విజయవాడ సిటీ: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన కూర్చుని ఓ దళితుడు పార్టీ అభ్యర్థులను ప్రకటించడాన్ని సీఎం చంద్రబాబునాయుడు జీర్ణించుకోలేక తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడని బాపట్ల వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ ధ్వజమెత్తారు. నీచ సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీలో దళితులకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో నందిగం సురేష్ విలేకరులతో మాట్లాడారు. అటూ ఇటూ నేరగాళ్లతో కలిసి వైఎస్ జగన్ అభ్యర్థులను ప్రకటించారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సురేష్ అభ్యంతరం తెలిపారు. సాధారణంగా పార్టీ అధ్యక్షులే.. అభ్యర్థులను ప్రకటిస్తారని, కానీ దేశానికి మార్గనిర్దేశం చేసేలా దళితుడైన తనతో అభ్యర్థులను ప్రకటించారని ఆనందం వ్యక్తం చేశారు. తనను రాష్ట్ర రాజధానిలో జరిగిన విధ్వంసంలో నిందితుడని, అరటి తోటలు తగలుబెట్టిన కేసులో తాను ఉన్నట్లు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సురేష్ తీవ్రంగా తప్పుపట్టారు. ఒకవేళ నిజంగా తాను అలా చేసి ఉంటే ఇన్నాళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘రాజధానిలో అరటి తోటలను తగులబెట్టించింది నీవు కాదా చంద్రబాబూ’ అని నిలదీశారు. ‘నీ మనవడిని తీసుకురా.. నా పిల్లల్ని నేను తీసుకొస్తా. ఏదైనా గుడికిగాని, చర్చికిగాని వెళ్లి అరటి తోటలు ఎవరు తగులబెట్టారో ప్రమాణం చేద్దాం’ అని సవాల్ విసిరారు.
రూ. 50 లక్షలు ఇస్తాం.. ఒప్పుకోమని బెదిరించలేదా?
రాజధాని భూముల కోసం పోరాటం చేస్తే.. అరటి తోటలు తగులబెట్టింది వైఎస్సార్‌సీపీ వాళ్లేనని చెప్పమంటూ పోలీసులు తనను తుపాకీతో బెదిరించారని నందిగం సురేష్ వెల్లడించారు. తనను భూజాలపై ఎగిరి తన్నారని గుర్తు చేశారు. వాళ్లు చెప్పినట్లు చేస్తే రూ. 50 లక్షలు ఇస్తామని బెదిరింపులకు దిగారని వివరించారు. ‘చంద్రబాబు వద్దకు తీసుకెళతాం. సీఎం నీకు ఏం కావాలంటే అది ఇస్తాడని ఆశపెట్టారు. వినకపోతే తీవ్రంగా ఒత్తిడి తేవడమే కాకుండా మానసికంగా కుంగదీయడానికి తన కుటుంబ సభ్యులను కూడా డీఎస్పీ నానా మాటలన్నారు. మాట వినకపోతే ఒక దశలో ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారు.’ అని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మంత్రి పుల్లారావుతో పాటు దళిత ఎమ్మెల్యే శ్రావణ్ కూడా తనను చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు పోలీసు స్టేషన్‌లో పెట్టి అరటి తోటలు తగులబెట్టించింది వైఎస్ జగనే అని చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. ఇంతగా వేధించినా తాను ఒప్పుకోకపోవడంతో చివరికి చేసేది లేక వదిలేశారని వివరించారు. అరటి తోటల విధ్వంసంపై విచారణ జరిపే దమ్ము చంద్రబాబుకు లేదని, ఎందుకంటే పంటలు తగులబెట్టింది ఆయనేనని రైతులందరికీ కూడా తెలుసునని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment