Board of Intermediate Education
-
ఇంటర్ ఫలితాలు.. అమ్మాయిలదే హవా
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మార్చి ఒకటి నుంచి 20 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు బాలికలు, బాలురు కలిపి మొత్తం 10,02,150 మంది హాజరవగా 6,63,584 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,29,528 మంది (78 శాతం), మొదటి సంవత్సరం విద్యార్థులు 3,34,056 మంది (67 శాతం) ఉన్నారు. ఈ మేరకు ఫలితాలను శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్మీడియెట్ విద్యా మండలిలో కమిషనర్, కార్యదర్శి సౌరభ్ గౌర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వీవీ సుబ్బారావు సంయుక్తంగా విడుదల చేశారు. పరీక్షలు ముగిశాక కేవలం 21 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. కాగా ఎప్పటిలాగే బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 81 శాతం, మొదటి ఏడాదిలో 71 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురు రెండో ఏడాది 75 శాతం, మొదటి సంవత్సరంలో 64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2023 మార్చిలో ఇంటర్ మొదటి ఏడాది 4.33 లక్షల మంది పరీక్ష రాయగా 61 శాతం, ద్వితీయ సంవత్సరం 3.80 లక్షల మంది రాయగా 72 శాతం మంది పాసయ్యారు. మొత్తం మీద గతేడాది కంటే ఈసారి 6 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. ఫలితాల్లో జిల్లాల వారీగా కృష్ణా మొదటి స్థానంలో (మొదటి సంవత్సరం 84 శాతం, ద్వితీయ సంవత్సరం 90 శాతం) సాధించగా, చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు (ఇంటర్ మొదటి ఏడాది), చిత్తూరు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. ఫలితాలను https://resultsbie.ap.gov.in లేదా www. sakshieducation.comÌ లో చూడవచ్చు. ఒకేషనల్‌లోనూ బాలికలదే పైచేయి.. ఒకేషనల్ విభాగంలోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి ఏడాది 70 శాతం, రెండో ఏడాది 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు మొదటి ఏడాది 47 శాతం, రెండో ఏడాది 59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఒకేషనల్ విభాగంలో బాలికలు, బాలురు కలిపి మొదటి సంవత్సరం మొత్తం 38,483 మంది పరీక్షలకు హాజరు కాగా 23,181 మంది (60 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 32,339 మంది హాజరవగా 23 వేల మంది (71 శాతం) విజయం సాధించారు. ఒకేషనల్ విభాగంలో మొదటి, రెండో ఏడాది ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి ఏడాది 77 శాతం, రెండో ఏడాది 83 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. చివరి స్థానంలో వైఎస్సార్ (మొదటి ఏడాది), పల్నాడు (రెండో ఏడాది) జిల్లాలు నిలిచాయి. 24 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని కార్యదర్శి సౌరభ్ గౌర్ కోరారు. ఈ నెల 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. మార్కుల లిస్టులు డిజిలాకర్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇవి రెగ్యులర్ పత్రాలుగానే చెల్లుబాటవుతాయన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా ఉండాలి ఉత్తీర్ణులు కానివారు ఆందోళన చెందొద్దని సౌరభ్ గౌర్ సూచించారు. గతంలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాసైనవారికి ‘కంపార్ట్మెంటల్’ అని సరి్టఫికెట్‌పై వచ్చేదని, ఇప్పుడు దాన్ని రద్దు చేశామన్నారు. ఇకపై సప్లిమెంటరీ కూడా రెగ్యులర్‌తో సమానంగానే ఉంటుందన్నారు. ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు మనోధైర్యాన్ని అందించాలని సూచించారు. బైపీసీలో విశాఖ అమ్మాయి పావనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా గాజువాక చైతన్య కళాశాల విద్యార్థి శరగడం పావని సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 991 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకును దక్కించుకుంది. పావని తండ్రి నాగగంగారావు గంగవరం పోర్టులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని పావని తెలిపింది. కిరణ్మయికి స్టేట్ సెకండ్ ర్యాంక్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ఆలూరి కిరణ్మయి సీనియర్ ఇంటర్ బైపీసీలో 1000కి 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. కిరణ్మయి విజయవాడలోని శ్రీ గోసలైట్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది. కిరణ్మయి తండ్రి ఏవీ గిరిబాబు సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, తల్లి విజయశాంతి గృహిణి. ఎంబీబీఎస్ చదివి న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన చిరకాల కోరిక అని కిరణ్మయి వెల్లడించింది. -
ఇంటర్ పరీక్షల నిర్వహణకు కసరత్తు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు బోర్డు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఆలస్య రుసుంతో సహా ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. నామినల్ రోల్స్‌లో తప్పులు సరిదిద్దుకునే గడువు కూడా శనివారంతో పూర్తయ్యింది. బోర్డు పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పేపర్ల మోడరైజేషన్(సెట్టింగ్), పరీక్ష కేంద్రాల ఎంపిక పూర్తి కావడంతో ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టారు. 2023–24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 10,07,097 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. వీరిలో మొదటి ఏడాది 5,29,015 మంది, రెండో ఏడాది 4,75,744 మంది విద్యార్థులున్నారు. గతేడాది పలు సబ్జెక్టులలో ఫెయిలైన 1.48 లక్షల మందిలో దాదాపు 90 వేల మంది వరకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్’ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మరో 53 వేల మంది పరీక్షలకు ఫీజు చెల్లించారు. కాగా, నామినల్ రోల్స్‌లో విద్యార్థుల పేర్లు, తల్లి/తండ్రి పేర్లు, పుట్టిన తేదీ, కులం తదితరాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. శనివారంతో ఈ గడువు కూడా ముగిసింది. ఇంకా తప్పులు సరిదిద్దకుండా నిర్లక్ష్యం వహించిన కాలేజీల ప్రిన్సిపల్స్‌ను బాధ్యులను చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యపై స్పష్టత రావడంతో ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ అధికారులు.. పరీక్షా కేంద్రాలపై దృష్టి పెట్టారు. గతంలో ప్రాంతీయ పరిశీలన అధికారులు(ఆర్ఐఓ) తమ రీజియన్ పరిధిలో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసేవారు. ఈ విద్యా సంవత్సరం ఈ బాధ్యతను ఇంటర్మీడియట్ విద్యామండలి పర్యవేక్షిస్తోంది. అనుమతుల కోసం వచ్చిన వాటిలో అన్ని అర్హతలున్న 1,489 జూనియర్ కాలేజీలను కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంపిక చేసింది. రీజనల్ అధికారులు, జిల్లా విద్యా శాఖ అధికారులు ఆయా కేంద్రాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి, నివేదిక సమర్పిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలతో నిఘా, తగినంతగా తాగునీటి వనరులు, టాయిలెట్లు తదితరాలను తప్పనిసరి చేశారు. -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈసారికి అంతా పాస్
ధైర్యం కోల్పోవద్దు.. పరీక్షలు ఫెయిలైన విద్యార్థులు ధైర్యంగా మళ్లీ పరీక్షకు సిద్ధం కావాలే తప్ప పాస్ చేయాలని ఒత్తిడి తేవడం, ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదు. విద్యార్థి జీవితంలో ఇంటర్ కీలకమైన దశ. దీన్ని కూడా రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు తగదు. ఆన్లైన్ పాఠాలు చెప్పాం కరోనా కాలంలోనూ ఆన్లైన్ విద్యను అందుబాటులోకి తెచ్చాం. దూరదర్శన్, టీశాట్ ద్వారా పాఠాలు చెప్పాం. ఇంటర్ విద్య బలోపేతం ప్రభుత్వ లక్ష్యం. అందుకే 620 గురుకులాలు, 172 కస్తూర్బా కళాశాలలతోపాటు సంక్షేమ పాఠశాలలను ఇంటర్ స్థాయికి పెంచాం. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం. 10 వేల మందికి 95% మార్కులు.. విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు పెట్టాం. ప్రభుత్వ కాలేజీల్లోనే తక్కువ ఫలితాలొచ్చాయనడం సరికాదు. ఆన్లైన్ విద్యపై నిందలేయడం సముచితం కాదు. 10 వేల మంది 95 శాతం మార్కులు తెచ్చుకున్నారు. – మంత్రి సబిత ఇకపై కుదరదు ఇప్పుడే చెబుతున్నాం. ఇక మీదట ఇలా పాస్ చేయడం కుదరదు. ఇప్పట్నుంచే విద్యార్థులు అందరూ కష్టపడి చదవండి. మంచి మార్కులు తెచ్చుకోండి. సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిల్ కావడంపై తలెత్తిన వివాదానికి తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనివల్ల 2,35,230 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంత్రి సబిత అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికీ ఉంది. అందుకే గ్రేస్ మార్కులపై సమీక్షించాం. ఫెయిల్ అయింది 2.35 లక్షల మంది. 10 మార్కులు కలిపినా 8,076 మందే పాసయ్యేలా ఉన్నారు. 15 కలిపితే 24 వేలు, 20 కలిపితే 58 వేలు, 25 కలిపితే 72 వేలు, 30 మార్కులు కలిపితే 83 వేల మంది పాసవుతారు. అయినా పెద్ద సంఖ్యలో పాసయ్యే అవకాశం లేదు. అందుకే ఉత్తీర్ణతకు కనీస మార్కులైన 35ను ఫెయిలైన వారందరికీ ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపారు. విద్యార్థుల మనోవేదనను గుర్తించే పాస్ చేస్తున్నామని, ఇదే వ్యాకులతతో ఉంటే సెకండియర్ దెబ్బతింటుందని భావించి పాస్ చేశామని సబిత చెప్పా. అంతే తప్ప ఎవరో ఆందోళనలు చేశారని మాత్రం కాదన్నారు. వద్దనుకుంటే సొమ్ము వెనక్కి..: రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వాటిని వద్దనుకుంటే చెల్లించిన సొమ్మును తిరిగిస్తామని మంత్రి సబిత చెప్పారు. ఒకవేళ కావాలనుకుంటే ఎవరైనా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చని, అప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వబోమన్నారు. విద్యార్థులు తమ ఐచ్ఛికాన్ని ఇంటర్ బోర్డుకు తెలియజేయవచ్చన్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు లేకుండా అందరినీ పాస్ చేశామని, ఇంటర్ సెకండియర్‌లో విద్యార్థులు వారి సామర్థ్యాలను మెరుగుపరుచుకొనేందుకే ఫస్టియర్ పరీక్షలు పెట్టామని సబిత తెలిపారు. కానీ 51 శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవడం విచారకరమన్నారు. దీన్ని అడ్డుపెట్టుకొని కొన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు స్వార్థ ప్రయోజనాలకు ఆందోళనలు చేపట్టడం న్యాయం కాదన్నారు. విలేకరుల సమావేశంలో ఇంటర్ విద్య అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. -
‘ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్ష హాల్లోకి అనుమతి’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా ఇంటర్ బోర్డు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేవిధంగా క్షేత్రస్థాయిలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. చివరి నిమిషంలో కళాశాల యాజమాన్యాలు వేధించకుండా, హాల్ టికెట్ జాప్యం చేయకుండా, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే విధానాన్నిఇంటర్ బోర్డు తీసుకొచ్చిందన్నారు. ఇంటర్ పరీక్షలకు 10.65 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అరగంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు, హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. దీంతో గతంలో ఫీజులు చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేసే యాజమాన్యాలు తీరుకు చెక్ పెట్టనున్నారు. క్యూఆర్ కోడ్‌తో హాల్ టికెట్స్ నేరుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉందని, ‘యువర్ సీట్’ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలు, ఇంటర్ బోర్డ్ తొలిసారిగా పరీక్షలు రాసే గది వివరాలు తెలిపే విధానాన్ని ప్రవేశ పెట్టిందని, ఈ రోజు(మంగళవారం) రాత్రి 8 గంటలు నుంచి "నో యువర్ సీట్" సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1411 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. టోల్ ఫ్రీ నంబర్ 0866 2974130, 18002749868 వాట్సాప్ నంబర్ 9391282578 ఏర్పాటు చేశారు. -
ఇంటర్ అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట
సాక్షి, కడప: సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందులో భాగంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. వీటితోపాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధనలను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం తాజాగా ఇంటర్ విద్యపై దృస్టిని సారించారు. అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేశారు. విద్యార్థులే నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించే వెసులుబాటును అందుబాటులోకి తీసుకురావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట లభించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ అడ్డగోలు ఫీజుల బాదుడు నుంచి ప్రభుత్వం ఊరట కలిగించింది. ఇంటర్‌బోర్డు నిర్ణయించిన ఫీజుకంటే కొన్ని కళాశాలల యాజమాన్యం ఎక్కువగా కట్టించుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. పరీక్షల సమయంలో అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తుండటంతో విద్యార్థులు కిమ్మనకుండా కట్టుకుంటూ వచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ ఫీజుల నియంత్రణపై ప్రత్యేక దృష్టిని సారిచింది. అడ్డుగోలుగా వసూలు చేస్తున్న ఫీజలకు అడ్డుకట్ట వేసింది. ఇంటర్ విద్యార్థుల నుంచి ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని ఎయిడెడ్ కళాశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన పీజు కంటే అదనంగా వసూలు చేస్తువచ్చాయి. మరి కొన్ని కళాశాలల్లో పరీక్ష సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని భరోసా ఇచ్చి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటికి ప్రభుత్వం కల్లేం వేసేందుకు ప్రస్తుత విద్యా సంవతసరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆదనపు ఫీజుల మోత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఫీజుల విషయంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. నేరుగా ఫీజు చెల్లించవచ్చు: ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఇప్పటి వరకు ఆయా కళాశాలల యజమాన్యాలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ వచ్చాయి. ఇక నుంచి ఆ విధానానికి చెక్ పెడుతూ ఇంటర్ విద్యామండలి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. హెచ్‌టీటీపీ://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ లో నేరుగా విద్యార్థులు ఫీజు వివరాలను చెల్లించే వెసులుబాటు కలి్పంచింది. గతంలో మాదిరిగా విద్యార్థులే నేరుగా కళాశాల ప్రిన్సిపాల్ లాగిన్‌లో లేదా విద్యార్థులు ఫీజుకట్టే అవకాశం ఇచ్చింది. ఫీజును చెల్లించే విధానం ఇలా... ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లో పే ఎగ్జాబిమినేషన్ ఫీ అనే దానిపై విద్యార్థులు ముందుగా క్లిక్ చేయాలి. విద్యార్థి ఆధార్ నంబర్‌ను, యూజర్‌ఐడీగా నమోదు చేసి ఫర్గెట్ పాస్వర్డును క్లీక్ చేయాలి. విద్యార్థి సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ అయి ఫీజు చెల్లించవచ్చు. అండ్రాయిడ్ మొబైల్ ద్వారా,లేదా నెట్ పాయింట్‌కు వెళ్లి అయినా ఫీజును చెల్లించవచ్చు ఫీజుల వివరాలు ఇలా.. జనరల్ ఫస్ట్ ఇయర్ రూ. 490 ఒకేషన్ ఫస్ట్ ఇయర్ రూ. 680 జనరల్ సెకండ్ ఇయర్ రూ. 680 జనరల్ సెకండ్ ఇయర్ రూ.490 ఒకేషన్ సెంకడ్ ఇయర్ రూ.680 అదనంగా వసూలు చేస్తే చర్యలు... ఇంటర్ బోర్డు నిర్ణయించిన విధంగా విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేయాలి. ఎక్కడైనా అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవు. కొన్ని చోట్ల ఇంటర్‌బోర్డు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు సమాచారం వస్తోంది. అలాంటి కళాశాలలపై విచారణ జరిపి నిజమని తెలిస్తే చర్యలు ఉంటాయి. బోర్డు నిర్ణయించిన దానికంటే అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు ఎవరైనా తమ దృíష్టికి తెస్తే చర్యలు తప్పవు. – నాగన్న, ఆర్ఐవో, ఇంటర్‌బోర్డు జిల్లాలో మొత్తం జూనియర్ కళాశాలలు 184 ప్రభుత్వ జూనియర్ కళాశాలు 27 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు 20 సాంఘిక సంక్షేమ కళాశాలలు 17 కస్తూర్బా కళాశాలలు 10 ఒకేషనల్ కళాశాలలు 09 ఇన్సెంటివ్, మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే బ్యాక్వర్డు క్లాస్ వెల్ఫేర్ కళాశాలలు 02 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 88 ఫస్టియర్ విద్యార్థులు 24,658 సెకండియర్ విద్యార్థులు 22,331 మొత్తం విద్యార్థులు 46,989 -
‘ప్రైవేట్’ ఆగడాలకు చెక్
మే 31కి ముందే జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రతి ఏటా కాలేజీల్లో ప్రవేశాలు పూర్తయ్యాక ఆయా కాలేజీల అనుబంధ గుర్తింపునకు బోర్డు చర్యలు చేపడుతోంది. వీటిలో లోపాలున్నా.. మధ్యలో కాలేజీ మూసేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్న సాకుతో కాలేజీలు తమ ఆగడాలను కొనసాగించాయి. ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మే 31లోగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. గుర్తింపు లభించిన కాలేజీల్లోనే జూన్ 1 నుంచి ప్రవేశాలు చేపట్టనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ వెల్లడించారు. అలాగే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, లభించని కాలేజీల జాబితాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. అనుబంధ గుర్తింపు కోసం ఆన్లైన్ దరఖాస్తులు, ఆన్లైన్లోనే అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈసారికి మాత్రం షరతులతో అనుబంధ గుర్తింపు.. రాష్ట్రంలో 1,642 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిల్లో 1056 కాలేజీలకు 2016-17 విద్యా సంవత్సరంలో అనుబంధ గుర్తింపు లభించింది. మరో 586 కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు అనుబంధ గుర్తింపును ఇవ్వలేదు. అందులో 349 కాలేజీలు అనధికారికంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్ చేసినవి ఉండగా, పక్కా భివనాలు లేకుండా షెడ్లలో కొనసాగుతున్నవి 85 ఉన్నాయి. 152 కాలేజీలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదు. వీటిపై బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపగా, షరతులతో అనుమతులు ఇవ్వాలని సూచించింది. దీంతో మూడు నెలల్లో ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ తెచ్చుకుంటామని, వచ్చే విద్యా సంవత్సరంలోగా పక్కా భవనాల్లోకి షిఫ్ట్ చేస్తామన్న షరతుతో బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 24 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆర్ఐవో ఎ.రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షకు 47,308, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 30,619 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం హైదరాబాద్ జిల్లాలో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ కన్వీనర్‌గా ఆర్ఐవో ఎ.రవికుమార్, సభ్యులుగా గవర్నమెంట్ సిటీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.చంద్రకళ, కస్తూర్భా బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతిమారెడ్డి, మహబూబియా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్యామూల్బాబు, జూనియర్ లెక్చరర్స్ ఆర్.సత్యానందం, డి.భద్రసేన్ తదితరులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డీవీఈవో కాశీనాథ్, ప్రభుత్వ కళాశాల సీనియర్ ప్రిన్సిపాల్ సి.హెచ్.హరీంద్రనాథ్, ఆయా సబ్జెక్టులలో నిష్ణాతులచే కూడిన హై పవర్ కమిటీని, 4 ఫ్లయింగ్, 4 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. -
ఇంటర్ విద్యార్థులకు ఊరట
పది నిముషాల వరకు ఓకే మినహాయింపునిచ్చిన ఇంటర్ బోర్డు సెక్రటరీ విశాఖపట్నం : తొలి రోజు ఒక్క నిముషం ఎఫెక్ట్‌తో పరీక్ష రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థుల ఆవేదనను ఇంటర్మీడియట్ బోర్డు అర్థం చేసుకుంది. పది నిముషాలపాటు మినహాయింపునిస్తూ బోర్డు సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఇంటర్మీడియట్ తొలి ఏడాది విద్యార్థులు గగ్గోలు పెట్టిన విషయం పత్రికల్లో ప్రముఖంగా రావడంతో ఇంటర్మీడియట్ బోర్డు స్థానిక అధికారులు బోర్డు సెక్రటరీ ఎం.వి.సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం పావుగంటైనా అనుమతించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అభ్యర్థన రావడంతో గురువారం నుంచి పది నిముషాలపాటు మినహాయింపునిచ్చారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. రెండో రోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలకు జిల్లాలో 49,655 మంది హాజరు కావాల్సి ఉండగా 48,422 మంది పరీక్ష రాశారు. 1233 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ కేటగిరి పరిధిలో 46,020 మందికి 45,040మంది, ఓకేషనల్ కేటగిరిలో 3635 మందికి 3382మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 110 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షల్లో రెండోరోజు ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. స్టేట్ అబ్జర్వర్ బి.దివాకర్, ఆర్జేడీ రూఫస్ కుమార్ పరీక్షలను పర్యవేక్షించారు. -
బెస్ట్ ఆఫ్ లక్
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి 1,02,541 మంది విద్యార్థులు 110 పరీక్షా కేంద్రాలు ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఛాన్స్ విద్యార్థి దశలో ఎంతో కీలకమైన ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. జీవితాన్ని మలుపు తిప్పే ఈ పరీక్షలు బంగారు భవిష్యత్తుకు సోపానాలు వేస్తాయి. రేపటి మంచి రోజులకు భరోసా ఇస్తాయి. నేటి విద్యార్థులకు ఈ సంగతి తెలియంది కాదు.. అందుకే వారు అహర్నిశలూ శ్రమించారు. ఎన్నో ఆశలతో ఎగ్జామ్స్‌కు సిద్ధమయ్యారు. అయితే పరీక్షలు మొదలు కాబోతున్న వేళ కాస్త ఒత్తిడి, ఆందోళన సహజం. అందుకే విద్యార్థులంతా విజయం మీదే అని విశ్వసించండి.. మీమీద మీరు నమ్మకముంచండి. అంతా బాగుంటుందన్న పాజిటివ్ దృక్పథంతో పరీక్షకు సిద్ధం కండి.. ఆల్ ది బెస్ట్! విశాఖపట్నం: ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. బుధవారం నుంచి 21 తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వం ఈసారి ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించకూడదన్న కఠిన నిర్ణయం తీసుకుంది. అందువల్ల అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,02,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం 52,107 మంది, ద్వితీయ సంవత్సరం 50,434 మంది ఉన్నారు. ఇందుకోసం 110 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో నగరంలో 56, గ్రామీణ జిల్లాలో 41, మన్యంలో 13 సెంటర్లు ఉన్నాయి. వీటిలో 16 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జెరాక్స్ సెంటర్లను తెరవడానికి అనుమతించలేదు. ఒకవేళ తెరిస్తే నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. జంబ్లింగ్ విధానం జిల్లాలోని మొత్తం 110 కేంద్రాల్లో జంబ్లింగ్ విధానం లో పరీక్షలు జరగనున్నాయి. కానీ కళాశాలకు, కళాశాలకు మధ్య 30 కి.మీలకు పైగా దూరంతో పాటు ఆయా చోట్లకు బస్సు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఐదు కళాశాలలకు జంబ్లింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. దీంతో ఆ కళాశాలల్లో చదువుతు న్న దాదాపు 1200 మంది విద్యార్థులు అక్కడే పరీక్ష లు రాసుకునే వెసులుబాటు దక్కింది. వాటి వివరాలు.. కొయ్యూరు గిరిజన సంక్షేమ కళాశాల (బాలురు) ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కాలేజి పెదబయలు గిరిజన సంక్షేమశాఖ ఎస్టీ కళాశాల (బాలురు) అప్పర్ సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల జీకేవీధి గిరిజన సంక్షేమశాఖ ఎస్టీ కళాశాల (బాలికలు) సమస్యాత్మక కేంద్రాలు జిల్లావ్యాప్తంగా 16 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కేడీపేట గిరిజన సంక్షేమ కళాశాల (బాలురు), కొయ్యూరు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, అనంతగిరి గిరిజన సంక్షేమ కళాశాల (బాలికలు) అనంతగిరి గిరిజన కళాశాల, అరకువేలి ప్రభుత్వ కళాశాల, అరకువేలి ప్రభుత్వ కళాశాల, ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ కళాశాల(బాలురు), పెదబయలు ప్రభుత్వ జూనియర్ కాలేజి, హుకుంపేట ప్రభుత్వ కళాశాల, పాడేరు గిరిజనసంక్షేమ కళాశాల (బాలికలు), పాడేరు ప్రభుత్వ కళాశాల, జి.మాడుగుల అప్పర్ సీలేరు ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ కళాశాల, చింతపల్లి గిరిజన కళాశాల, చింతపల్లి గిరిజన సంక్షేమ కళాశాల (బాలికలు) జీకేవీధి సీసీ కెమెరాలతో నిఘా మరో వైపు ఈ ఏడాది సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సెంటరులో 2 నుంచి 4 వరకు అమరుస్తున్నారు. వీటికి తొలిసారిగా విశాఖలోని ఇంటర్ కార్యాలయం నుంచి హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయానికి ఇంటర్నెట్ ద్వారా అనుసంధానిస్తారు. దీంతో ఆయా కేంద్రాల్లో జరిగే పరీక్షల తీరును నేరుగా తెలుసుకో గలుగుతారు. దీని ద్వారా పరీక్షా కేంద్రాల్లో అవకతవకలు, అక్రమాలు, మాస్‌కాపీయింగ్‌ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముందుగానే చేరుకోవాలి పరీక్షలు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. 9 గంటలు దాటాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే విద్యార్థి భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉం ది. అలాగే విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌పై తమ పేరు, హాల్‌టిక్కెట్ నంబరు, మీడియం, సబ్జెక్టుతో ఆధార్ నంబరు సరిగా ఉందో లేదో సరి చూసుకోవాలి. -
