వివాదాస్పద జీవో 283తో పదోన్నతులకు రంగం సిద్ధం
జీవోలోని ‘ఇనిషియల్ గెజిటెడ్ ర్యాంక్’ పాయింట్ తప్పుదారి
ప్రిన్సిపల్ సీనియారిటీ లేకున్నా డీవీఈవోలుగా పదోన్నతులిచ్చే యత్నం
సీనియర్ ప్రిన్సిపల్స్‌కు అన్యాయం జరుగుతోందని ఆందోళన
సాక్షి, అమరావతి: ఏదైనా ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఉద్యోగికి పదోన్నతి ఇస్తే సినియర్ అసిస్టెంట్ అవుతారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి సెక్షన్ సూపరింటెండెంట్ అవుతారు. కానీ ఇంటర్మీడియట్ విద్యా మండలి(Board of Intermediate Education)లో జూనియర్ అసిస్టెంట్ నుంచి నేరుగా సూపరింటిండెంట్‌గా పదోన్నతి ఇచ్చేస్తారు. ఇదేలా సాధ్యమంటారా? ఇది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఏదైనా సాధ్యమే. ఇంటర్మీడియట్ విద్యా మండలిలో కొందరు జూనియర్ లెక్చరర్లకు ఏకంగా జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (డీవీఈవో)లుగా పదోన్నతులిచ్చేందకు రంగం సిద్ధమైంది.
వాస్తవానికి జూనియర్ లెక్చరర్ల (జేఎల్)కు సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి ఇస్తారు. ప్రిన్సిపల్స్‌కు డీవీఈవోగా పదోన్నతి ఇస్తారు. కానీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో ఇచ్చిన వివాదాస్పద జీవో నం.283లోని ‘ఇనిషియల్ గెజిటెడ్ ర్యాంక్’ పాయింట్‌కు కొత్త భాష్యం చెబుతూ కొందరు జేఎల్‌లకు డీవీఈవోలుగా నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆ జీవో ఇచ్చిన సందర్భం, పదోన్నతుల నిబంధనలతో సంబంధం లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ బోర్డు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. మరోపక్క ప్రస్తుతం పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రిన్సిపల్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
లేని పోస్టుల కోసం ఇచ్చిన జీవోతో లబ్ధి చేసేలా..
ఇంటర్ విద్యా శాఖలో ఒకేషనల్ కోర్సుల పర్యవేక్షణకు 2002–03లో జేఎల్‌తో సమానమైన కేడర్‌తో డిప్యూటీ డీవీఈవో (డీవైడీవీఈవో) పోస్టులు భర్తీ చేశారు. డీవీఈవోలుగా జేఎల్‌లకు పదోన్నతి కల్పించాలని ఉమ్మడి రాష్ట్రంలో 2008లో జీవో 283ని నాటి ప్రభుత్వం జారీ చేసింది. ఇలా జేఎల్‌లను నేరుగా జిల్లా అధికారులుగా నియమించడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ జీవో అమలును నిలిపివేసింది.
2012లో డీవైడీవీఈవోలకు పదోన్నతులిచ్చినా, ఈ జీవోను కాకుండా ప్రిన్సిపల్ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత డిప్యూటీ డీవీఈవో పోస్టులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఈ కేడర్‌లో ఎవరూ పనిచేయడం లేదు. 16 ఏళ్లుగా అమలు కాని ఈ జీవోను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేలా ముందుకు తెచ్చింది.
జీవోలో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకొని ప్రస్తుతం తక్కువ సర్వీసు ఉన్న ప్రిన్సిపల్స్ కోర్టుకెళ్లి జీవోను అమలు చేయాలని ఇంటర్ విద్యా కమిషనర్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ జీవో అమలైతే ఎన్నో ఏళ్లుగా ప్రిన్సిపల్స్‌గా పనిచేస్తున్న వారికి తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముంది.
ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా జేఎల్స్ అయినవారు, టీచర్లు, ఇతర కేడర్ల నుంచి జేఎల్స్‌గా పదోన్నతులు పొందిన వారి మధ్య ఇప్పటికే సీనియారిటీ వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు వివాదాస్పద జీవోను తెరపైకి తెచ్చి ప్రభుత్వం మరో కొత్త సమస్య తెచ్చిపెడుతోంది.
జీవో 283ఏం చెబుతోంది?
మూడేళ్ల సర్వీసు ఉన్న ప్రిన్సిపల్స్‌కు, మూడేళ్ల సర్వీసు ఉన్న డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు కలిపి కామన్ సీనియారిటీ చేసేటప్పుడు వారి ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరి యూనిట్ సీనియారిటీ దెబ్బతినకుండా చూడాలి. కానీ ప్రస్తుతం డిప్యూటీ డీవీఈవో కేడర్‌లో లబ్దిదారులు లేకపోవడంతో ఈ జీవోను అమలు చేయాల్సిన అవసరం లేదన్నది సీనియర్ ప్రిన్సిపల్స్ వాదన.
ఈ రెండు కేడర్లలో అర్హులైన వారు ఉంటేనే జీవోను అమలు చేయాలి. ఒక కేడర్‌లో పనిచేసే లబ్దిదారులు లేకుండా ఉమ్మడి సీనియారిటీ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ విద్యా శాఖలో రూల్ 34, జీవో 283ని కొందరి స్వార్థం కోసం ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చెబుతున్నారు.
సీనియర్ ప్రిన్సిపల్స్‌కు అన్యాయం
సర్వీసు నిబంధనల ప్రకారం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కావాలంటే జేఎల్స్ గెజిటెడ్ ఆఫీసర్ టెస్ట్ (జీవోటీ), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్ (ఈవోటీ) పాసవ్వాలి. డీవీఈవోలుగా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా ప్రిన్సిపల్ అయ్యుండాలి. అంటే జూనియర్ లెక్చరర్లలో సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా ఎవరైతే జీవోటీ, ఈవోటీ పాసవుతారో వారే ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి పొందుతారు.
జీవో 283లో పేర్కొన్న ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ అనేది కేవలం డిప్యూటీ డీవీఈవోలు, ప్రిన్సిపల్స్‌కు మాత్రమే ఉద్దేశించింది. కానీ ఈ అంశాన్ని ఇప్పుడు జేఎల్‌గా సర్వీసులో చేరినప్పటి నుంచి సీనియారిటీని లెక్కించాలని కొందరు కొత్త భాష్యం చెబుతూ ప్రస్తుతం డీవీఈవోల పదోన్నతులకు దీనినే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల అన్ని టెస్టులు పాసై, అర్హతలు సాధించిన సీనియర్ ప్రిన్సిపల్స్ డీవీఈవోలుగా పదోన్నతి పొందే అవకాశం కోల్పోతున్నారు.
జూనియర్ ప్రిన్సిపల్స్ లబ్ధి పొందుతున్నారని సీనియర్లు వాపోతున్నారు. హైకోర్టు సైతం యూనిట్ సీనియారిటీకి నష్టం జరగకుండా పదోన్నతులివ్వాలని చెప్పినా ఇనిషియల్ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఇదే జరిగితే తాము పూర్తిగా పదోన్నతులకు దూరమవుతామని ప్రిన్సిపల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment