విద్యుత్ శాఖలో రాజకీయ అలజడి | political leaders hawa in electricity department | Sakshi
Sakshi News home page

విద్యుత్ శాఖలో రాజకీయ అలజడి

Published Fri, Sep 12 2014 12:53 AM | Last Updated on Sat, Sep 15 2018 8:15 PM

విద్యుత్ శాఖలో రాజకీయ అలజడి - Sakshi

విద్యుత్ శాఖలో రాజకీయ అలజడి

సాక్షి, ఏలూరు : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో బదిలీల రాజకీయం తారస్థాయికి చేరుతోంది. రాజకీయ నేతలు రేపుతున్న అలజడితో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ పోస్టుపై ఉత్కంఠ వీడకపోగా, తాజాగా ఏలూరు, నిడదవోలు డీఈ పోస్టుల విషయంలోనూ రాజకీయ జోక్యం మొదలైంది. ఈ రెండు స్థానాలను దక్కించుకోవడానికి కొందరు ఉద్యోగులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.
 
నిడదవోలు డీఈగా ప్రస్తుతం వీఎస్ మూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. రాజమండ్రి సర్కిల్ నుంచి కొన్ని నెలల క్రితమే ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పుడు అదే సర్కిల్‌లో డీఈ స్థాయి అధికారిజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా నిడదవోలు డీఈగా వచ్చేందుకు సిఫార్సు చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఏలూరు డీఈ బి.వేదమూర్తి స్థానానికి వచ్చేందుకు ఒక ఏడీఈ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పదోన్నతులు ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ డీఈ పోస్టు కోసం ఏడీఈ ప్రయత్నాలు చేస్తుండటం విద్యుత్ ఉద్యోగులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎస్‌ఈ, డీఈ పోస్టులకే కాదు ఏడీఈ పోస్టులకూ పైరవీలు జోరుగా సాగుతున్నాయి. తణుకు ఏడీఈ పోస్టుకు గట్టిపోటీ ఏర్పడింది. ఏలూరు సర్కిల్ కార్యాలయం, చింతల పూడి డివిజన్లకు చెందిన ఏడీఈలు తణుకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
 
నేడు, రేపు జిల్లాలో  సీఎండీ పర్యటన
ఈ పరిస్థితుల్లో శుక్ర, శనివారాల్లో సంస్థ సీఎండీ మిరియాల వెంకట శేషగిరిబాబు జిల్లా పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం నిడదవోలు డివిజన్‌లోను, శనివారం భీమవరం డివిజన్‌లోను సీఎండీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో సమావేశం అవుతారు. పలు సెక్షన్ కార్యాలయాలను కూడా తనిఖీ చేస్తారు. ఉద్యోగుల బదిలీపై నెలకొన్న ఉత్కంఠకు సీఎండీ తెరదించుతారా, లేదా .. రాజకీయ పైరవీలపై ఆయన నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనే విషయమై విద్యుత్ శాఖ సిబ్బంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement