కొయ్యూరు: కరెంటు సరఫరా నిలిచిపోవటంతో తాగేందుకు నీరు కూడా కరువైందంటూ విశాఖ జిల్లా కొయ్యూరు మండల వాసులు రోడ్డెక్కారు. కాకరపాడు, కొయ్యూరు, మర్రివాడ, రాజేంద్రపాలెం, ఎం.మాకవరం తదితర గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది మంగళవారం మండల కేంద్రానికి తరలివచ్చారు. ప్రధానసెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
ఏజెన్సీ ప్రాంతమైన కొయ్యూరు మండలంలోని 100 గ్రామాల్లో నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆందోళన కారులు చెప్పారు. మంచినీటి పథకాలు పనిచేయక పోవటంతో తాగేందుకు చుక్కనీరు కూడా దొరకటం లేదని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ సమస్య విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో చివరి ప్రయత్నంగా ఆందోళనకు దిగామన్నారు. అధికారులు వెంటనే స్పందించి కరెంటు సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.