27న ఎథిక్స్, 30 ఎన్విరాన్మెంటల్ పరీక్షలు
వెల్లడించిన ఇంటర్మీడియట్ బోర్డు హైదరాబాద్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్వాల్య్సూ పరీక్షను ఈనెల 27న నిర్వహించనున్నారు. 30వ తేదీ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్‌పై పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలను విద్యార్థులందరూ తప్పనిసరిగా రాసి అర్హత సాధించాల్సి ఉంటుందని బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు నామినల్ రోల్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. -
జూనియర్ అధ్యాపకులకు జరిమానా
'మీరు ఇంటర్ మూల్యాంకనం సరిగా చేయలేదు. విద్యార్థుల జవాబు పత్రాలు సరిగా దిద్దలేదు. జవాబుకు తగిన మార్కులు వేయలేదు. మార్కులను సరిగా కూడకుండా తప్పు వేశారు. మీరు చేసిన తప్పులకు విద్యార్థులు నష్టపోయారు. విద్యార్థులు నష్టపోయినందుకు మీరు బోర్డుకు జరిమానా చెల్లించాలి' అంటూ ఇంటర్ బోర్డు జూనియర్ అధ్యాపకులకు నోటీసులు జారీ చేసింది. 2015 ఏప్రిల్‌లో మూల్యాంకనానికి హాజరై తప్పులు చేసిన అధ్యాపకులకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో వందల సంఖ్యలో విద్యార్థులు రీ వాల్యూయేషన్‌కు వెళ్లడంతో డొల్లతనం బట్టబయలైంది. నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనంటూ ఇంటర్ బోర్డు అధికారులు రాష్ట్రంలోని 2,387 మంది అధ్యాపకులకు నోటీసులు జారీ చేసింది. ఒక్కో అధ్యాపకుడికి వారు చేసిన తప్పుల అధారంగా రూ. వెయ్యి నుంచి 15,000 వరకు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. -
విద్యా సమాచారం
వచ్చే నెల 18వరకు ఇంటర్ ఫీజు చెల్లింపు గడువు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ప్రకటించింది. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు, హాజరు మినహాయింపుతో (కాలేజీకి వె ళ్లకుండా) పరీక్షలు రాసే విద్యార్థులు వచ్చే నెల 18 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొంది. అయితే ఇప్పటివరకు రూ.300గా ఉన్న ఫీజును రూ.360కు పెంచారు. ఇదీ ఫీజు చెల్లింపు షెడ్యూలు ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 18 ఆఖరి తేదీ. రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబరు 9 వరకు. రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబరు 10 నుంచి 22 వరకు. రూ. 1000 ఆలస్య రుసుముతో డిసెంబరు 23 నుంచి 2016 జనవరి 6 వరకు. రూ. 2000 ఆలస్య రుసుముతో 2016 జనవరి 7 నుంచి 22 వరకు. రూ. 4000 ఆలస్య రుసుముతో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 5 వరకు. రూ. 6000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 6 నుంచి 25 వరకు. వెబ్సైట్లో ఏఈఈ ప్రాథమిక కీ సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకొని ఈ ‘కీ’ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం కమిషన్ వెబ్సైట్లో ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచారు. జేఎన్టీయూహెచ్ నేటి ఎంటెక్ పరీక్షలు వాయిదా హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ పరిధిలో ఈ నెల 20న జరుగనున్న ఎంటెక్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆ వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ డాక్టర్ బి. ఆంజనేయప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో ఆ రోజు జరగాల్సిన ఎంటెక్ పరీక్షలను ఈ నెల 26న యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేటి ఓయూ పరీక్షలు కూడా... హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం (20న) జరగాల్సిన వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ భిక్షమయ్య తెలిపారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించినందున నేటి పరీక్షలను వాయిదా వేశామన్నారు. తిరిగి నిర్వహించు పరీక్షల తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. ఓయూ ఎల్ఎల్బీ ఫలితాలు విడుదల హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఆగస్టులో జరిగిన ఎల్ఎల్బీ (మూడు, ఐదో ఏడాది) కోర్సుల మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీ క్షల ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఫలితాలు, ఇతర వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పారు. డీఎడ్ కాలేజీల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సిబ్బంది, సదుపాయాలకు సంబంధించి మంగళవారం నిర్వహించనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా పడింది. సెలవు దినం కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సదుపాయాల కల్పనలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన 109 కాలేజీలకు విద్యాశాఖ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ కాలేజీల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొంది. అయితే తిరిగి వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. 27న ఎమ్మెస్సీ నర్సింగ్ తుది విడత కౌన్సెలింగ్ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల 27వ తేదీన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఎండీ (ఆయుర్వేద, హోమియో) కోర్సుల్లో అడ్మిషన్లకు జరిగే కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియను వర్సిటీలోనే నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 30న ఎండీ ఆయుర్వేద, 31న ఎండీ హోమి యో కోర్సులకు ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు వివరించారు. మరిన్ని వివరా లు వర్సిటీ (Http: ntruhs.ap.nic.in) వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. -
మార్చి 11 నుంచి ఇంటర్ పరీక్షలు!
-
మార్చి 11 నుంచి ఇంటర్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగా ప్రశ్నపత్రాలతో ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన షెడ్యూలును ఇంటర్మీడియెట్ బోర్డు సిద్ధం చేసి ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఆమోదానికి పంపించింది. అయితే షెడ్యూలు ఒకటే అయినా ప్రశ్నపత్రాలు మాత్రం వేర్వేరుగానే ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు ఉత్తర్వులను ఒకటీ రెండు రోజుల్లో జారీ చేసి, బోర్డు కార్యదర్శిని నియమించి షెడ్యూలు జారీ చేయాలని భావిస్తోంది. మొదట మార్చి 4వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలు చేసినా, పని దినాలు సరిపోవన్న నిర్ణయానికి ప్రస్తుత బోర్డు వచ్చింది. మరోవైపు జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 4న, ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఉన్నందున మార్చి 18వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణ కుదరనే అభిప్రాయానికి వచ్చారు. అందుకనుగుణంగా కాస్త ముందుగా, అంటే మార్చి 11వ తేదీ నుంచే ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలును ఖరారు చేసింది. తెలంగాణ బోర్డు కార్యదర్శి నియామకం జరిగిన వెంటనే తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఈనెల 13వ తేదీలోగా పరీక్షలపై ప్రభుత్వాల నిర్ణయాలను తెలియజేయాలని ప్రస్తుత ఇంటర్ బోర్డు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఇటీవలే లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారాన్ని తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. త్వరగా తేల్చాలని సీఎస్‌కు విజప్తి.. ఇంటర్మీడియెట్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, విద్యావేత్త చుక్కా రామయ్య తదితరులు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను వార్షిక పరీక్షలకంటే ముందుగానే నిర్వహించాల్సి ఉంటుందని సీఎస్‌కు వివరించారు. ఇందులో భాగంగా షెడ్యూలును వెంటనే జారీ చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.