జిల్లాలో 356 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
వీటిలో 45 జేఏ, 310 జేఎల్‌ఎం, 1 వాచ్‌మేన్ పోస్టులు
కాంట్రాక్టు సిబ్బందికి గరిష్టంగా 20 గ్రేస్ మార్కులు
సాక్షి, ఏలూరు :
తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో 45 జూనియర్ అసిస్టెంట్ (జేఏ), 310 జూనియర్ లైన్‌మేన్ (జేఎల్‌ఎం), 1 వాచ్‌మేన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలి. సబ్‌స్టేషన్లు, కార్యాలయాల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 600 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో కొందరికికొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాధాన్యత లభించనుంది. వారి పనితీరు ఆధారంగా గరిష్టంగా 20 గ్రేస్ మార్కులు ఇవ్వనున్నారు.
500 కనెక్షన్లకు ఒక్క ఉద్యోగి మాత్రమే
జిల్లాలో సుమారు 11 లక్షల విద్యు త్ కనెక్షన్ల ఉండగా, 2వేల మంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. సుమారు వెయ్యి కనెక్షన్లకు ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్టు. అయితే ఈ సంఖ్య నాలుగు ఉండాలి. 1999లో రాష్ట్ర విద్యుత్ మండలి పునర్ వ్యవస్థీకరణ తరువాత సబ్‌స్టేషన్లు రెండున్నర రెట్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఐదున్నర రెట్లు, ఆదాయం నాలుగున్నర రెట్లు పెరిగాయి. వినియోగదారులు 127 శాతం పెరిగారు. ఉద్యోగుల సంఖ్యలో 59 శాతం తరుగుదల కనిపిస్తోంది. సిబ్బంది కొరతను ఆసరాగా తీసుకుని నిత్యం చేయాల్సిన పనులను కూడా యాజమాన్యం కాంట్రాక్టుకు ఇచ్చేస్తోంది. దీనికి అవుట్ సోర్సింగ్ పద్ధతిని జోడించారు.
కాంట్రాక్టు సిబ్బంది శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. చట్టప్రకారం సిబ్బందికి ప్రయోజనాలేవీ అందడం లేదు. సిబ్బంది కొరతతో పని భారం పెరిగి అటు రెగ్యులర్, ఇటు కాంట్రాక్టు ఉద్యోగులు సతమతమవుతున్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, విద్యుత్ కనెక్షన్లకు అనుగుణంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో విద్యుత్ ఉద్యోగుల యూనియన్లు సంస్థపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈపీడీసీఎల్ నిర్ణయించింది.
విద్యుత్ శాఖలో కొలువుల జాతర
Published Sun, Mar 2 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
Advertisement
Advertisement