విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దాడి వీరభద్రరావు
అనకాపల్లిటౌన్: ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్ వైఫల్యాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్టు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తెలిపారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో వైఫల్యాలే కాకుండా అధికారపార్టీకి అనుకూలంగా పక్షపాత వైఖరితో నిరంకుశంగా కలెక్టర్ ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కలెక్టర్‌ను చంటీ అని ముద్దుగా పిలుస్తారని కూడా విస్తృతప్రచారం ఉందని, ఎన్నికల రోజు చాలా ఈవీఎంలు పని చేయకపోతే వాటిని వెంటనే మార్పు చేయడానికి వందశాతం ఈవీఎంలు అదనంగా అందుబాటులో ఉన్నప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వాటిని వినియోగించనివ్వకుండా ఉత్తర్వులు ఇచ్చారని ఆయన తెలిపారు. మరమ్మతులు చేసే వారు నియోజకవర్గానికి ముగ్గురు ఉన్నారని, వారు వచ్చేవరకు మార్చవద్దని ఆదేశాలు ఇచ్చి జిల్లాలో ఓటర్లను మూడు,నాలుగు గంటలపాటు క్యూలైన్‌లో నిలబడే పరిస్థితి కల్పించారని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న భావనతో వారికి పోస్టల్ బ్యాలెట్‌పేపర్లు అందకుండా అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు.
జిల్లాలో సుమారు 33 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పనిచేయగా అందులో పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్లు 27,168 మందికి పంపామని చెప్పారని ఆయన తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ బ్యాలెట్లను 28,451 మందికి పంపామని ప్రకటించారన్నారు. ఈ విధంగా రెండు కలిపి సుమారు 10 వేల మందికి బ్యాలెట్‌పేపర్లు పంపకపోవడం వల్ల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఆయన తెలిపారు. గతంలో జమిలి ఎన్నికలు జరిగినప్పుడు శాసనసభల రిటర్నింగ్ అధికారులే అసెంబ్లీ, పార్లమెంట్‌లో పోస్టల్ బ్యాలెట్లను ఒకసారే కవర్‌లో పెట్టి పంపేవారని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు పరుస్తున్నారన్నారు. మన జిల్లాలో రెండింటినీ విడదీసి పార్లమెంట్ ఓట్లను కలెక్టర్ కార్యాలయం నుంచి పంపడానికి నిర్ణయించారని తెలిపారు. అధికారులు ప్రకటించిన ప్రకారం కూడా ఓటర్లకు పూర్తిస్థాయిలో బ్యాలెట్లు అందలేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోరే ఉద్యోగుల ఫారం 12 దరఖాస్తులను పోలింగ్ ముందురోజు వరకు ఇవ్వవచ్చు కానీ, కలెక్టర్ పోలింగ్‌కు నాలుగురోజుల ముందు 7వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులను తీసుకున్నారని తెలిపారు.
మార్చి 31వతేదీన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పత్రాను పంపి, వాటిని ఏప్రిల్ 5లోపు అందజేమని ఆదేశించారని చెప్పారు. మరికొంతమందికి ఏప్రిల్ 5వతేదీన పోస్టల్‌బ్యాలెట్లు ఇచ్చి, 10వతేదీలోపు అందజేయాలని ఆదేశించారని ఆయన తెలిపారుజిల్లాలో ఉద్యోగులకు కావాలనే ఓటు హక్కు లేకుండా జిల్లా కలెక్టర్ చేశారని ఆరోపించారు. నింపిన బ్యాలెట్ పేపర్లను రిటర్నింగ్ అధికారులకు ఇవ్వకుండా పోస్టులో పంపాలని నిబంధన పెట్టినందువల్ల కౌంటింగ్ నాటికి కూడా పోస్టల్ బ్యాలెట్లు అందని పరిస్థితులు ఏర్పడతాయన్నారు. వీవీ ప్యాట్ వెయ్యి స్లిప్‌లు మాత్రమే పడతాయి. అది తెలిసి కూడా 1400 వరకు ఓటర్లను బూత్‌లకు కూడా ఒక్కొక్క ఈవీఎంను కేటాయించినట్టు ఆయన తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అవే ఈవీఎంలు కౌంట్ చేస్తే 10 స్లిప్‌లు మాత్రమే వచ్చి, మిగిలిన 400 స్లిప్‌లు కనిపించవన్నారు. ఈ సమస్యను అధికారులు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల రోజు ఈవీఎంల్లో మాక్ పోలింగ్ చేసిన పిదప వాటిని క్లోజ్ చేయాలి. అలా చేయకపోతే నిజమైన పోలింగ్ మాక్ పోలింగ్ వల్ల వచ్చిన సంఖ్యకు తేడా వస్తే దాన్ని ఎలా పరిష్కరిస్తారన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున జిల్లా అభ్యర్థులు నాలుగుపర్యాయాలు కలెక్టర్‌కు సమస్యలు చెప్పినప్పటిìకీ పట్టించుకోలేదని ఆరోపించారు. అడిగిన సమాచారం ఇవ్వరు, పైగా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు రాజ్యాంగ ప్రకారం ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించమంటే కలెక్టర్ రాజ్యాంగాన్ని అవహేళన చేశారని, దురదృష్టవశాత్తు రాజ్యాంగంలో ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చలేదని రాజ్యాంగ నిర్మాతను చులకనగా మాట్లాడారన్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసే కలెక్టర్ ఈ ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరుపుతారన్న నమ్మకం మాకు లేదన్నారు. సీనియర్ కేంద్ర అధికారులను ప్రత్యేక అబ్జర్వర్లుగా పంపి కౌంటింగ్ బాధ్యతలు అప్పగించాల్సిందిగా ఆయన కోరినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment