు విపరీతంగా డబ్బులు పంపిస్తాడు. ఆ డబ్బులకు మన నవరత్నాలే పోటీ కావాలి. మనం ప్రకటించిన నవరత్నాలతో ప్రతి రైతన్నకు, ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు ఒనగూరే ప్రయోజనాలను ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలోనూ అందరికీ తెలియజేయాలి.   

వైఎస్సార్‌ హయాంలోనే పులివెందుల అభివృద్ధి  
మంచితనానికి విరుద్ధంగా సాగుతున్న చంద్రబాబు నాయుడి కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు, అన్యాయాలను మనం చూస్తున్నాం. ఆయన అధికారం కోసం సొంత మామ ఎన్టీ రామారావుకే వెన్నుపోటు పొడిచాడు. అధికారం నుంచి దింపేసి, చంపేశాడు. తన నియోజకవర్గం కుప్పంలో ఏమీ చేయని చంద్రబాబు పులివెందులకు వచ్చి తానే అంతా చేశానని వితండవాదం చేశాడు. పులివెందులకు ఎవరు మేలు చేశారో ప్రజలే చెప్పాలి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇక్కడ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ వచ్చింది. ఆయన చలవతోనే ట్రిపుల్‌ ఐటీ వచ్చింది. అలాగే 6 లక్షల చదరపు అడుగుల్లో అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం వచ్చింది.

వైఎస్సార్‌ హయాంలోనే కడప నుంచి పులివెందులకు నాలుగు వరుసల రహదారి ఏర్పాటైంది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా గండి క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. పులివెందులలో రూ.2,800 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు, ప్రతి మండల కేంద్రంలో ఐటీఐ, ఇంటర్మీడియెట్‌ కాలేజీలు, పులివెందుల చుట్టూ రింగ్‌ రోడ్డు, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఎన్‌ఏసీ), పులివెందులలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, లింగాల మండలం నక్కలపల్లిలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్, ఫుడ్‌ టెక్నాలజీ కాలేజీ, సింహాద్రిపురంలో రూ.1,200 కోట్లతో పైడిపాలెం ప్రాజెక్టు, పీబీసీ బ్రాంచ్‌ కెనాల్‌ ఆధునికీకరణ, పులివెందుల–కదిరి మధ్య నూతన రహదారి, పులివెందుల–ముదిగుబ్బ–జమ్మలమడుగు మధ్య డబుల్‌ లేన్‌ రోడ్డు, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌.. ఇవన్నీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో వచ్చినవే.   

ప్రేమ ఉంటే పరిశ్రమలు ఎందుకు తేలేదు?  
పులివెందులపై తనకు ప్రేమ ఉందని చంద్రబాబు అంటారు, ఇక్కడికొచ్చి మోసం చేసే మాటలు మాట్లాడుతారు. పక్కనే 6 లక్షల చదరపు అడుగుల్లో పశు పరిశోధనా కేంద్రం ఉంది. చంద్రబాబు ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉంటూ అక్కడికి ఎందుకు పరిశ్రమలను తీసుకురాలేకపోయారు? ఆ స్థలాన్ని ఎందుకు వాడుకోలేదు? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎందుకు అడుగు ముందుకేయలేదు? మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. సర్వారాయ సాగర్, గండికోట, వామికొండ ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదు? చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లో కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఉంటే మూడేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తయి ఉండేది కాదా? 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి కాదా? అని అడుగుతున్నా.  

జగన్‌ కుటుంబ స్థిరాస్తులు రూ.66.89 కోట్లు
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తన కుటుంబం పేరిట రూ.66.89 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జగన్‌ పేరిట మార్కెట్‌ విలువ ప్రకారం రూ.35.30 కోట్ల విలువైన స్థిరాస్తి ఉండగా, భార్య భారతి పేరున రూ.31.59 కోట్ల ఆస్తులున్నట్లు చూపించారు. ఇదే సమయంలో వివిధ కంపెనీల షేర్లతో సహా అన్ని రకాల చరాస్తులను పరిగణనలోకి తీసుకుంటే రూ.443.46 కోట్లుగా లెక్క చూపించారు. ఇందులో జగన్‌ పేరున రూ.339.89 కోట్లు ఉండగా, భార్య భారతి పేరున రూ.92.53 కోట్లు, కుమార్తెలు హర్షిణిరెడ్డి పేరిట రూ.6.45 కోట్లు, వర్షారెడ్డి పేరిట రూ.4.59 కోట్లు ఉన్నట్లు చూపించారు. 2017–18 సంవత్సరానికి జగన్‌ వ్యక్తిగత ఆదాయం రూ.25.89 కోట్లు కాగా, భారతిరెడ్డి వ్యక్తిగత ఆదాయం 12.73 కోట్లుగా పేర్కొన్నారు.  

మా నాన్న కలలను నిజం చేస్తా 
వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ 
సాక్షి, అమరావతి: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు గన్న జలయజ్ఞాన్ని కచ్చితంగా పూర్తి చేస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిన బూనారు. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘‘మా నాన్న కలలను నిజం చేస్తాను. ఆయన కలలు గని, కాంక్షించిన విధంగా బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టుతో సహా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాను. ఇదే నా జలయజ్ఞ ప్రతిన, నా హామీ. నవరత్నాల్లో కూడా దీన్ని పొందుపరిచాం. అన్నీ పూర్తి చేయాలన్నదే నా సంకల్పం’’ అని ట్విట్టర్‌లో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement